కీలక శాఖలకు ఆ ఇద్దరు అధికారులు కమిషనర్లు. విభాగాలు వేర్వేరైనా.. ఇద్దరి ప్రవర్తన.. పనితీరు ఒకేలా ఉందట. సొంత శాఖలోని ఉద్యోగులకే అపాయింట్‌మెంట్ ఇవ్వరని టాక్. సీఎం లేదా సీఎస్ నిర్వహించే సమీక్షల్లో మాత్రమే ఆయా శాఖల అధికారులకు కనిపిస్తారట.
రెండేళ్ల క్రితం RTA కమిషనర్‌గా వచ్చిన రావు..!
ఏదైనా ఉంటే మంత్రి దగ్గరకు వెళ్లాలని రావు చెబుతారట..!
MRM రావు. తెలంగాణ రవాణాశాఖ కమిషనర్. నిత్యం ప్రజలతో సంబంధాలున్న ప్రభుత్వ విభాగం. ఉదయం నుంచి సాయంత్రం వరకు వాహనదారులకు అందుబాటులో ఉండాలి. ఈ శాఖ కమిషనర్ మాత్రం సొంత డిపార్ట్‌మెంట్ ఉద్యోగులకే అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదట. రావు కమిషనర్‌గా వచ్చి రెండేళ్లు కావొస్తోంది. అప్పటి నుంచీ ఒకటే తీరు. కరోనా, లాక్‌డౌన్ సమయాల్లో ప్రైవేట్ వాహన యజమానులు క్వాటర్లీ ట్యాక్స్ రద్దు చేయాలని ధర్నాలు చేశారు. వెహికల్స్ డాక్యుమెంట్స్‌ను ముందుగా ఆర్టీఏ అధికారులకు అప్పగించినా ట్యాక్స్ మినహాయింపు ఇవ్వకపోవడంపై ఆందోళనకు దిగారు. ఆ సమయంలో నేరుగా కమిషనర్‌ను కలిసి సమస్యలు చెప్పుకొందామంటే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని విమర్శలు రేగాయి. తనతో మాట్లాడేందుకు ఏమీ లేదని.. ఏదైనా ఉంటే మంత్రి దగ్గరకు వెళ్లాలని తిప్పి పంపారు.
ఎవరిని పడితే వారితో మాట్లాడేందుకు రావు ఇష్టపడరట..!
ప్రజలతోనే కాదు.. శాఖలోని సమస్యలపై మాట్లాడేందుకు కూడా ఉద్యోగులకు కమిషనర్ రావు సమయం కేటాయించరనే ఆరోపణలు ఉన్నాయి. తనతో మాట్లాడటానికి ఏమీ లేదని.. తాను మాత్రం నిబంధనల ప్రకారం ముందుకెళ్తానని చెప్పేశారట. పైగా ఎవరిని పడితే వాళ్లను కలిసి మాట్లాడేందుకు కమిషనర్ ఇష్టపడరని డిపార్ట్‌మెంట్‌లో కథలు కథలుగా చెప్పుకొంటారు. చివరకు రవాణాశాఖ ఉద్యోగులు లేదా అధికారులు తమ కమిషనర్‌ను కలిసి మాట్లాడాలంటే.. ఏదైనా సమీక్షా సమావేశమో.. ప్రభుత్వ కార్యక్రమాల్లోనో అవకాశం చిక్కుతుందట. విసుగెత్తిన ఉద్యోగులు చివరకు కమిషనర్ ఛాంబర్‌కు వెళ్లడమే మానేశారని చెబుతారు. అందరికీ అందుబాటులో ఉండే కొత్త కమిషనర్ వస్తే బాగుంటుందనే చర్చ రవాణాశాఖలో ఓ రేంజ్‌లో జరుగుతోందట.
సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్‌కుమార్ ఏం చేస్తున్నారో?
ఇక పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్ పనితీరు అంతేనని ఉద్యోగుల్లో టాక్. రిటైర్ అయినా ప్రభుత్వం ఆయన్ని మళ్లీ విధుల్లోకి తీసుకుంది. దేవాదాయ శాఖ కమిషనర్‌గా ఉంటూనే సివిల్ సప్లయ్ విభాగానికి ఇంఛార్జ్ కమిషనర్. కరోనా టైమ్‌లో అదనపు బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదని ఆ విభాగంలోనే చెవులు కొరుక్కుంటారట. ఏదో ఒక సమయంలో ఎర్రమంజిల్‌లోని సివిల్ సప్లయ్ భవన్‌కు వచ్చి నాలుగు ఫైల్స్ చూసి వెళ్లిపోతారని చెబుతున్నారు. సమీక్షలు, సీఎం, సీఎస్ నిర్వహించే మీటింగ్‌లోనే అయ్యవారి దర్శనం దొరుకుతుందని సైటైర్లు వేస్తున్నారు ఎంప్లాయిస్.
అనిల్ కుమార్‌ను పొడిగిస్తారా? కొత్త కమిషనర్ వస్తారా?
రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లు ఎలా జరుగుతున్నాయి? రైతుల ఇబ్బందుల.. మిల్లర్ల ఆగడాలు.. FCI కొర్రీలు.. రేషన్‌కార్డుల కోసం వచ్చిన లక్షలాది ధరఖాస్తులపై చురుగ్గా వ్యవహరించరనే విమర్శ అనిల్ కుమార్‌పై ఉందట. రేషన్ డీలర్ల కమీషన్, వారి ఇబ్బందులు, గోనె సంచుల కొరత, ధాన్యం కొనుగోలు సమయంలో రవాణా, కూలీలు కమీషన్‌పై కమిషనర్‌ను కలిసేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేదని ఆ శాఖ ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. త్వరలోనే సివిల్ సప్లై కమిషనర్ పదవీ కాలం ముగియనుంది. మరి ఆయన్నే పొడిగిస్తారో.. లేక కొత్త వారిని నియమిస్తారో క్లారిటీ లేదు. మొత్తానికి రెండు కీలక విభాగాల్లోని కమిషనర్ల తీరుపై ఉద్యోగుల్లోనే కాదు.. ప్రభుత్వ విభాగాల్లోనూ ఆసక్తికర చర్చే జరుగుతోంది.