బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. తెలుగు రాష్ట్రాల్లోని వెనకబడిన తరగతులకు.. రాజకీయ పార్టీలకు ఆయన సుపరిచితం. అలాంటి నాయకుడు ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో చర్చగా మారారు. దానికి కారణం ఆయన్ను రాజ్యసభకు వైసీపీ ఎంపిక చేయడమే. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆర్ కృష్ణయ్యకు ఇస్తారనే చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన తాడేపల్లిలో కనిపించారు. వైసీపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీసీల సంక్షేమం .. హక్కుల సాధన కోసం ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన కృష్ణయ్యకు ఏపీ, తెలంగాణలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. ముఖ్యంగా బీసీ ఓట్ బ్యాంక్‌ను పోలరైజ్ చేస్తారనే లెక్కలతో వైసీపీ ఆయన వైపు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
ఆర్ కృష్ణయ్య మొదటిసారి 2014లో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. టీడీపీ నుంచి ఎల్బీనగర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి.. మిర్యాలగూడ నుంచి 2018లో అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి అన్ని పార్టీలతో సమాన దూరం పాటిస్తూ వస్తున్నారు కృష్ణయ్య. అలాంటిది ఇప్పుడు సడెన్‌గా ఏపీలో తేలారు. ఆయన్ని వైసీపీ రాజ్యసభకు ఎంపిక చేయడం వెనక కారణాలపై రాజకీయ విశ్లేషణలు జోరందుకున్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ, నామినేటెడ్‌తోపాటు వివిధ పదవుల్లో బీసీ సామాజికవర్గాలకు పెద్ద పీట వేస్తున్నారు. కేబినెట్‌లోనే పది మంది మంత్రులు బీసీలు ఉన్నారు. టీడీపీకి కీలక ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను వైసీపీవైపు తిప్పుకొనే వ్యూహంలో భాగంగా చాలా మందికి పదవులు ఇచ్చారు. ఇప్పుడు ఆ కోణంలోనే కృష్ణయ్యకు పెద్ద పదవి ఆఫర్ చేసినట్టు భావిస్తున్నారు.
గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డితో కూడా కృష్ణయ్యకు సంబంధాలు ఉండేవి. అవి కూడా ప్రస్తుతం కృష్ణయ్య వైపు వైసీపీ మొగ్గు చూపడానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు. ఏతావాతా చూస్తే.. వైసీపీ తాజా ఎత్తుగడ రాజకీయంగా పెద్ద అస్త్రంగానే అభిప్రాయ పడుతున్నారు. బీసీలకు పెద్దపీట వేయడం ద్వారా ఆ వర్గాలకు మరింత చేరువయ్యేందుకు వీలు కలుగుతుందని అధికారపార్టీ శిబిరంలోనూ లెక్కలతో కుస్తీ పడుతున్నారట. మరి.. ఈ ఎత్తుగడ వైసీపీకి ఏ మాత్రం వర్కవుట్ అవుతుందో చూడాలి.