ఎక్కడి తమ్ముళ్లు అక్కడే. ప్రాంతాల వారీగా ఫైట్. సమస్యలపై ఎక్కడికక్కడే పోరాటం. ఏపీ టీడీపీలో ప్రస్తుతం ఇదే చర్చ.. ఇదే వ్యూహం. పార్టీలో కేంద్రీకృతంగా సాగే ఉద్యమాలు.. ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ అయ్యాయి. ఎందుకీ ఎత్తుగడ? టీడీపీకి వర్కవుట్ అవుతుందా?
టీడీపీ కొత్తగా ‘లోకల్’ వ్యూహం..!
ఏపీ టీడీపీ కొత్త లైన్ తీసుకుంది. ప్రభుత్వంపై పోరాటం విషయంలో వ్యూహం మార్చింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని సీఎం జగన్‌ను తిట్టిపోస్తే లాభం లేదని గ్రహించినట్టు ఉంది. ప్రజా సమస్యలతోపాటు.. ఆయా ప్రాంతాల కష్టాలపై విడివిడిగా గళం ఎత్తుతోంది. అధినేత చుట్టూనే తిరిగే సంస్కృతికి మంగళం పాడింది టీడీపీ. సాగునీటి ప్రాజెక్టుల సమస్యలు.. అభివృద్ధి చర్చలు అంటూనే కొత్త వ్యూహాన్ని అమలు చేస్తుంది. ఈ దిశగా ఇటీవల జరుగుతున్న పరిణామాలే ఇప్పుడు చర్చకు కారణం అవుతున్నాయి.
ఉత్తరాంధ్ర రక్షణ పేరుతో విశాఖలో పోరాటం!
సాదారణంగా టీడీపీలో జిల్లాలు, ప్రాంతాల వారీగా సమస్యలపై గళం ఎత్తడం అరుదు. దాన్ని తప్పుగా చూసేది. ఏదైనా లేఖ రాయాలన్నా, మాట్లాడాలన్నా నేతలు ఆచితూచి స్పందించేవారు. కొన్ని సందర్భాల్లో మితిమీరిన జాప్యం జరిగేది. ఇప్పుడు వాటన్నింటినీ పక్కన పెట్టేశారు. మూడు రాజధానుల నిర్ణయంతో టీడీపీని ఇరుకున పెట్టింది వైసీపీ. వైజాగ్‌లో రాజధాని వద్దంటారా అని అధికారపార్టీ నేతలు పెద్దస్థాయిలోనే దాడి చేశారు. కానీ.. టీడీపీ అమరావతికే కట్టుబడి ఉన్నట్టు స్పష్టం చేసింది. చంద్రబాబుతోపాటు ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు కూడా అదే స్వరం వినిపించారు. తాజాగా ఉత్తరాంధ్ర రక్షణ అంటూ కొత్త నినాదం అందుకున్నారు అక్కడి నేతలు. విశాఖలో సమావేశం పెట్టుకుని చర్చించారు కూడా. అధికార పార్టీ నుంచి ఉత్తరాంధ్రను రక్షించాలి అనే స్లోగన్‌తోపాటు తమ హయాంలోనే అభివృద్ధి అనే నినాదాన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు నేతలు.
కర్నూలులలో సీమ ప్రాజెక్టులపై పోరాటం
వెలిగొండపై ఢిల్లీ వెళ్లిన ప్రకాశం టీడీపీ నేతలు
సాగునీటి ప్రాజెక్టుల విషయంలో టీడీపీ సీమ నేతలు కర్నూలులో మీటింగ్ పెట్టి స్వరం పెంచారు. నాలుగు జిల్లాల నేతలతోపాటు నెల్లూరు జిల్లా నుంచి మాజీ మంత్రి సోమిరెడ్డి కూడా వారితో జత కలిశారు. శ్రీశైలం నుంచి నీటి వాడకం, పెండింగ్ ప్రాజెక్టులపై చర్చించారు నాయకులు. లేటెస్ట్‌గా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు వెలిగొండ పై కదం కలిపారు. కేంద్రం విడుదల చేసిన గెజిట్‌లో వెలిగొండను చేర్చకపోవడంపై ముగ్గురు ఎమ్మెల్యేలు, ఇతర నేతలతో కలిసి డిల్లీ వెళ్లి కేంద్రమంత్రిని కలిసొచ్చారు. ఇక అమరావతిలో రైతుల తరఫున సుదీర్ఘ పోరాటం చేస్తూనే ఉన్నారు టీడీపీ నేతలు.
లోకల్ ఫైట్ కలిసి వస్తుందని టీడీపీ లెక్కలు!
స్థానిక అంశాలపై ఎక్కడికక్కడ మీటింగ్‌లు పెట్టడంవల్ల వాటికి అటెన్షన్ వస్తుందన్న లెక్కల్లో ఉన్నారు తెలుగుదేశం నాయకులు. ఇది వ్యూహాత్మకంగానే చేపట్టారట. కాకపోతే ఇన్నాళ్లూ సెంట్రలైజ్డ్‌గా సాగిన పోరాటాలు.. ఇప్పుడు డీసెంట్రలైజ్డ్‌గా మార్చడం వల్ల టీడీపీకి ఏ మేరకు కలిసి వస్తాయో చూడాలి.