తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుంటే.. కాంగ్రెస్ పోటీ చేస్తోంది రెండు చోట్లే. మరి.. మిగిలిన నాలుగు స్థానాల్లో హస్తం వ్యూహం ఏంటి? పోటీకి దూరంగా ఉన్న జిల్లాల్లో ఎవరిపై గురి పెడుతోంది? లెట్స్ వాచ్..!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహం ఏంటి?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న ఆరుచోట్లా క్యాంప్ రాజకీయాలు ఊపందుకున్నాయి. గెలిచే బలం ఉన్న పార్టీ సైతం ముందు జాగ్రత్త పడుతోంది. ఓటర్లుగా ఉన్న స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను తీసుకుని గోవా వరకు వెళ్లిపోయారు. ఈ రాజకీయ వేడిలో కాంగ్రెస్ వ్యూహం ఏంటి? ఖమ్మం, మెదక్ జిల్లాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. మిగిలిన నాలుగుచోట్ల వేస్తున్న ఎత్తుగడలేంటి? ప్రత్యర్థి శిబిరాల్లోనూ.. గాంధీభవన్ వర్గాల్లోనూ ఆసక్తి కలిగిస్తున్న అంశాలివే..!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గట్టిగానే వర్కవుట్ చేస్తోన్న కాంగ్రెస్..!
ఉమ్మడి మెదక్ జిల్లాలో జగ్గారెడ్డి ఎత్తులు.. జిత్తులు ఏంటి?
ఖమ్మం జిల్లాలో బరిలో ఉన్న రాయల్ నాగేశ్వరరావు కోసం గట్టిగానే వర్కవుట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. అధికార టీఆర్‌ఎస్ బలంతో పోల్చితే చాలా వెనకబడి ఉన్నా.. ఏదైనా మ్యాజిక్ జరక్కపోతుందా అన్నది ఆ పార్టీ వాదన. ఈ ఎమ్మెల్సీ నియోజకవర్గంలో కామ్రేడ్లకూ బలం ఉంది. వారు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేస్తారా లేక టీఆర్‌ఎస్‌కు మద్దతు ప్రకటిస్తారా అన్నది స్పష్టత లేదు. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి భార్య నిర్మల కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. భార్యను గెలిపించుకునేందుకు జగ్గారెడ్డి అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారట. అయితే అధికారపార్టీ వ్యూహాల ముందు ఆయన ఎత్తులు జిత్తులు ఎంత వరకు పారతాయో చూడాలి. టీఆర్‌ఎస్‌తో పోల్చితే ఆర్థిక, అంగ బలాన్ని ఎదుర్కోవాలంటే జగ్గారెడ్డికి సాధ్యమా అన్నది ప్రశ్న. ఇక్కడ కాంగ్రెస్‌కు కలిసొచ్చే అంశాలపై పార్టీ నేతలు లెక్కలేస్తున్నారు.
బలమైన స్వతంత్ర అభ్యర్థులకు కాంగ్రెస్ మద్దతు?
ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో కాంగ్రెస్‌కు 2 వందల పైచిలుకు ఓట్లు ఉన్నాయి. అక్కడ అధికార పార్టీకి కాకుండా.. బరిలో ఉన్న బలమైన అభ్యర్థికి మద్దతివ్వాలని పార్టీ సూచించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఇండిపెండెంట్‌గా బరిలో ఉన్న టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి రవీందర్‌సింగ్‌కు మద్దతివ్వాలనే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టు సమాచారం. ఈ దిశగా స్థానిక నాయకత్వాలకు ఆదేశాలు వెళ్లాయట. ఆదిలాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి లేకపోయినా.. స్థానిక నాయకులు చేస్తున్న పనులపై పార్టీకి ఫిర్యాదులు అందుతున్నాయి. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్‌సాగర్‌రావు కాంగ్రెస్ ఓటర్లతో సమావేశాలు నిర్వహిస్తున్నారట. ఆయన ప్రయత్నాలు కాంగ్రెస్‌కు అనుకూలమా లేక ఆయన వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా అన్నది పార్టీ వర్గాలకు అంతుచిక్కడం లేదట.
బరిలో లేకున్నా అధికారపార్టీని గురి పెట్టాలనే ఆలోచన..!
బరిలో లేకున్నా అధికారపార్టీ అభ్యర్థులపై గురి పెట్టాలి అన్నది కాంగ్రెస్ వాదన. అయితే ఆ నాలుగు చోట్ల ఈ వ్యూహం ఎంత వరకు వర్కవుట్ అవుతుందో క్లారిటీ లేదు. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ మాట వింటారా? క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి రచ్చ చేస్తారా? అన్నది గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి.. ప్లానింగ్‌లో కాంగ్రెస్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.