మాజీ మంత్రి ఈటల రాజేందర్ టిఆర్‌ఎస్‌కూ, శాసనసభ్యత్వానికీ రాజీనామా చేసి బిజెపిలో చేరిపోయారు. ఢిల్లీలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా సమక్షంలో చేరతారని వార్తలు వచ్చినా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే ఈ చేరికకు ఆధ్వర్యం వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాష్ట్ర బిజెపి ఇన్‌చార్జి తరుణ్‌చుగ్ తదితరులతో కలసి తర్వాత నడ్డాను కలిసి ఆ లోటు భర్తీ చేసుకోవలసి వచ్చింది. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ ఎంపీ రమేష్‌రాథోడ్, మాజీ జెడ్పీ ఛైర్మన్ తుల ఉమ, ఆర్టీసీ సంఘం నేత అశ్వద్ధామ రెడ్డి తదితరులు చేరినా టీఆర్‌ఎస్‌లో తిరుగుబాటు చాయలేమీ ఆయన తీసుకురాలేకపోయారు. అసమ్మతివాదులను కూడగట్టి దుమారం సృష్టిస్తారని మొదట ప్రచారం జరిగినా చివరకు ఈటెల బిజెపిలో చేరడం సాదాసీదా పార్టీ మార్పుగానే పరిణమించడం అనివార్య పరిణామం, ఆయన అదేపనిగా చెప్పిన ఆత్మగౌరవ పోరాటం ఈ విధంగా అధికార అస్తిత్వ ఆరాటంగా ముగియడం ఇందుకు ప్రధాన కారణం. ఆయన చెప్పిన కమ్యూనిస్టు భావజాలం సామాజిక న్యాయం వంటి అంశాలకు బిజెపిలో చేరికతో విలువ లేకుండా పోయింది. ఈ కారణంగా ఆయన చాలామందిలో సానుభూతిని పోగొట్టుకుని మరింత వ్యతిరేకత తెచ్చుకోవచ్చు కూడా. ఈటెల స్వతంత్రంగా పోటీ పడితే బలపర్చేవారమని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్య ఇందుకో ఉదాహరణ. ఇప్పుడు పోటీ టిఆర్‌ఎస్, బిజెపి రాజకీయ సమరంగా మారిపోయింది. ఆయన రాజీనామా చేసిన హుజూరాబాద్‌లో ఉపఎన్నిక ఎప్పుడువస్తుందో గానీ ఓట్లు టిఆర్‌ఎస్ నుంచి ఈటలకు మారడం ఆయనతో పాటు బిజెపికి చేరడం అంత సులభం కాదు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ మూకుమ్మడిగా చేసే దాడిని తట్టుకుని నెట్టుకురావడం ఈటలతో పాటు బిజెపికీ పెద్ద సవాలే. ఈ నియోజకవర్గం బిజెపి రాష్ట్ర అద్యక్షుని పార్లమెంటరీ స్థానం పరిధిలోకి వస్తుంది గనక ఆయనకూ వ్యక్తిగత సవాలుగావుంటుంది.
ఈటల రాజేందర్‌పై చర్యతో టిఆర్‌ఎస్‌లో ముసలం పుడుతుందనీ, సామాజిక శక్తులతో ప్రత్యామ్నాయ వేదిక వెలుస్తుందని చాలా కథలు నడిచాయి. అవి నిజం కాకపోగా అధికార పార్టీయే ఎక్కువగా ఎదురుదాడి సాగించింది. ఈటల వాస్తవానికి ఆయన కాంగ్రెస్, బిజెపి నాయకులను కలుసుకున్నదే ఎక్కువ. టిఆర్‌స్‌తో బిజెపి కలవబోదని ఈటల హామీ కోరారని చెప్పారు.. గాని వారు సూటిగా అలాంటిదేమీ ఇచ్చింది లేదు, ఎన్నికల్లో విడిగానే పోరాడతామనిమాత్రం చెప్పారట. అదెలాగూ తప్పదు. టిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్.. బిజెపి కేంద్రం విధానాలను విమర్శిస్తూనే వ్యూహాత్మకంగా అప్పుడప్పుడు మద్దతుగా మాట్లాడటం, రాజ్యసభలో అనుకూలంగా వ్యవహరించడం తెలిసిన విషయాలే. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం కెసిఆర్ సర్కారు కూడా తమ మనుగడకు అవసరమైన వ్యూహాలే అనుసరిస్తాయి. గాని ఈటల కోసం హామీలు ఇచ్చే అవకాశం వుండదు. ఆత్మగౌరవం అనే మాట అదేపనిగా వినిపించిన మాజీ మంత్రి ఆ విషయమై బిజెపికి ఎలాంటి షరతులు పెట్టినట్టు కనిపించదు. నరేంద్రమోడీ, అమిత్‌షా ద్వయం అక్కడ అన్నింటినీ నిర్ణయిస్తుందని దేశమంతటికీ తెలుసు. తెలంగాణతో సహా దేశంలో రాష్ట్రాల హక్కులపై మొత్తంగా దాడి చేసిన చరిత్ర మోడీ సర్కారుది. వారి రాజకీయ నినాదం హిందూత్వ సిద్దాంతం, అనేక కులమతాలు, సామాజిక తరగతుల ఆత్మగౌరవం దెబ్బతీస్తుందన్న విమర్శ దేశమంతా వుంది. ఈ పరిస్థితులలో ఈటెల బిజెపిలోచేరడం అస్తిత్వ పరిరక్షణ కోసం తప్ప అంతకు మించి చెప్పేవన్నీ మిథ్యమాత్రమే,
