ఆర్‌ఆర్‌ఆర్ అనబడే రౌద్రం రుధిరం రణం చిత్రంలోని దోస్తీ పాటను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. సంగీత దర్శకుడు కీరవాణి నిర్దేశంలో గాయకుడు హేమచంద్ర పాడిన సీతారామశాస్త్రి పాట చిత్రంలో చిత్రణ అలా వుంచితే విడుదలచేసిన ట్రైలర్‌లో కూడా ఉద్వేగభరితంగా వుంది. గిరిజనులను కదిలించి పోరాడిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ల మధ్య వూహాజనిత స్నేహం దాని పరిణామం చిత్రకథ గనక స్నేహగీతం విడుదల చేయడం కూడా సముచితమే.
పులికి విలుకానికి,తలకూ వురితాడుకూ కదిలే కార్చిచ్చుకు కసిరే వడగళ్లకూ రవికీ మేఘానికి దోస్తీ వూహించని చిత్ర విచిత్ర్రం స్నేహానికి సాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో ఈ దోస్తి అటూ హేమచంద్ర రసవత్తరంగా ఆలపిస్తారు. బడబాగ్నికిీ జడివానకు దోస్తీ, విధిరాతకు ఎదురీతకు దోస్తీ, పెనుజ్వాలకు హిమనగమిచ్చిన కౌగిలి ఈ దోస్తీ అంటూ మరింతపట్టుగా సాగుతుంది. కీరవాణి హేమచంద్ర మాత్రమే గాక ఆఖరులో రామ్‌చరణ్,్‌ఎన్టీఆర్‌లు రావడం బట్టి ఈ పాట ప్రమోషన్‌ఏ స్తాయిలో వుండేది తెలుస్తుంది.
ఈ పాటలో పరస్పర విరుద్ధమైన రెండు ప్రకృతి శక్తులను లేదా అంశాలను పోల్చిచూపడం పోటీపెట్టడం ఆకట్టుకుంటుంది.కాని ఇద్దరు మిత్రులు సమవుజ్జీలు చైతన్యవంతులూ అయినప్పుడు పాటలోని పదాలు ఎలా పొసుగుతాయనే సందేహం వేస్తుంది.విలుకాడు,ఉరితాడు,విధిరాత, మేఘం వంటివాటికి పోటీ సహజంగా లేదు.కొన్ని ఖచ్చితంగా నిలవవు. పైగా పాటలో జ్వాలలు చాలా వున్నాయి. కావాలని చిత్రంలో పాత్రల ను గురించి సూచించడానికి ఇలా చేశారా చెప్పలేము గాని కొన్ని బొత్తిగా కుదరడం లేదు. పాట రెండోభాగం వుందంటున్నారు గనక వేచి చూడవలసిందే