అధికార వైసీపీ భీమవరంలో ప్రత్యేక పొలిటికల్ ఆపరేషన్ మొదలుపెట్టిందా? కుల సమీకరణాల ద్వారా పూర్తిస్థాయిలో పాగా వేయబోతుందా? ఎవరు ఎవరితో కలిసినా భీమవరాన్ని శత్రుదుర్బేధ్యం చేయాలని చూస్తోందా? వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పక్కాగా పావులు కదుపుతోందా? ఇంతకీ ఏంటా ఎత్తుగడలు?
సైలెంట్‌గా భీమవరంలో వైసీపీ పొలిటికల్ ఆపరేషన్..!
ఆపరేషన్ కుప్పం ద్వారా అధికార వైసీపీ చంద్రబాబు ఇలాకాలో ఏ విధంగా పాగా వేసిందో చూశాం. చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నారే తప్ప.. అక్కడ పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సత్తా చాటింది వైసీపీ. ఇదే సమయంలో చాపకింద నీరులా అధికారపార్టీ చేపట్టిన మరో పొలిటికల్ ఆపరేషన్ భీమవరం. 2019లో జనసేనాని పవన్ కల్యాణ్ ఇక్కడ నుంచి పోటీ చేసి వైసీపీ చేతిలో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి పవన్ భీమవరం నుంచి పోటీ చేస్తారో లేదో కానీ.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని చాలా సైలెంట్‌గా భీమవరంలో రాజకీయ పావులు కదుపుతోంది అధికార పార్టీ. భీమవరానికే చెందిన కొయ్యే మోషేన్‌రాజును ఏపీ శాసనమండలి ఛైర్మన్‌ను చేయడంతో ఆ ఆపరేషన్‌పై స్థానికంగా చర్చ మొదలైంది.
బీసీ, ఎస్సీ, ముస్లింలు, క్షత్రియులు వైసీపీ అండగా ఉన్నారని వాదన..!
భీమవరానికి పదవుల పంపకంలో వైసీపీ ప్రాధాన్యం..!
గత ఎన్నికల్లో సుమారు 8 వేల ఓట్ల తేడాతో పవన్ కల్యాణ్ ఓడిపోయారు. భీమవరంలో 2 లక్షల 53వేల వరకు ఓటర్లు ఉన్నారు. ఓ అంచనా ప్రకారం వీరిలో కాపు సామాజికవర్గ ఓటర్లు 80 వేల వరకు ఉంటారు. గౌడ.. శెట్టిబలిజ సామాజికవర్గ ఓటర్లు 40 వేల నుంచి 50 వేల మంది. ఎస్సీ సామాజికవర్గ ఓటర్లు 30 వేల మంది.. అగ్నికుల క్షత్రియులు 15 వేలు.. క్షత్రియులు 8 వేల మంది.. ముస్లింలు ఐదారు వేల మంది ఓటర్లు ఉంటారు. 2019 ఎన్నికల్లో కాపు సామాజికవర్గం పవన్ వైపు మొగ్గు చూపడటంతో 62 వేల పైచిలుకు ఓట్లు పడ్డాయి. టీడీపీ అభ్యర్థికి 54 వేల ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి గ్రంధి శ్రీనివాస్‌కు 70వేల ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీసీలు, ఎస్సీలు.. క్షత్రియులు, ముస్లింలు వైసీపీకి అండగా నిలిచారన్నది ఆ పార్టీ చెప్పేమాట. కాపు సామాజికవర్గానికి చెందిన ఓట్లలో పదివేల వరకు వైసీపీకి పడ్డాయనే వాదన ఉన్నా.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వర్గం దాన్ని కొట్టిపారేస్తోంది. అస్సలు తమకు ఆ వర్గం నుంచి ఓట్లు పడలేదని వాదిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలాచోట్ల టీడీపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. రానున్న రోజుల్లో ఈ బంధం బలపడి.. పవన్ కల్యాణ్ మరోసారి భీమవరం నుంచి బరిలో దిగితే ఏంటన్నదే ఇప్పుడు ప్రశ్న. అందుకే భీమవరంలో వైసీపీ సైలెంట్‌గా పావులు కదుపుతూ వెళ్తోందని అనుకుంటున్నారు. అక్కడ జరుగుతున్న పదవుల పంపకం.. ఇస్తున్న ప్రాధాన్యం దాన్ని బలపరుస్తోంది.
డీసీఎంఎస్ ఛైర్మన్‌గా బీసీ నేత వేండ్ర వెంకటస్వామి..!
ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మోషేన్‌రాజు మండలి ఛైర్మన్..!
టీడీపీ, జనసేన కలిసినా భీమవరంలో ఓట్ల లెక్కల్లో తేడా రాకుండా ఉండేదుకు.. వాళ్ల ఓటు బ్యాంక్ పెరగకుండా.. ఇతర సామాజికవర్గాలను ఆకర్షించే పనిలో పడింది వైసీపీ. బలమైన శెట్టిబలిజ- గౌడ వర్గాలకు పదవులు కట్టబెడుతోంది. ఆ వర్గాల్లో బలమైన నేతగా ఉన్న భీమవరానికి చెందిన వేండ్ర వెంకటస్వామిని DCMS ఛైర్మన్‌ను చేసింది. ఇటీవల ప్రకటించిన గౌడ, శెట్టిబలిజ కార్పొరేషన్లలోనూ భీమవరానికే చెందిన వారికి డైరెక్టర్లుగా పదవులు ఇచ్చింది అధికారపార్టీ. ఆర్థికంగా బలమైన క్షత్రియ సామాజికవర్గం మరోసారి టీడీపీ వైపు మొగ్గు చూపకుండా వాళ్లకే పదవుల పందేరం చేస్తోంది. మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజును క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్‌ను చేయడంతోపాటు.. బలమైన గోకరాజు కుటుంబాన్ని ఒడిసి పట్టింది వైసీపీ. ఇప్పుడు ఎస్సీ సామాజికవర్గానికి చెందిన కొయ్యే మోషేన్‌రాజును MLCని చేయడంతోపాటు ఏకంగా శాసనమండలి ఛైర్మన్‌ను చేశారు. మోషేన్‌రాజు ఎస్సీ సామాజికవర్గమే అయినా.. అన్ని వర్గాలతోనూ ఆయనకు సఖ్యత ఉంది. ఆయనకిచ్చే ప్రాధాన్యం పార్టీకి కలిసి వస్తుందనే అంచనాలు వైసీపీ వర్గాల్లో ఉన్నాయి.
భీమవరాన్ని పూర్తిస్థాయిలో వైసీపీకి కంచుకోటగా మార్చేందుకు భవిష్యత్‌లో మరిన్ని పదవులు ఇక్కడి నేతలకు ఇవ్వొచ్చని అనుకుంటున్నారు. మరి.. అధికారపార్టీ వ్యూహం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలి.