బీజేపీలో ఈటెల స్థానం ఏంటి? సముచిత గౌరవం దక్కుతుందా? సీనియారిటీకి తగ్గ గుర్తింపు లభిస్తుందా? ఇప్పుడు ఇలాంటి చర్చే మొదలైంది. సీనియారిటీకి తగ్గట్టే ఈటలకు పదవీ దక్కుతుందంటున్నాయి పార్టీ వర్గాలు. ఇంతకీ ఈటెలకోసం బీజేపీ సిద్ధం చేస్తున్న ఆ కుర్చీ ఏంటి? ఇప్పటికే ఆ కుర్చీలో కూర్చున్నవారి పరిస్థితి ఏంటి?
టీఆర్‌ఎస్ నుంచి ఎంత వేగంగా బయటకొచ్చారో.. అంతే వేగంగా బీజేపీలో చేరిపోయారు ఈటల రాజేందర్. అధికార పార్టీని ఢీ కొట్టి హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించి తీరారు. నిన్నటిదాకా నియోజక వర్గంపై దృష్టి సారించిన ఈటలకు ఇప్పుడు బీజేపీ అప్పజెప్పబోయే బాధ్యతలు ఏంటి అన్నది ఆసక్తికరంగా మారుతోంది. వదిలి వచ్చిన పార్టీలో ఈటల స్థానం చాలా పెద్దది, అదేస్థాయి గౌరవం ఇప్పుడు బీజేపీలో దక్కుతుందా? లేదా? అన్న ఉత్కంట ఆయన అనుచరుల్లో కనిపిస్తోంది.
సాధారణంగా పార్టీల శాసన సభ పక్ష నేతలుగా సీనియర్ల కు, అనుభవజ్ఞులకు అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రజాదరణ ఉన్న నేతలకు ఆ బాధ్యతలు అప్పగిస్తారు. బీజేపీ లో కూడా అంతే, గతం లో బీజేపీ పక్ష నేతలుగా పార్టీ సీనియర్ లు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు లాంటి వాళ్ళు పని చేసారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజాసింగ్ ఒక్కడె ఎమ్మెల్యేగా ఉండటంతో అతనే ఫ్లోర్ లీడర్‌గా ఉన్నారు. తర్వాత రఘునందన్‌ను ప్లోర్ లీడర్‌ను ప్రచారం జరిగింది. దీని ద్వారా రఘునందన్‌కు, రాజా సింగ్ మధ్య కాస్త గ్యాప్‌కూడా వచ్చింది. పార్టీ మాత్రం ఫ్లోర్ లీడర్‌ను మార్చే అవకాశంలేదని చెప్పడంతో అప్పుడా చర్చకు ఫుల్‌స్టాప్ పడింది. కానీ! ఇప్పుడు ఈటల ఎంట్రీతో సీన్ మారింది.
సీనియర్‌నే ఫ్లోర్ లీడర్‌ను చేస్తూ వచ్చిన బీజేపీలో ఇప్పుడు మళ్లీ చర్చ మొదలైంది. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో సీనియర్ కావడం, గతంలో ఫ్లోర్ లీడర్‌గా పనిచేసిన అనుభవం ఉండటం, అధికార పక్షం గురించి అన్ని తెలిసిన వ్యక్తి కావడంతో రాజాసింగ్‌ను తొలగించి ఆస్థానంలో ఈటలను కూర్చోబెడతారని పార్టీలో చర్చ నడుస్తోంది. మరో వైపు రాజా సింగ్ కూడా లాంగ్వేజ్ సమస్య ఉంది. ఆయన హిందు , గో రక్షణ తప్ప మిగతా అంశాల పై అంత పర్ఫెక్ట్ కాదనే అభిప్రాయం ఉంది. బీజేపీ నాయకత్వం కూడా ఈటల ను పార్టీ శాసన సభ పక్ష నేతగా చేసేందుకే మొగ్గు చూపే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.