దశాబ్దాల తరబడి నెత్తిన పెట్టుకుని మోసినా, ఇప్పుడు ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినా… ఆ టీడీపీ సీనియర్ నేత సంతృప్తిగా లేరు ఎందుకు? జీవిత కాలం పదవులు అనుభవించినా… ఆయనకు ఆ ఒక్క కోరిక మాత్రం మిగిలిపోయే ఉందా? అది తీరితే తప్ప ఆయనకు మనశ్శాంతి ఉండదా? ఎవరా సీనియర్ లీడర్? ఏంటాయన కోరిక? దాన్ని తీర్చాలన్న ఉద్దేశ్యం అస్సలు టీడీపీ అధిష్టానానికి ఉందా?.
టీడీపీ ఆవిర్భావం నుంచి మెడలో పసుపు కండువా తప్ప మరోటి తెలియని అతి కొద్ది మంది నాయకుల్లో ఒకరు యనమల రామకృష్ణుడు. అలాగే పార్టీ కూడా ఆయన్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూనే వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో అయినా, విడిపోయాక అయినా… పార్టీ పవర్‌లో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా… యనమల పదవికి మాత్రం ఢోకా లేకుండా నడిచింది. అయితే… తొలిసారి ఈ విడత గెలిచాక తనను పక్కన పెట్టేయడాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారట ఈ సీనియర్. ఎంతైనా… అలవాటుపడ్డ ప్రాణం కదా… అందుకే కుదురుగా ఉండలేక ఏదో ఒకటి మాట్లాడుతూ … తన ఉనికి చాటుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఇప్పటికే మీకు చాలా ఇచ్చేసింది. ఇక చాలు హ్యాపీగా రిటైర్ అవ్వండని పెద్దలు చెబుతుంటే… ఆయన మాత్రం… ఒక్క కోరిక. ఫైనల్‌గా ఇంకొక్క కోరిక. అదొక్కటి తీరిస్తేచాలు…. మీరు చెప్పినట్టే నాపాటికి నేను ఓ మూలకు వెళ్లి మాడిపోయిన మసాలా దోశ తింటూ టైం పాస్ చేస్తానని అంటున్నారట. కానీ… పార్టీ వర్గాలు మాత్రం… అదేమన్నా పద్ధతా? ఆ కోరిక అసలు తీరే అవకాశం ఉందా? రామా…కృష్ణా… అనుకోమని పార్టీ పెద్దలు చెబుతుంటే… ఈ రామకృష్ణుడు మాత్రం గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని మాట్లాడుకుంటున్నట్టు సమాచారం.
ఆ మధ్యనే ఎమ్మెల్సీగా రిటైర్ అయ్యారాయన. తన మాట తనకే చుట్టుకుంటుదని అంచనా వేయలేక గత ఎన్నికలకి ముందు యువత రాజకీయాల్లోకి రావాలని భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు మాజీ మంత్రి. దానికి అనుగుణంగా కుమార్తె దివ్యకు తుని అసెంబ్లీ టిక్కెట్ ఇప్పించుకున్నారు. ఆమె గెలిచారు. అలాగే…చిన్నల్లుడు మహేష్ యాదవ్ ఏలూరు ఎంపీగా, వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యేగా ఉన్నారు. కుటుంబం నుంచి ఇంత మందికి పదవులు ఉన్నా… రామకృష్ణుడు మాత్రం అయితే నాకేంటి… నా చిరకాల కోరిక సంగతేంటి అంటున్నారు. ఇన్నాళ్లు ఎన్ని పదవుల్లో ఉన్నా… దాహం తీరలేదని, ఒక్కసారి రాజ్యసభకు పంపితే… పరిపూర్ణంగా ఆ పదవిని అనుభవించి హ్యాపీగా రిటైరవుతానని టీడీపీ అధిష్టానానికి చెబుతున్నారట.చాలాసార్లు టీడీపీ పెద్దల దగ్గర ప్రపోజల్స్ పెట్టినా… చూద్దామంటూ వాయిదాలు తప్ప క్లారిటీ మాత్రం రావడం లేదు. అందుకే… ఇక ఇలాగైతే లాభం లేదనుకుని… మెల్లిగా వాయిస్ పెంచుతున్నారాయన. గతంలో ఏది ఉన్నా… నాలుగు గోడల మధ్యనే పార్టీ పెద్దలకు చెప్పే అలవాటున్న యనమల ఈ మధ్య పబ్లిక్‌గా ఓపెన్ అవుతున్నారు.
