తాండూరు టీఆర్‌ఎస్‌లో తన్నులాటలకు ఫుల్‌స్టాప్ పడదా..? తెగేవరకు లాగడమే అక్కడి నేతల లక్ష్యమా..? గతంలో జరిగిందేంటి..? ఇప్పుడూ అలాగే జరగాలేమోనని కేడర్ ఎందుకు అనుకుంటోంది? నేతలను నియంత్రించడం సాధ్యం కావడం లేదా?
తాండూరు టీఆర్‌ఎస్‌లో తగ్గేదే లే..!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం. ఇక్కడ టీఆర్ఎస్ వర్గపోరు..రోజుకో రకంగా రచ్చ లేపుతోంది. సద్దుమణిగింది అనుకుంటున్న సమస్య.. మళ్లీ మొదటికి వస్తున్న పరిస్థితి. ఆధిప్యతపోరులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి తగ్గేదే లే అంటున్నారు.
ఓ రేంజ్‌లో గొడవలు..!
పట్నం మహేందర్‌రెడ్డి గతంలో ఇక్కడ ఎమ్మెల్యే. టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో మంత్రి. 2018 ఎన్నికల్లో పట్నం ఓడిపోయారు. ఆయనపై కాంగ్రెస్ నుంచి గెలిచిన పైలెట్ రోహిత్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్‌లోకి వచ్చేశారు. అప్పటి నుంచి తాండూరు టీఆర్ఎస్‌లో గొడవలు ఓ రేంజ్‌లో నడుస్తున్నాయి. పట్నం మహేందర్‌రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్సీగాఉన్నారు. తాజా ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా గెలిచారు కూడా.
అప్పట్లో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వర్సెస్ పట్నం..!
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌లో వర్గపోరు అలజడి కొత్త కాదు. అప్పట్లో చేవెళ్ల ఎంపీగా ఉన్న కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి.. మంత్రిగా ఉన్న పట్నం మహేందర్‌రెడ్డికి అస్సలు పడేది కాదు. తీవ్రస్థాయిలో కోల్డ్‌వార్ నడిచేది. సందర్భాన్ని బట్టి టీఆర్‌ఎస్ సర్దుబాటు చేసినా గొడవలు ముదురు పాకాన పడ్డాయే తప్ప తగ్గలేదు. చివరకు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌ను వీడి వెళ్లిపోవడంతో ఆ ఎపిసోడ్‌కు తెరపడింది. ఇప్పుడు పైలెట్ రోహిత్‌రెడ్డి వర్సెస్ పట్నం మహేందర్‌రెడ్డి మొదలైంది.
తీరు మార్చుకోవాలని చెప్పినా మార్పు లేదా..?
పట్నం.. పైలెట్‌లకు ఎప్పటికప్పుడు సర్ది చెబుతున్నా.. ఇద్దరూ కొద్దిరోజులే సైలెంట్‌గా ఉంటున్నారు. అవకాశం చిక్కితే కుస్తీ పడుతున్నారు. తాజా గొడవ ఆ కోవలోకే వస్తుంది. రచ్చ రచ్చ అవుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు పట్నం. కానీ.. ఆయన్ని రెండోసారి ఎమ్మెల్సీని చేసింది పార్టీ. తీరు మార్చుకోవాలని ఇద్దరికీ పార్టీ నచ్చజెబుతున్నా.. వారి వైఖరిలో మార్పు లేదు. టీఆర్ఎస్ పెద్దలు ఇద్దరికీ సయోధ్య చేస్తారా? లేక గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎవరో ఒకరు బయటకి పోతేనే పరిస్థితిలో మార్పు వస్తుందా? అని గులాబీ శ్రేణులు చెవులు కొరుక్కుంటున్నాయట. మరి.. తాండూరు టీఆర్ఎస్‌లో రాజకీయ సెగలు ఎప్పుడు చల్లారతాయో చూడాలి.