Munugode CPI Politics : కారుతో కలిసి నడవాలని కంకి-కొడవలి డిసైడ్ అయ్యింది. భవిష్యత్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకునే అడుగులు వేస్తున్నట్టు CPI ప్రకటించింది. ఈ క్రమంలో TRS ముందు CPI పెట్టిన డిమాండ్స్ ఏంటి? సీట్ల సర్దుబాటు కుదిరినట్టేనా..!? అదే జరిగితే సిట్టింగ్‌లలో ఎవరికి రెడ్ సిగ్నల్ పడనుంది? లెట్స్ వాచ్..!
మునుగోడు ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించింది CPI. బీజేపీని ఓడించడానికి కారు గుర్తుతో కలిసి పని చేస్తున్నట్టు చెబుతున్నా.. కామ్రేడ్స్ మనసులో వేరే లెక్క ఉందట. మునుగోడు నియోజకవర్గంలో CPIకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఒక్క CPIకే దాదాపు 15 వేలకు పైగా ఓట్లు ఉన్నట్టు అంచనా. మునుగోడులో CPI ఒంటరిగా పోటీ చేస్తే TRSకు నష్టం జరుగుతుందనే చర్చ ఉంది. అందుకే వ్యూహాత్మకంగా CPI నేతలతో సయోధ్యకు వచ్చారు గులాబీ దళపతి కేసీఆర్. ఇక CPM కూడా మునుగోడులో TRSకు మద్దతివ్వాలని డిసైడ్ అయ్యింది. ఈ విషయంలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఐక్యత ప్రదర్శించాయి. అయితే మద్దతు ప్రకటించే సందర్భంగా KCR ముందు CPI పెట్టిన డిమాండ్స్ ఏంటన్నదే ఆసక్తిగా మారింది.
తెలంగాణలో భారత కమ్యూనిస్ట్ పార్టీ వరసగా ఓడిపోతూ వస్తోంది. రాజకీయంగా ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది. అందుకే భవిష్యత్‌కు ఇప్పటి నుంచే బాటలు వేసుకోవాలనే నిర్ణయానికి వచ్చింది. వచ్చే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెటుకుని ముందే అధికార టీఆర్‌ఎస్‌తో సర్దుబాటు చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లాలో వైరా.. కొత్తగూడెం నియోజకవర్గాలను CPI అడుగుతున్నట్టు సమాచారం. అక్కడ రెండు సీట్లలోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావును TRS పక్కన పెడుతుందనే చర్చ ఉంది. వనమా కుమారుడు రాఘవ విషయంలో జరిగిన రచ్చతో రాజకీయంగా డ్యామేజీ జరిగిందనే అభిప్రాయం నెలకొంది. ఆ విధంగా కొత్తగూడెంను సీపీఐకి ఇవ్వొచ్చనే టాక్ నడుస్తోంది.
కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్ సీటును CPI రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కోసం అడుగుతున్నారట. ఈ సీటులో సీఎం కేసీఆర్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఫ్యామిలీ ప్రాతినిథ్యం వహిస్తోంది. మరి… CPI అడిగిందని హుస్నాబాద్‌ను TRS వదులుకుంటుందా లేక.. చాడాకు MLC ఆఫర్ చేస్తారా అనే చర్చ ఉంది. నల్లగొండలో బలంగా ఉండే.. మునుగోడు.. దేవరకొండల్లోనూ CPI కన్నేసినా.. మునుగోడును వదిలేసుకున్నట్టే. అయితే దేవరకొండను CPIకి ఇస్తుందా అన్నదే ప్రశ్న. ఇక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఉన్నారు. ఆయన గతంలో CPI నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా రవీంద్ర కుమార్ ప్రస్తుతం టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు. మరి.. రవీంద్ర కుమార్‌ను కాదని దేవరకొండను CPIకి ఇస్తారో లేదో కాలమే చెప్పాలి.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బెల్లంపల్లి నియోజకవర్గంలో సీపీఐకి కొంత పట్టు ఉంది. అక్కడా TRS ఎమ్మెల్యే ఉన్నారు. ఆ సీటు విషయంలో కామ్రేడ్లు గట్టిగా పట్టుబట్టే అవకాశాలు ఉన్నాయి. ఇలా పలు నియోజకవర్గాలపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది. అయితే మునుగోడు ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో ఇప్పుడే.. సాధారణ ఎన్నికల్లో సీట్లు ఇస్తామని టీఆర్ఎస్ హామీ ఇచ్చే పరిస్థితి ఉందా? లేక ఇంకేదైనా జరుగుతుందో చూడాలి.