మిగిలిన విషయాలన్నీ అలా వుంచి దక్షిణ భారతంలో బిజెపికి అవకాశం చాలా తక్కువ. ఒక్క కర్ణాటకలో అది కూడా గాలి జనార్ధన్‌రెడ్డి గనుల డబ్బు, యెడ్యూరప్ప కుటిల నీతి కలిసి బిజెపి అరకొర బలంతో అధికారం సాగిస్తున్నది. మిగిలిన ఎక్కడైనా దాని ప్రభావం నామమాత్రం. కేరళలో మొన్న పూర్తి భంగపాటుకు గురికాగా తమిళనాడులో నాలుగేళ్లుగా అన్నా డీఎంకేను ఆడిస్తూ ఆఖరుకు పొత్తులో నాలుగు స్థానాలు తెచ్చుకున్నారు. తెలంగాణలోనూ దుబ్బాకలో చాలా తక్కువ ఆధిక్యతతో గెలిచి సర్జికల్ స్ట్రయిక్స్ నినాదంతో జిహెచ్‌ఎంసిలో గణనీయమైన స్థానాలు తెచ్చుకున్నా తర్వాత వివిధ ఎన్నికల్లో పెద్ద ప్రభావం చూపింది లేదు. ఎంఎల్‌సి ఎన్నికల్లో వున్న స్థానం కోల్పోయారు. నాగార్జునసాగర్‌లో అతితక్కువతో సరిపెట్టుకున్నారు. తాజా కార్పొరేషన్ ఎన్నికల్లోనూ డిటోడిటో. 2018 ఎన్నికలతో పోలిస్తే 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుజూరాబాద్ లోబిజెపికి 24 వేల ఓట్ల వరకూ వచ్చిన మాట నిజమే గాని ఆ సన్నివేశం వేరు. ఈటల కారుదిగి కమలంతగిలించుకున్నా.. ఈటలకు లేదా ఆయన కుటుంబ సభ్యులకు పాత ఓటింగు వస్తుందా అనేది ఉప ఎన్నికల నాటికి కాని తేలనివిషయం. వీటికి దూరంగా వుండిపోయిన కమ్యూనిస్టుపార్టీలపై అనవసరంగా వ్యాఖ్యలు చేసి ఉభయ పార్టీల కార్యదర్శులతో అక్షింతలు వేయించుకోవడం ఈటెల స్వయంకృతం. ఆయన మాటలకు ఆయనే వ్యతిరేకంగా వ్యవహరించారు గనక ఆ ప్రశ్నలన్నీ వచ్చాయిగాని ఆత్మరక్షణకు ఉపయోగపడే అధికార పార్టీలో చేరతానని ఆయన మొదటే ప్రకటించి వుంటే అది వేరుగా వుండేది.
టిఆర్‌ఎస్‌ను ఎవరైనా వ్యతిరేకించవచ్చు.. దాని విధానాల మీద పెరిగే ప్రజా సమస్యల మీద తప్పక పోరాడవచ్చు.. కానీ, ఆ పేరుతో బిజెపిని తెచ్చి ప్రతిష్టిస్తామంటే దేశమంతటా సాగుతున్న వారి పాలనపై పెల్లుబుకుతున్న విమర్శలే వెక్కిరిస్తాయి. సంప్రదాయికంగా ఆ పార్టీకి ఇక్కడ అంత పునాది కూడా లేదు. తెలంగాణలో ఎప్పటి నుంచో బిజెపి హేమాహేమీలు వున్నారు. ఇద్దరు ముగ్గురు తప్పితే వారిలో అత్యధికులకు గవర్నర్ పదవులు, పార్టీ పదవులే దక్కాయి. కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చాక రెండు తెలుగు రాష్ట్రాలలో చాలామంది ప్రముఖులు బిజెపిలో చేరారు. వారు చాలా నిరీక్షణ తర్వాత ఆ పార్టీలో కార్యదర్శులు, ఉపాద్యక్షులు అయ్యారేమో గాని ఎన్నికలరంగంలో విజయం సాధించింది లేదు. తెలంగాణలోనే అలాంటి చాలాపెద్ద నిరీక్షక జాబితా వుంది. బెంగాల్ వంటి రాష్ట్రాల్లో బిజెపిలో చేరిన వారు ఘర్ వాపసీ అంటూ తిరిగి టిఎంసిలో చేరిపోతున్నారు. యుపి, కర్ణాటకల్లో చక్రం తిప్పిన యోగి, యెడ్యూరప్పలే భవిత గురించి మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఈటల రాజేందర్ బృందం టిబిజెపిలో చేరడం వల్ల ఒరిగేదేమిటన్నది సందేహమే. ఏదిఏమైనా ఇది స్వంత పార్టీలోఆరోపణలకు గురై అధినేతచే వెళ్లగొట్టబడిన ఒక నాయకుడి అస్తిత్వ ఘర్షణే గనక అంత పెద్ద ప్రశ్నలు కూడా అనవసరమే అవుతుంది. విజ్ఞులైన ప్రజలు ఎప్పుడు ఎవరికి నేర్పాల్సిన పాఠాలు వారికి నేర్పిస్తారు.