Also Read: Andhra King Taluka Trailer: ఫ్యాన్స్‌ను ఎగతాళి చేశాడు రా.. ఆడికి మనమేంటో చూపెట్టాలి!
రాజ్యసభ సభ్యుడిగా చేయాలనేది తన జీవిత కాలపు కోరిక అని, అది వస్తుందా రాదా అనేది అధిష్టానమే నిర్ణయించాలంటూ తాజాగా కూడా కార్యకర్తల సమావేశంలో మాట్లాడ్డం చర్చనీయాంశం అవుతోంది. తాను ఎప్పుడూ పదవులు కోరుకోలేదని వాటంత అవే తన దగ్గరికి వచ్చాయంటూ సరికొత్తగా స్వరం సవరించుకోవడాన్ని చూస్తున్న వాళ్ళు మాత్రం… అంటే ఇన్నాళ్ళు పార్టీకి దిక్కులేక ఆయనకు పదవులు ఇచ్చిందా అంటూ కాస్త సెటైరికల్‌గానే మాట్లాడుకుంటున్నారట. ప్రస్తుతం రాజ్యసభలో టిడిపికి ఒక్క సభ్యుడే ఉన్నారు. ఇక మీదట ఖాళీ అయ్యే సీట్లలో టిడిపికి అవకాశం వచ్చినా… రకరకాల ప్రాధాన్యతల దృష్ట్యా యనమలకు ఇచ్చే ఆలోచన కూడా చేయడం లేదు అధిష్టానం. కానీ… ఆయన మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా ఛాన్స్ దొరికినప్పుడల్లా తన కోరికను బయటపెడుతుండటంతో…ఈయనకు అర్ధంకావడం లేదా? లేక అయ్యి కూడా ఓ రాయి వేసి చూద్దామని అనుకుంటున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి తూర్పు గోదావరి పొలిటికల్ సర్కిల్స్‌లో. పార్టీలోకి కొత్త రక్తం రావాలని ఆయనే చెప్పారు. అందుకు అనుగుణంగా ఆయనకు బదులు తన కుమార్తెకు టిక్కెట్ ఇచ్చారు. మొత్తం కలిపి కుటుంబంలో మూడు పదవులు ఉన్నాయి. ఇంకా… నా కోరిక కోరిక అని పదే పదే చెబుతుంటే… పార్టీలో ఇంకెవరికీ అవకాశాలు ఇవ్వవద్దా అన్న ప్రశ్నలు వస్తున్నాయి టీడీపీ కేడర్‌లో. పార్టీ ఆయనకు రిటైర్మెంట్ ఇచ్చేసింది. హుందాగా పక్కకు తప్పుకోకుండా గొంతెమ్మ కోరికలు కోరడం సమంజసమేనా అని చర్చించుకుంటున్నారట. ఈ విడత ప్రభుత్వం వచ్చాక ఫస్ట్‌టైం తనకు పదవి లేకపోయేసరికి ఆయన అంత కంఫర్ట్‌గా లేరని, అందుకే… మొదట బీసీ కార్డ్ వాడినట్టు అంచనా వేస్తున్నారు.
ఆ తర్వాత బహిరంగ లేఖలతో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. మళ్లీ ఇప్పుడు ప్రతిపక్షంలో కసి పెరిగిందని వాళ్లను సీరియస్ తీసుకోవాలని అంటున్నారంటే… అది నన్ను గుర్తించండని చెప్పడం తప్ప మరోటి కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. అంటే… ఇప్పుడు యనమలకు పదవి ఇచ్చేస్తే… ప్రతిపక్షం ఉన్నఫళంగా వీక్ అయిపోతుందా అన్న సెటైర్స్ సైతం పడుతున్నాయి. అయినా… చక్కగా ఫ్యామిలీ ప్యాకేజ్ ఇచ్చినా సంతృప్తి పడకుండా ఇంకా అడిషనల్ బెనిఫిట్స్ అడగడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు పార్చీ నాయకులు. మొత్తానికి ఒక్కసారి నన్ను పెద్దల సభకు పంపండి మహాప్రభో… అక్కడ అధ్యక్ష మహోదయ్ అంటే తప్ప నాకు మనశ్శాంతి లేదని యనమల రామకృష్ణు చేస్తున్న విన్నపాలను టీడీపీ అధిష్టానం ఎంత వరకు పట్టించుకుంటుందో చూడాలి.