ఆత్మకూరు ఉపఎన్నికలో లక్ష మెజారిటీ కోసం లక్ష పాట్లు పడ్డారు వైసీపీ నేతలు. క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేశారు. బై ఎలక్షన్‌లో గెలిచినా లక్ష్యాన్ని చేరుకోకపోవడమే అధికారపార్టీ శిబిరంలో చర్చగా మారింది. ఆ అంశంపైనే పోస్టుమార్టం చేస్తున్నారట.
పార్టీ నేతల అనైక్యత వల్లే లక్ష మెజారిటీ రాలేదా?
ఆత్మకూరు ఉపఎన్నికలో టీడీపీ బరిలో లేకపోవడం.. బీజేపీ మాత్రమే బరిలో ఉండటంతో.. సులభంగా లక్ష ఓట్ల మెజారిటీ వస్తుందని వైసీపీ నేతలు ఆశించారు. ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ప్రచారంలో తలమునకలై రణతంత్రం రచించారు కూడా. అంతా లక్ష నామస్మరణే చేశారు. తీరా ఫలితాల్లో వైసీపీ మెజారిటీ మార్కు 82 వేల 888 దగ్గరే ఆగిపోయింది. ఏకపక్షంగా సాగిన పోలింగ్‌లోనూ అనుకున్న టార్గెట్ రీచ్ కాకపోవడంతో అక్కడి అధికారపార్టీ నేతల మధ్య అనైక్యత బయటపడింది. ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి గెలుపు కంటే.. ఆ అంశంపైనే ఎక్కువ చర్చ జరుగుతోంది.
వైసీపీలో ఒక వర్గం పోలింగ్‌కు దూరంగా ఉందా?
ఆత్మకూరు నియోజకవర్గంలో గ్రామస్థాయిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉపఎన్నికలపై ప్రభావం చూపినట్టు అనుమానిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సమయంలోనే ఇక్కడ ఎలక్షన్ ఇంఛార్జులుగా వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని గమనించారు. ముందుగా పార్టీ నేతలకు బ్రేయిన్ వాష్ చేశారు. కలిసి ఉంటే కలదు సుఖమని గట్టిగా చెప్పి.. బుజ్జగించాల్సిన వారిని బుజ్జగించి.. అన్ని రకాలుగా కూల్ చేశారు నాయకులు. 2019లో 83 శాతం పోలింగ్ జరగ్గా.. ఉపఎన్నికలో లక్ష మెజారిటీ రావాలంటే అంతకంటే ఎక్కువ పోలింగ్ నమోదయ్యేలా చూడాలని సూచించారట. కానీ.. వైసీపీలోని ఒక వర్గం ఎన్నికలకు దూరంగా ఉందట. అలాగే ఓటర్లకు సరిగా డబ్బులు పంపణీ చేయలేదని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
‘లక్ష’ మెజారిటీపై బెట్టింగ్ కాసిన వాళ్లు కుదేలు
ఈ ప్రతికూల అంశాల మధ్య పోలింగ్ 64 శాతమే నమోదు కావడంతో వైసీపీ నేతలు కంగుతిన్నారు. లక్ష మెజారిటీ వస్తుందా రాదా అని బెంగపడ్డ నాయకులు అనేకమంది. చివరకు ఫలితాలు చూశాక వారి అనుమానమే నిజమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రచార సమయంలో చేసిన లక్ష మెజారిటీ ప్రకటనను విశ్వసించి.. బెట్టింగ్‌లు కాసిన పార్టీ నేతలు అనేక మంది షాక్ అయ్యారు. బీజేపీకి 5 వేల లోపు ఓట్లు వస్తాయని వేసిన అంచనాలు తలకిందులయ్యాయి. ఆ పార్టీకి 19 వేల ఓట్లు వచ్చాయి. అలాగే బీఎస్పీ, నోటాలకు కలిసి దాదాపు 8వేలకుపైగా ఓట్లు పోలయ్యాయి. ఆత్మకూరు పట్టణంలో కేవలం 9 వేల 500 మెజారిటీ రావడం కూడా వైసీపీ అంచనాలను బోల్తా కొట్టించింది.
ఫలితాలపై వైసీపీ నేతల పోస్టుమార్టం
ఆత్మకూరు మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్లు.. పార్టీ నేతల మధ్య సఖ్యత లేదు. పోలింగ్ రోజున చాలా మంది నాయకులు పూర్తిస్థాయిలో పనిచేయలేదట. ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లడంలోనూ శ్రద్ధ పెట్టలేదని గుర్తించారట. మొత్తానికి ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి తదితర నేతలు సమావేశమై పోస్టుమార్టం నిర్వహించినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలను తమవైపు తిప్పుకొన్నా ఆశించిన మెజారిటీ రాలేదని అభిప్రాయపడ్డారట. వైసీపీలో ఉంటూ సహకరించని వారిపై ప్రత్యేకంగా చర్చించినట్టు సమాచారం. గ్రామస్థాయిలో పార్టీ నేతల మధ్య విభేదాలపైనా సమగ్రంగా ఒక నివేదిక తయారు చేసి సీఎం జగన్‌కు ఇవ్వాలని భావిస్తున్నారట. మరి.. ఆ నివేదిక ఆధారంగా దిద్దుబాటు చర్యలు చేపడతారో.. లేక పనిచేయని వారిపై యాక్షన్ తీసుకుంటారో చూడాలి.