హుజురాబాద్ ఉప ఎన్నికకు ముందు చేరికలు టిఆర్ఎస్ కు ఎంత వరకు కలసి వచ్చాయి ? ఆ నలుగురు నేతల చేరికతో ప్లస్ అవుతుంది అనుకుంటే…అలాంటిదేమీ జరగలేదా? గులాబి పార్టీలో హుజూరాబాద్ ఫలితం తర్వాత జరుగుతున్న చర్చలేంటి?
హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది.టిఆర్ఎస్ పార్టీ ఆశించిన ఫలితం రాబట్టేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
దీంతో హుజురాబాద్ ఫలితంపై టిఆర్ఎస్ లో అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. ఓటమికి కారణాలపై ఎవరికి వారు విశ్లేషణలు చేస్తున్నారు. ఉపఎన్నికలో గెలుపు కోసం చేసిన ప్రయత్నాలపైనా చర్చ నడుస్తోంది. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన చేరికలు ఎంత వరకు కలసి వచ్చాయి అన్న కోణంలో చర్చ జరుగుతోంది.
ఉపఎన్నిక కంటే ముందు గులాబి పార్టీలో చేరికలు జరిగాయి. వరుసగా వివిధ పార్టీలకు చెందిన నేతలు అధికార పార్టీలోకి వచ్చారు. ఉప ఎన్నికను దృష్టిలో పెట్టుకుని కౌశిక్ రెడ్డి, ఎల్.రమణ, పెద్దిరెడ్డి, మోత్కుపల్లి నరసింహులు గులాబి కండువా కప్పుకున్నారు. భారీగా అనుచరగణం, అభిమానులతో కలసి టిఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు.
టియ్యారెస్ లో చేరిన కౌశిక్ రెడ్డి, పెద్ది రెడ్డి ఇద్దరూ హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన వారు. ఇటు ఎల్.రమణ బీసీ సామాజిక వర్గం, మోత్కుపల్లి నరసింహులు దళిత సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర స్థాయి నేతలు. వీరి చేరికతో ఉప ఎన్నికలో టిఆర్ఎస్ కు ఎంతో కొంత కలసి వస్తుందన్న విశ్లేషణలు జరిగాయి. అయితే హుజురాబాద్ ఫలితం వచ్చిన తర్వాత ఈ నేతల చేరికతో ఎంత లాభం జరిగింది …ఎన్ని ఓట్లు పడ్డాయన్న ప్రశ్నలు ఇపుడు వినిపిస్తున్నాయి.
ఈ నలుగురు నేతల చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ముందు టిఆర్ఎస్ ఆయా నేతల సామాజిక సమీకరణాలు… నేతలకున్న ఇమేజ్ ను పరిగణనలోకి తీసుకుంది. ఉప ఎన్నికలో ఎంతో కొంత కలసి వస్తుందని భావించింది. కానీ ఫలితాలు చూస్తే, ఇప్పడు అనేక ప్రశ్నలు లేవనెత్తే పరిస్థితి వచ్చింది. మరి హుజురాబాద్ ఫలితాలు ఈ నేతల రాజకీయ భవిష్యత్తుపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో అనే వాదనలు వినిపిస్తున్నాయి?