తెలంగాణ కాంగ్రెస్‌కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి త్వరలో గుడ్‌బై చెబుతారా? వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని అందుకే ప్రకటించారా? ఇంతకీ జగ్గారెడ్డి మనసులో ఏముంది? కాంగ్రెస్‌లో నాన్ సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారా.. లేక ఆయన నిర్ణయాలు కామెడీగా ఉంటున్నాయా?
తన తీరుతో ఎప్పుడూ చర్చల్లో ఉంటారు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. సొంత పార్టీ నాయకులను తిట్టినా… ప్రత్యర్ధి నేతలపై విమర్శలు ఎక్కుపెట్టినా… రాజకీయంగా చర్చలో ఉండాలని అనుకుంటారు జగ్గారెడ్డి. ఇప్పుడు కొత్త చర్చకు తెర లేపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు. సంగారెడ్డిలో తన భార్య నిర్మల పోటీ చేస్తారని కేడర్‌కు, అనుచరులకు క్లారిటీ ఇచ్చారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో భార్యను బరిలో నిలిపితే.. జగ్గారెడ్డి ఏం చేస్తారు? ఇంతకీ ఆయన మనసులో ఏముంది అనేది పార్టీలో హాట్ టాపిక్.
జగ్గారెడ్డి… తెలంగాణ రాజకీయాలపై కంటే పొరుగురాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారట. ఏపీలో ఫుల్ టైం పార్టీ కోసం ఇవ్వాలని చూస్తున్నారట. తెలంగాణలో పార్టీలో అంతర్గత పంచాయితీలు ఎక్కువ అయ్యాయని.. అలాంటి చోట ఉండేకన్నా.. ఏపీలో పార్టీ కోసం ఫుల్ టైమ్ ఇచ్చి పనిచేస్తా అని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి, అగ్రనేత రాహుల్‌గాంధీకి లేఖ రాయాలని జగ్గారెడ్డి నిర్ణయించారట. ఒకటి రెండు రోజుల్లో లేఖ రాసేస్తారట. ఏపీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీ కోసం మరింత ఎక్కువగా పనిచేస్తానని లేఖలో కోరబోతున్నట్టు సంకేతాలు ఇస్తున్నారు.
జగ్గారెడ్డి ఏపీవైపు చూడటానికి కూడా కారణం ఉందట. ఆయన తల్లి జమ్మయమ్మ సొంతూరు కృష్ణాజిల్లా మైలవరం పక్కన కోడూరు. అక్కడ ANMగా జమ్మయమ్మ పనిచేసేవారు. ఉద్యోగంపై సంగారెడ్డి మండలం ఇంద్రకరణ్ గ్రామానికి వచ్చి.. ఇక్కడే పెళ్లి చేసుకున్నారు. ఆమెది ఎస్సీ సామాజికవర్గం. వివాహం తర్వాత జగ్గారెడ్డి తల్లిదండ్రులు సంగారెడ్డిలోనే సెటిల్ అయ్యారు. అందుకే పుట్టినిల్లు తెలంగాణ.. అమ్మమ్మగారి ఊరు ఆంధ్రప్రదేశ్ అంటూ ఉంటారు జగ్గారెడ్డి. ఈ కారణాలతోనే ఏపీలో కాంగ్రెస్ బాధ్యతలు ఇస్తే.. అక్కడికి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారట. పైగా ఏపీసీసీ చీఫ్ శైలజానాథ్, జగ్గారెడ్డి మిత్రులు. కలిసి పనిచేయాలని అనుకుంటున్నారట. ఒకవేళ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే.. ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మైలవరంలో బరిలో దిగాలనే ఆలోచనలో ఉన్నారట జగ్గారెడ్డి.
చాలా రోజులుగా తన తల్లిదండ్రుల పేరుతో ట్రస్ట్ ఏర్పాటు.. విద్యా, వైద్యరంగాల్లో పేద విద్యార్థులకు సేవ చేయాలనే తలంపుతో ఉన్నారు జగ్గారెడ్డి. సంగారెడ్డిలో నిర్మల పోటీ చేస్తే.. ఇక్కడి పార్టీ బాధ్యతలు భార్యతోపాటు కుమార్తె జయారెడ్డికి అప్పగించే ప్రణాళికలు వేస్తున్నారట. ప్రస్తుతం వ్యాపారంతోపాటు.. ఏపీ వ్యవహారాలపై కసరత్తు చేస్తున్నారట. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జగ్గారెడ్డి లేకుండా సంగారెడ్డిలో గెలవడం ఈజీనా అనే చర్చ కాంగ్రెస్‌లో ఉందట. ఆయన నిజంగానే ఏపీకి వెళ్తారా? ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో సమైక్య నినాదం ఎత్తుకున్న జగ్గారెడ్డికి ఏపీలో ఆదరణ ఉంటుందా? వైసీపీ, టీడీపీ బలంగా ఉన్న మైలవరంలో ఏ మేరకు ఆయన నెగ్గుకు రాగలరు అనే ప్రశ్నలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తర్వాత APలో కాంగ్రెస్ ఉనికి కోల్పోయిన పరిస్థితి. ఆ విషయం తెలిసి APకి వెళ్తారా అనేది మరికొందరి డౌట్. ఏదిఏమైనా ఇదంతా చూసిన వాళ్లకు మాత్రం జగ్గారెడ్డి నాన్ సీరియస్ పాలిటిక్స్ చేస్తున్నారనే అభిప్రాయం కలుగుతోందట.