అధికార టీఆర్‌ఎస్ పార్టీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కొల్లాపూర్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మధ్య ఆధిపత్య పోరు తారా స్థాయికి చేరింది. గత ఎన్నికల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా జూపల్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ నుంచి గెలుపొందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి… హస్తానికి హ్యాండిచ్చి… కారు ఎక్కేశారు. దీంత కొల్లాపూర్ టిఆర్ఎస్‌లో అగ్గి రాజుకుంది. తాజా, మాజీ నేతల మధ్య ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా సఖ్యత కుదరడం లేదు. అధిష్టానం కూడా దీన్ని పట్టించుకోకపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి మధ్య వార్ నడుస్తోంది. నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికే టిఆర్ఎస్ అధిష్ఠానం ప్రాధాన్య మిస్తుండడంతో జూపల్లి వర్గీయులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటూ కృష్ణారావుపై ఒత్తిడి తీసుకొస్తున్నట్టు సమాచారం. ఓ దశలో జూపల్లి కృష్ణారావు పార్టీ వీడుతున్నాడంటూ ప్రచారం జోరుగా జరిగింది. అయితే, ప్రస్తుతానికి అధికార పార్టీలోనే కొనసాగి… వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కించుకోవాలని జూపల్లి చూస్తున్నట్టు తెలుస్తోంది. ఒక వేళ పార్టీ సస్పెండ్ చేస్తే తనకు మరోరకంగా మేలు జరుగుతుందని జూపల్లి అండ్ టీం లెక్కలు వేసుకుంటున్నాయి.
జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఒకే పార్టీలోనే ఉన్నా… బద్ద శత్రువులుగా మారిపోయారు. దీంతో ఒకరిపై ఒకరు వ్యక్తిగత విమర్శలు చేసుకుంటున్నారు. గ్రామాల్లో సైతం టీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోయారు. ఫలితంగా రెండు వర్గాలు గొడవ పడుతున్నాయి. పరస్పర భౌతిక దాడులతో పోలీస్ స్టేషన్ల మెట్లెక్కుతున్నాయి. నేతలు ఇద్దరు ఎవరికి వారే తమ మాటే నెగ్గాలని చూస్తున్నారు. దీంతో పోలీసు అధికారులతో పాటు ఇతర అధికారులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు.
KLI కాలువ విషయంలోనూ వీరిద్దరి మద్య గొడవ జరిగింది. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగమైన డి-5 కాలువను పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం పూడ్చి వేశారు. అయితే, మాజీ మంత్రి జూపల్లి దీనిని తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. డి-5 కాలువను పూడ్చడాన్ని నిరసిస్తూ కొల్లాపూర్ నుండి రైతులు, కార్యకర్తలతో కలిసి సున్నపురాయి తండాకు పాదయాత్ర చేశారు. దీనంతటికి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డే కారకుడని ఎమ్మెల్యేను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు జూపల్లి. అదే సమయంలో ప్రాజెక్టుల కారణంగా భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లింపులో వివక్ష చూపుతున్నారని ఆరోపిస్తున్నారు జూపల్లి. అంతేకాదు… ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన బ్రిడ్జికి ప్రభుత్వం నుంచి పాతిక కోట్ల రూపాయలు తీసుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. జూపల్లి వ్యక్తి గత విమర్శలకు దీటుగా బదులిచ్చారు ఎమ్మెల్యే బీరం. బ్యాంకులను జూపల్లి కుటుంబం మోసగించిన విషయం జనం ఇంకా మర్చిపోలేదంటూ విమర్శలు చేశారు. ఇకనైనా జూపల్లి స్వార్ధ రాజకీయాలు మానుకోవాలన్నారు బీరం.
మొత్తానికి కొల్లాపూర్ నియోజక వర్గంలో అధికార, విపక్షాల పాత్రల్ని TRS నాయకులు పోషిస్తున్నారనే టాక్ నడుస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి వీళ్లలో ఎవరు అధికార పక్షంలో ఉంటారో? ఎవరు ప్రత్యర్థి పార్టీలో చేరుతారనే చర్చ జరుగుతోంది. అయితే, ఇంత జరుగుతున్న కొల్లాపూర్ వైపు కన్నెత్తి చూడడం లేదు అధినాయకత్వం. నేతల ఆధిపత్యపోరు వల్ల పార్టీకి తీరని నష్టం జరుగుతుందని… ఇప్పటికైనా హైకమాండ్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలంటోంది క్యాడర్.