Off The record: కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఆందోళన తెలంగాణలో తేడా కొడుతోందా? ఆ పార్టీ డిఫెన్స్‌లో పడే పరిస్థితి వస్తోందా? బీజేపీ రివర్స్ అటాక్ మొదలు పెట్టిందా? అందుకు సమాధానం చెప్పుకోవడం ఇక్కడి అధికార పార్టీ నేతలకు ఇబ్బందిగా మారిందా? ఇంతకీ ఏ రూపంలో రివర్స్ అటాకింగ్ మొదలు పెట్టింది కాషాయ దళం? హస్తం ఎలా ఉక్కిరి బిక్కిరి అవుతోంది?..
దేశ వ్యాప్తంగా ఓట్ చోరీ ఆందోళనతో ఓ రేంజ్‌లో జనంలోకి వెళ్ళే ప్లాన్‌లో ఉంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న బీహార్‌లో బైక్ ర్యాలీలు, ఇతర ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. మిగతా చోట్ల ఎలా ఉన్నా… తెలంగాణలో మాత్రం ఈ విషయంలో రచ్చ అయ్యేట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇక్కడ హస్తం మీదికి బాణాలు ఎక్కుపెడుతోంది కమలం.
Read Also: Manoj Tiwary: ఎంఎస్ ధోనీకి నేను నచ్చను.. తన కాంపౌండ్ ఆటగాళ్లకే ఛాన్సులు!
లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగి ఉంటే… అంతకు ఆరు నెలల ముందు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మీరెలా గెలిచారు? మీకు అధికారం ఎలా వచ్చింది? ఆ ఆరునెలల వ్యవధిలో స్వల్ప మార్పులే తప్ప ఓటర్స్ లిస్ట్‌లో భారీ మార్పులేవీ జరగలేదు కదా అని ప్రశ్నిస్తున్నారు కమలం నాయకులు. దొంగ ఓట్లను తొలగించి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి సిద్ధమా అని కూడా సవాల్ చేస్తున్నారు. దీంతో… తెలంగాణ వరకు ఒక రకంగా కాంగ్రెస్ డిఫెన్స్‌లో పడ్డట్టే కనిపిస్తోందని అంటున్నారు. ఈ వ్యవహారంలో ఆ పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఏం మాట్లాడినా… నడుస్తుందేమోగానీ… ఇక్కడ, అధికారంలో ఉన్న రాష్ట్రంలో అలా నడవకపోవచ్చన్న అభిప్రాయాలు పెరుగుతున్నాయి. ఆచితూచి మాట్లాడకుంటే ఎదురు దెబ్బలు తగులుతాయన్న సలహాలు సైతం వినిపిస్తున్నాయి. అయితే…పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఓట్ చోరీ తుట్టెను కదిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓటు చోరీ కి పాల్పడిందని… దొంగ ఓట్లతోనే 8 ఎంపీ సీట్లు గెలిచిందని ఆరోపించారాయన. పీసీసీ చీఫ్ వ్యాఖ్యలకు బీజేపీ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల సంగతి ఏంటని, రాష్ట్రంలో దొంగ ఓట్లతోనే గెలిచారా అని ప్రశ్నిస్తోంది.
Read Also: STOCK MARKET : భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
ఇక, కాంగ్రెస్ కూడా 8 ఎంపీ సీట్లు గెలిచింది కదా.. మరి ఆ సంగతేంటని అడుగుతున్నారు కాషాయ నేతలు. లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీనే కదా.. అధికార యంత్రాంగం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే ఉందికదా…. మరి బీజేపీ ఓట్ల దొంగతనానికి పాల్పడితే మీరెందుకు మౌనంగా ఉన్నారని గట్టిగా అడుగుతున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. 64 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ కి ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 6 నెలల లోపే పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచినప్పుడు ఉన్న ఓటర్ జాబితా తోనే లోక్‌సభ ఎన్నికలు జరిగాయని చెబుతున్నారు బీజేపీ లీడర్స్. ఒక వేళ ఓటర్ జాబితా ఫేక్ అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న 64 మంది ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారన్నది బీజేపీ క్వశ్చన్. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పోలింగ్ ఏజెంట్స్ లేరా, వాళ్ళంతా బూత్‌ల దగ్గర ఏం చేశారంటూ నిలదీస్తోంది బీజేపీ. నిజంగానే మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించినట్టు దొంగ ఓట్లు ఉంటే… వాటిని తొలగించి మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధమా అని సవాల్ చేస్తున్నారు బీజేపీ నేతలు. కాంగ్రెస్ చీఫ్ తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడారని అంటోంది బీజేపీ. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో రెండు పార్టీల మధ్య ఓటర్ లిస్ట్ కుస్తీలు మొదలైనట్టయింది.