Off The Record: నారు పోసిన వాడే నీరు పోయాలి. వద్దు వద్దంటున్నా… ఆయనే యుద్ధం చేయించారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు… ఇప్పుడు మాత్రం వదిలేస్తారా ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారా ఎమ్మెల్యే. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన ఆ వ్యాఖ్యల్లో వెటకారం ఉందా? లేక కాన్ఫిడెన్స్ ఉందా అన్నది అర్ధంగాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారట చాలామంది. ఎవరా ఎమ్మెల్యే? సీటు కిందికి నీళ్ళొచ్చినా… తడి గుడ్డేసుకుని కూర్చోవడం వెనక రీజన్స్ ఏంటి?
Read Also: NCRB Report: దేశంలో మహిళలపై అత్యధిక నేరాలు జరుగుతున్న రాష్ట్రం ఇదే.. తాజా నివేదిక..
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు ఆయన గారు. కానీ… కారులో పవర్ పోయాక ఏసీ ఆగిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారో ఏమోగానీ… ఠక్కున డోర్ తన్నుకుంటూ బయటపడ్డారు. తర్వాత ఏ మాత్రం ఆలస్యం చేయకుండా…జై తెలంగాణ నుంచి జై కాంగ్రెస్ అంటూ గోడ దూకేశారు దానం నాగేందర్. ఇంకేముంది… పార్టీ అధికారంలో ఉంది, నాకు సీనియార్టీ ఉంది.. కాబట్టి అలా చేరీ చేరగానే పిలిచి మరీ కేబినెట్‌లో ఛైర్ వేసేస్తారని కలలుగన్నారాయన. కానీ, తానొకటి తలిస్తే దైవం మరోటి తలచినట్టయింది ఆయన పరిస్థితి. దానం ఆలోచన అలా ఉంటే.. సీఎం రేవంత్ రెడ్డి మరొకటి తలచారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో దూకిన ఎమ్మెల్యేని లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయించారు. బ్యాడ్‌లక్.. కాలం కలిసిరాకుంటే.. తాడే పామై కరిచినట్టు.. ఢిల్లీ బరిలో ఓటమి తప్పలేదు దానంకు. మంత్రి పదవి మీద మోజుతో తెలంగాణ భవన్ మీది నుంచి డైరెక్ట్‌గా గాంధీభవన్ మీదికి దూకేసినా.. ఆ లక్ష్యం నెరవేరలేదు, పోన్లే ఎంపీ అయిపోయి జాతీయ రాజకీయాల్లో ఉందామనుకున్నా అదీ.. అవలేదు. ఏదీ దక్కక తీవ్ర నిస్పృహలో ఉన్న నాగేందర్‌కు ఇప్పుడు మరో షాక్ తగిలింది.
Read Also: AP Govt: తప్పుడు ప్రచారం కట్టడిపై ఏపీ సర్కార్ నిఘా.. మంత్రుల కమిటీ ఏర్పాటు
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక కూడా ఊడిపోయినట్లు మంత్రి దక్కలేదు, ఎంపీ అవలేదుగానీ.. ఉన్న ఎమ్మెల్యే పదవికే ఎసరు వచ్చింది. ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్.. ఆ పదవికి రాజీనామా చేయకుండానే.. కాంగ్రెస్‌లో చేరి హస్తం పార్టీ బీ ఫామ్ మీద సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్ధిగా పోటీచేశారు. ఇక్కడే అడ్డంగా దొరికిపోయారాయన. పార్టీ ఫిరాయింపుల చట్టంలో భాగంగా సుప్రీం మెట్లెక్కింది బీఆర్‌ఎస్. 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరినప్పటికీ వారంతా టెక్నికల్ రీజన్స్ చూపించి ఏదో విధంగా ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకున్నా.. దానం నాగేందర్ పదవిపై మాత్రం కత్తివేలాడుతోందన్న మెజార్టీ అభిప్రాయం. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేయడమన్నది ఇక్కడ తిరుగులేని సాక్ష్యంగా కనిపిస్తోంది. నాగేందర్‌పై స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో సుప్రీం కోర్ట్‌కు వెళ్లింది బీఆర్‌ఎస్.
Read Also: Tribal Students Death: అనారోగ్యంతో గిరిజన విద్యార్థినులు మృతి.. భయాందోళనలో తల్లితండ్రులు
నిర్ణీత గడువులోగా నిర్ణయం తీసుకోవాలని కోర్ట్ చెప్పడంతో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను, వాళ్లపై ఫిర్యాదు చేసిన వారిని పిలిచి స్పీకర్ విచారణ మొదలుపెట్టారు. దానం మాత్రం కొంత సమయం అడిగారు. పార్టీ ఫిరాయింపులు ఎదుర్కొంటున్న మిగతా వాళ్ళు సాంకేతిక కారణాలు చూపి బయటపడ్డా దానం మాత్రం తప్పించుకునే అవకాశాలు చాలా పరిమితంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఆయన మాత్రం మౌన ముని పాత్ర పోషిస్తున్నారు. ఏంటి సార్ మీరు చాలా కూల్‌గా ఉన్నారంటే.. నాకేం భయం.. నారు పోసినవాడే నీరు పోస్తాడు. పార్టీలోకి రమ్మని ఆహ్వానించింది సీఎం… ఆ తర్వాత వద్దు మొర్రో అంటున్నా వినకుండా సికింద్రాబాద్ టికెట్ ఇచ్చి ఎంపీగా పోటీచేయించింది కూడా ఆయనే. భారీగా ఖర్చుపెట్టించింది కూడా ముఖ్యమంత్రే. ఇన్ని చేసిన సీఎం ఇప్పుడు మాత్రం ఏదో ఒకటి చేయకుండా ఉంటారా? ఆయనే చేయాలి, చేస్తారు కూడా అంటూ ఒకలాంటి అటాకింగ్ మోడ్‌లో మాట్లాడుతున్నారట ఖైరతాబాద్ ఎమ్మెల్యే.ఈ ఎటాక్ వెనుక బాగా.. ఎటకారం కూడా దాగి ఉందన్నది విశ్లేషకుల మాట. మరి దానంను సీఎం ఆగం చేస్తారా? అక్కున చేర్చుకుంటారా అన్నది చూడాలి.
