ఆమె ఓ ప్రజాప్రతినిధి. నగర ప్రథమ మహిళ. నగరంలో తొలి గౌరవం ఆమెకే దక్కాలి. కానీ.. అక్కడ ఆ సీన్ లేదట. కార్యాలయ సిబ్బంది సైతం ఆమెను పట్టించుకోవడం లేదని టాక్. దీంతో పెద్ద పదవిలో ఉన్నా.. తగినంత గౌరవం దక్కడం లేదని లోలోన ఆవేదన చెందుతున్నారట ఆ మహిళా ప్రజాప్రతినిధి. ఇంతకీ ఎవరామె?
చిత్తూరులో మేయర్‌ను పట్టించుకోని పార్టీ నేతలు
ఎస్. అముద. చిత్తూరు మేయర్. రాజకీయాలకు కొత్త. పొలిటికల్ ఎంట్రీలోనే కార్పొరేటర్ అయ్యారు. రిజర్వేషన్ కలిసి రావడంతో మేయర్ కుర్చీ దక్కింది. అధికార వైసీపీలో నాటి రాజకీయ సమీకరణాలు అముదకు కలిసొచ్చాయనే చెప్పాలి. ఆమె రాజకీయాలకు కొత్త అని అనుకున్నారో ఏమో చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెత్తనం పార్టీ నేతలదే అని చెవులు కొరుక్కుంటున్నారు. ప్రథమ పౌరురాలిగా ఆమెకు దక్కాల్సిన గౌరవం ఇవ్వడం లేదన్న టాక్ పార్టీ శ్రేణుల్లోనే ఉందట. మేయర్‌గా ఎంపిక చేసిన సమయంలో అంత లేదు.. ఇంత లేదు అన్నవారు సైతం ఆమెను పట్టించుకోవడం లేదట.
read more : అంతరాష్ట్ర బస్సు సర్వీసులకు టీఎస్ ఆర్టీసీ గ్రీన్ సిగ్నల్..
మేయర్‌గా ఎంపిక కావడంతో ప్రచారంలోకి వచ్చారు
మేయర్ అముద పేద కుటుంబం నుంచి వచ్చారు. కట్టెలు అమ్ముకునేవారు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన ఆమెకు.. చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్ టికెట్ ఇచ్చింది వైసీపీ. 39వ డివిజన్ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆమె నివాసం ఉంటున్న ప్రాంతంలోనే అముద గురించి తెలుసు తప్ప చిత్తూరుకు ప్రజలకు.. పొలిటికల్ సర్కిల్‌కు పెద్దగా పరిచయం లేని మహిళ. కార్పొరేటర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనా నలుగురిలో ఒకరిగా ఉన్నారు తప్ప పేరు.. ప్రచారం రాలేదు. మేయర్ పదవికి వైసీపీ అముదను ఎంపిక చేయడంతో ఒక్కసారిగా పొలిటికల్ లైమ్‌లైట్లోకి వచ్చారు.
రెండు వర్గాలను కాదని మేయర్ పీఠంపై అముద
ఈ ఏడాది మార్చిలో మేయర్ ఎన్నిక జరిగింది. అప్పట్లో చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఓ వర్గంగా.. స్థానిక వైసీపీ నేతలు బుల్లెట్ సురేష్, విజయానందరెడ్డి మరోవర్గంగా ఉన్నారు. గెలిచిన కార్పొరేటర్లు సైతం రెండువర్గాలు విడిపోయి ఆయా శిబిరాల్లో చేరిపోయారు. తాము చెప్పిన వారికే మేయర్ పదవి ఇవ్వాలని రెండువర్గాలు పట్టుబట్టడంతో గందరగోళానికి దారితీసింది. రెండు శిబిరాలతో మాట్లాడిన తర్వాత ఆముద పేరును ఎంపిక చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మధ్యేమార్గంగా ఆయన తీసుకున్న నిర్ణయం ఆయ వర్గాలకు నచ్చలేదట. అయినప్పటికీ పార్టీ ఆదేశాలను ధిక్కరించకుండా కామైపోయారు.
కార్యక్రమాలకు మేయర్‌ను పిలవడం లేదు?
అముద మేయర్ కుర్చీలో కూర్చున్నప్పటి నుంచి స్థానిక వైసీపీ నేతలతో గ్యాప్ వచ్చిందట. సొంత పార్టీ నేతలే ఆమెను పట్టించుకోవడం లేదనుకున్నారో ఏమో.. అధికారులు సైతం మేయర్‌ను లెక్క చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. నగరపాలక సమీక్షా సమావేశాలకు, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ భేటీలకు.. నగరంలో జరిగిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాలకు మేయర్‌ను పిలవడం లేదట. కార్యక్రమం ఏదైనా ఎమ్మెల్యే, కమిషనర్, స్థానిక కార్పొరేటర్లు కానిచ్చేస్తున్నారట.
ప్రొటోకాల్ పాటించరు.. పొలిటికల్ ఫైట్‌కే ప్రాధాన్యం
నగరంలో అధికారికంగా ఏ కార్యక్రమం జరిగినా ప్రొటోకాల్ ప్రకారం మేయర్‌ను ఆహ్వానించాలి. నగరపాలక అధికారులు సైతం మేయర్ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయాలి. కానీ.. స్థానికంగా పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని అధికారపార్టీలోనే గుసగుసలాడుకుంటున్నారు. రాజకీయాలకు కొత్త కావడంతో.. పార్టీ నేతలతో జగడం ఎందుకని అనుకున్నారో ఏమో.. మేయర్ కామ్‌గా ఉంటున్నారట. రాజకీయంగా ఎవరూ పట్టించుకోకపోవడంతో తన బాధను ఇంకెవరికీ చెప్పడం లేదట. తనలో తానే ఆవేదన చెందుతున్నట్టు సమాచారం. మరి.. పార్టీ పెద్దల దృష్టికి ఈ సమస్య వెళ్లిందో లేదోకానీ వారే పరిష్కారం చూపిస్తారని అనుకుంటున్నాయి శ్రేణులు.