రాజకీయాల్లో రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. నిన్నటి వరకు మిత్రులైన వారు శత్రువులుగా మారొచ్చు. ఇన్నాళ్లు ఎడముఖం పెడముఖంగా ఉన్నవాళ్లు సడెన్‌గా దోస్తీ చేయొచ్చు. అధికార పార్టీకి చెందిన ఆ మంత్రి, ఎంపీలకు ఈ సూత్రం అతికినట్టు సరిపోతుంది. 2019లో కలిసి ఉన్నవారి మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కోల్డ్‌వార్‌కు తెరతీశారు. ఇంతకీ ఎవరా నాయకులు?
మంత్రి బాలినేని.. ఎంపీ మాగుంట మధ్య కోల్డ్‌వార్
ప్రకాశం జిల్లా వైసీపీలో ఇద్దరు ముఖ్య నేతల మధ్య గరంగరం పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి మధ్య అస్సలు పొసగడం లేదు. ఇద్దరి మధ్య దూరం బాగా పెరిగిందట. కరోనా బాధితులకు సాయం అందించే విషయంలో అయితే.. వీరి మధ్య నెలకొన్న పోటీ అధికారులకు తలనొప్పులు తెచ్చిపెట్టిందట. దీంతో ఇన్నాళ్లూ కలిసి ఉన్న నేతలు కోల్డ్‌వార్‌కి ఎందుకు దిగారా అని అధికార పార్టీ శ్రేణులు ఆరా తీస్తున్నాయి.
2019 ఎన్నికల్లో చెట్టపట్టాలేసుకుని తిరిగారు
ప్రకాశం జిల్లా వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్య నేత. సీఎం జగన్‌కి దగ్గరి బంధువు కూడా. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నాయకుడు. 2019 ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరి ఒంగోలు లోక్‌సభ సభ్యుడిగా రెండున్నర లక్షల మెజారిటీతో గెలిచారు. మాగుంట వైసీపీలోకి రావడం వెనక బాలినేని ఉన్నారని చెబుతారు. 2019 ఎన్నికల్లో ఇద్దరూ కలిసికట్టుగా పనిచేశారు. వీరే కాదు.. బాలినేని కుమారుడు ప్రణీత్‌రెడ్డి, మాగుంట కుమారుడు రాఘవరెడ్డి సైతం చెట్టాపట్టాలేసుకుని తిరిగినవారే. ప్రస్తుతం ఒకరినొకరు ఎదురుపడకుండా తిరుగుతున్నారట.
ఒంగోలు రిమ్స్‌లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటులో తకరారు
ఒంగోలు రిమ్స్‌లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఎంపీ మాగుంట భావించారట. దీనిపై రిమ్స్ అధికారులతో మాట్లాడి చర్యలు కూడా తీసుకున్నారు. అయితే రాత్రికి రాత్రే మాగుంటని పక్కన పెట్టిన రిమ్స్ అధికారులు మంత్రి బాలినేని వద్ద ఫండ్స్ తీసుకుని ఆయన పేరు మీద కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేశారు. విస్తుపోవడం ఎంపీ వంతైంది. అప్పటి కలెక్టర్ పోలా భాస్కర్‌ని కలిసిన మాగుంట.. రిమ్స్ అధికారులపై ఫిర్యాదు చేశారు. అక్కడ నుంచి మంత్రికి, ఎంపీకి మధ్య గ్యాప్ వచ్చిందట.
ఒంగోలులో ఎవరికి వారుగా ఆనందయ్య మందు పంపిణీ
అక్కడితో ఆగితే బాగోదని అనుకున్నారో ఏమో.. ఆనందయ్య మందు పంపిణీ విషయంలోనూ ఇద్దరూ పోటీపడ్డారు. ఒంగోలు కేంద్రంగా మంత్రి, ఎంపీలు వేర్వేరు ప్రాంతాల్లో ఆనందయ్య మందును పంపిణీ చేశారు. కుమారుడు రాఘవరెడ్డితో కలిసి ఎంపీ మాగుంట ఒంగోలు పీవీఆర్ హైస్కూల్‌నూ.. మంత్రి బాలినేని తన నివాసాన్ని ఇందుకు వేదికగా చేసుకున్నారు. ఈ ఎపిసోడ్‌లో ఆసక్తికర అంశం ఏంటంటే.. తమ మధ్య విభేదాలు లేవని మంత్రి, ఎంపీ వర్గాలు చెబుతుంటాయి. కానీ.. కలిసి కార్యక్రమాలు చేయరు. ఎవరి దుకాణం వారిదే. ఒకరిపై ఇంకొకరు పైచెయ్యి సాధించాలి.. జనాల్లో పేరు తెచ్చుకోవాలి. ఇదే అజెండాతో రాజకీయాలకు తెరతీస్తున్నారు నాయకులు.
రిమ్స్ అధికారులతో మాగుంట కుమారుడి భేటీపై మంత్రి ఫైర్!
ఆ మధ్య ఎంపీ మాగుంట కుమారుడు రాఘవరెడ్డి రిమ్స్ అధికారులతో సమావేశం అయ్యారట. ఈ విషయం తెలుసుకున్న మంత్రి బాలినేని భగ్గుమన్నట్టు సమాచారం. రాఘవరెడ్డితో అధికారులు సమావేశం కావడంపై చర్యలు తీసుకోవాలని జిల్లా అదికారులను మంత్రి ఆదేశించారని చెవులు కొరుక్కుంటున్నారు. మొత్తానికి మంత్రి, ఎంపీల ఆధిపత్య పోరు కాస్తా.. జిల్లా అధికారులకు తలనొప్పులు తెచ్చిపెడుతోందట. విడమంటే పాముకు.. కరమంటే కప్పకు కోపం అన్నట్టుగా నలిగిపోతున్నారట అధికారులు.
ఏ ఇద్దరు కలిసినా కోల్డ్‌వార్‌పైనే చర్చ!
రెండేళ్ల వ్యవధిలోనే మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట ఈ విధంగా కోల్డ్‌వార్‌కు దిగి.. కత్తులు నూరుకోవడం పార్టీ శ్రేణులను ఆశ్చర్య పరుస్తోందట. ఏ ఇద్దరు కలిసినా ఈ ఎపిసోడ్‌పైనే చర్చ. రాజకీయ భగభగలు చూస్తుంటే ఎవరూ వెనక్కి తగ్గేట్టు కనిపించడం లేదట. మరి.. ఈ ఆధిపత్య పోరు రానున్న రోజుల్లో ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.