రాజోలు వైసీపీలో మళ్లీ ఆధిపత్య పోరు పీక్‌కు చేరుకుంది. ఇన్నాళ్లూ సైలెంట్‌గా ఉన్న నాయకుడికి పదవి రావడంతో ఆయన జూలు విదిలిస్తున్నారు. మధ్యలో నా సంగతేంటని పార్టీ ఇంఛార్జ్ హూంకరింపులు మామూలే. ఇంకోవైపు అధికారపార్టీకి సపోర్ట్‌గా నిలిచిన ఎమ్మెల్యే ఎత్తుగడలు. మొత్తంగా ఈ మూడు ముక్కలాట పంచాయితీ తాడేపల్లి చేరుకుందనే చర్చ జరుగుతోంది. మరి అక్కడైనా పరిష్కారం లభిస్తుందా?
రాజోలు వైసీపీలో మూడు ముక్కలాట!
తూర్పుగోదావరి జిల్లా రాజోలు వైసీపీలో నెలకొన్న ఆధిపత్య పోరు అధిష్ఠానం పెద్దల వద్దకు చేరింది. రాజోలు కో-ఆర్డినేటర్ గా తన పెత్తనం కొనసాగనీయకుండా అడ్డుపడుతున్నారని మాల కార్పొరేషన్ ఛైర్మన్ అమ్మాజీ అలిగారు. కొద్దికాలంగా ఆమె పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. రెండుసార్లు వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన మాజీ కో-ఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావుతో అప్పట్లో ఆమెకు విభేదాలు నెలకొన్నాయి. ఆయనపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు కూడా. దీంతో రాజేశ్వరరావు సైలెంట్ అయ్యారు. జనసేన నుంచి గెలిచి.. వైసీపీకి దగ్గరైన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ వచ్చాక.. వర్గపోరు మరో టర్న్ తీసుకుంది. నాటి నుంచి అమ్మాజీ, రాపాకలు రాజోలులో పైచెయ్యి సాధించేందుకు వేయని ఎత్తుగడలు లేవు. అమ్మాజీ, రాపాకల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న సమయంలో వైసీపీ మాజీ ఇంచార్జ్ బొంతు రాజేశ్వరరావుకు గ్రామీణ నీటి సరఫరా సలహా కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. గతంలో ఉన్న కోటరీ అంతా బొంతు దగ్గరకు చేరింది. మళ్లీ నియోజకవర్గంలో అధికారపార్టీ పెత్తనం మూడు ముక్కలాటగా తయారైంది.
అమ్మాజీ..రాపాకల మధ్య రచ్చకెక్కిన విభేదాలు
మలికిపురం SIను బదిలీ చేయించడానికి ఎమ్మెల్యే రాపాక ప్రయత్నిస్తే అమ్మాజీ అడ్డుపడ్డటంతో ఆగిపోయిందట. ఇటీవల కేశనపల్లి సహకార సొసైటీలో నామినేటెడ్ పోస్టులను రాపాక అనుచరులైన జనసేన కార్యకర్తలతో భర్తీ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యే సొంత గ్రామం చింతలమోరిలో సర్పంచ్ అభ్యర్థిని అమ్మాజీ ఎంపిక చేసినట్టు చెబుతారు. తన ప్రమేయం లేకుండా అభ్యర్థిని పెడతారా అని రాపాక కన్నెర్ర చేశారట. చివరకు అమ్మాజీ వెనక్కి తగ్గడంతో రాపాక తన అభ్యర్థిని గెలిపించుకున్నారట. ఈ ఘటన తర్వాత రాపాక-అమ్మాజీల మధ్య విభేదాలు మరింత రచ్చకెక్కాయి. నువ్వా-నేనా అనే రీతిలో తలపడుతున్నారు.
రాపాకపై పార్టీ పెద్దలకు అమ్మాజీ ఫిర్యాదు
తాజాగా పార్టీ ఇంఛార్జ్‌గా తన విధులకు ఎమ్మెల్యే రాపాక అడ్డుపడుతున్నారని వైసీపీ పెద్దలకు ఫిర్యాదు చేశారట అమ్మాజీ. 3 నెలలుగా ఆమె సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్టు సమాచారం. దీనిని అలుసుగా తీసుకుని వైసీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అధిపత్యం పెంచుకోవడానికి రాపాక ప్రయత్నించారట. ఆ విషయాన్ని కూడా పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారట అమ్మాజీ. చివరకు అధిష్ఠానం జోక్యంతో పార్టీ కార్యకర్తల సమావేశాన్ని అర్థాంతరంగా నిలిపేశారట రాపాక.
తాడేపల్లికి చేరిన రాజోలు వైసీపీ పంచాయితీ!
ఇంకోవైపు నామినేటెడ్ పదవి హోదాలో బొంతు రాజేశ్వరరావు తన వర్గాన్ని కూడగట్టుకుని అధికారులపై అజమాయిషీ చేస్తున్నారట. ఆ విషయం కూడా అధిష్ఠానం దృష్టికి చేరడంతో రాజోలు రచ్చ తాడేపల్లికి చేరిందని అనుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల్లో పంచాయితీ నిర్వహించడానికి ముగ్గురికి పీలుపు వచ్చినట్టు సమాచారం. ఎమ్మెల్యే రాపాకకే పూర్తి బాధ్యతలు అప్పగిస్తారా? అమ్మాజీనే కో-ఆర్డినేటర్ గా కొనసాగిస్తారా? బొంతు పాత్రేంటి? అన్నది ఆసక్తిగా మారింది. మరి తాడేపల్లిలో ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.