తెలంగాణ సర్కార్.. కేంద్రంతో ఘర్షణ కోరుకోవడం లేదా? జలవనరుల శాఖ గెజిట్ విడుదల చేసిన తర్వాత తలెత్తిన సమస్యను.. ఏ విధంగా అధిగమించనుంది? పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ ఎంపీల వైఖరి ఎలా ఉండబోతుంది?
తెలంగాణ నీటివాటా కోసం పార్లమెంట్‌లో ఫైట్
కృష్ణా.. గోదావరి రివర్‌బోర్డు మేనేజ్‌మెంట్ పరిధిని నిర్ధారిస్తూ కేంద్రం ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ గెజిట్ పై తెలంగాణ ప్రభుత్వం న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపింది. అక్టోబర్ నుంచి గెజిట్ అమలులోకి వస్తున్నందున.. ఈలోపే న్యాయపోరాటం చేయాలన్న ఆలోచనలో సర్కార్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్లమెంట్ సమావేశాల్లో టీఆర్‌ఎస్ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు గులాబీ దళపతి కేసీఆర్. లోకసభ, రాజ్యసభల్లో సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాట కోసం మోడీ ప్రభుత్వాన్ని నిలదీయాలని.. గట్టిగా కొట్లాడాలని ఎంపీలకు సూచించారు.
read also : గెజిట్‌తో ఇరకాటంలో తెలంగాణ బీజేపీ నేతలు ?
గెజిట్‌పై కేంద్రంతో ఘర్షణ వైఖరి వద్దనే ఆలోచన!
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య కీలంగా మారిన గెజిట్ విషయంలో మాత్రం.. పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంతో ఘర్షణ వైఖరి అవలంభించకూడదనే అభిప్రాయం ఎంపీలతో జరిగిన సమావేశంలో వ్యక్తమైందట. సమస్య పరిష్కారానికి అనువైన మార్గాన్ని అన్వేషించాలని.. ఆ దిశగా అడుగులు వేయాలనే ఆలోచన టీఆర్‌ఎస్‌లో ఉందట. ప్రతి విషయంలో కేంద్రంతో ఘర్షణకు దిగబోమని సీఎం కేసీఆర్ గతంలోనే అసెంబ్లీలో స్పష్టం చేసారు. అయితే తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా కేంద్రం నిర్ణయాలు ఉంటే మాత్రం.. వ్యతిరేకిస్తామని నాడు కుండబద్దలు కొట్టారు. అందుకే ఇప్పుడు ఎంపీల సమావేశంలో ఆయన వెల్లడించిన అంశాలు ఆసక్తిగా మారాయట.
చర్చలు.. సమాలోచనలతోనే పరిష్కరించుకునే యోచన
పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను టీఆర్‌ఎస్ ఎంపీలు కలిసే అవకాశం ఉంది. గెజిట్‌పై తెలంగాణకు ఉన్న అభ్యంతరాలను కేంద్రమంత్రి దృష్టికి వారు తీసుకెళ్తారు. ముందు ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరపాలన్న వాదనను కేంద్రం ముందు ఉంచే వీలుంది. సాధ్యమైనంత వరకు చర్చలు.. సమాలోచనలతోనే సమస్యలను పరిష్కరించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారట.
గతంలోనూ కేంద్రంతో ఘర్షణ వైఖరి లేదు!
మొత్తంగా కేంద్రంతో సఖ్యంగా ఉంటూనే తెలంగాణ రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయాలన్నది గులాబీ శిబిరం యోచన. పార్లమెంట్ సమావేశాల్లో ఇదే వైఖరితో టీఆర్‌ఎస్ ఎంపీలు నడుచుకుంటారని చెబుతున్నారు. గతంలో కూడా వివిధ అంశాలలో కేంద్రంతో తెగేవరకు టీఆర్‌ఎస్ సర్కార్ లాగలేదు. ఇకపై కూడా అదే వైఖరితో ముందుకెళ్తూ.. పనులు సాధించుకోవాలని ఎంపీలకు స్పష్టం చేశారట కేసీఆర్. కాకపోతే సున్నితమైన జల వివాదాల అంశంలో కర్ర విరగకుండా పాము చావకుండా టీఆర్‌ఎస్ నడిపే రాజకీయం ఎంత వరకు నెగ్గుకొస్తుందన్నదే ఉత్కంఠ రేపుతోంది.