పార్వతీపురం మన్యం జిల్లాలో కురుపాం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ రెండుసార్లు వైసీపీ జెండా రెపరెపలాంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జెండా ఎగరేయాలన్నది కేడర్ ఆలోచనగా ఉంటే.. నాయకుల వర్గపోరు ప్రమాద సంకేతాలు ఇస్తోందట. కురుపాం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా తోయక జగదీశ్వరిని నియమించినప్పటి నుంచీ పరిస్థితి మారిపోయిందనేది తమ్ముళ్ల మాట. ఇంఛార్జ్ నియామకాన్ని లోకల్ పార్టీ నేతలు లక్ష్మణరావు, సత్యనారాయణ వ్యతిరేకిస్తున్నారు. కలిసి పనిచేయడానికి అస్సలు ముందుకు రావడం లేదట.
ఇంఛార్జ్ జగదీశ్వరికి మాజీ మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అండదండలు ఉండడంతో ఇన్నాళ్లూ అసమ్మతి బయట పడలేదు. అలా అని కలిసి సాగే పరిస్థితి లేదు. ఇటీవల అసమ్మతి వర్గం వేరేగా కార్యక్రమాలు చేపట్టడం చర్చగా మారింది. ప్రస్తుతం కురుపాంలో టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. మినీ మహానాడు, బాదుడే బాదుడు కార్యక్రమాల్లోనూ ఎవరి కుంపటి వాళ్లదే. మినీ మహానాడును వేర్వేరుగా చేపట్టడం వర్గపోరు తీవ్రతను తెలియజేస్తోంది. పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నా.. శత్రుచర్ల కానీ.. కేంద్ర మాజీ మంత్రి కిశోర్ చంద్రదేవ్‌కానీ సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవడం లేదట.
కురుపాం వైసీపీ ఎమ్మెల్యేగా మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్పశ్రీవాణి ఉన్నారు. ఆమెను వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే టీడీపీ ఐక్యంగా కదలాలన్నది తెలుగు తమ్ముళ్ల వాదన. ఆ విషయం తెలిసినా.. శత్రుచర్ల.. కిశోర్ చంద్రదేవ్‌లు ఎందుకు మౌనంగా ఉంటున్నారన్నదే టీడీపీ కేడర్ ప్రశ్న. ఇంఛార్జ్‌కు మద్దతు ప్రకటించిన శత్రుచర్ల అంతరంగం అర్థం కావడం లేదట. టీడీపీలోని వైరివర్గం మాత్రం ఇంఛార్జ్‌ను తప్పించేలా ఎత్తుగడలు వేస్తోందట. కురుపాంలో తమ పట్టు పోకుండా కార్యక్రమాలు చేపడుతున్నారట.
టీడీపీ మహానాడు తర్వాత పార్టీ కేడర్ ఉత్సాహంగా కనిపిస్తున్నా.. కురుపాంలో తెలుగుదేశం పరిస్థితి రివర్స్‌లో ఉందన్నది స్థానికంగా వినిపిస్తున్న వాదన. ఇక్కడి విషయాలను ఎప్పటికప్పుడు టీడీపీ అధిష్ఠానం తెలుసుకుంటున్నా.. అమరావతి నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో పార్టీ శ్రేణులు విస్తుపోతున్నాయట. మరి.. కురుపాం టీడీపీలో గ్రూపుల గోలకు ఎలా చెక్ పెడతారో చూడాలి.