కుప్పం మున్సిపాలిటీ పోరు సెగలు రేపుతోంది. వైసీపీ జెండా ఎగరేయటానికి మంత్రి పెద్దిరెడ్డి అన్ని రకాల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పుడు కొత్త అస్త్రం ప్రయోగించి చర్చకు దారితీశారు.
కుప్పంలోనే టీడీపీ సీనియర్లు..!
చిత్తూరు జిల్లాలోని కుప్పం.. కావటానికి మున్సిపాలిటీనే ..! ఇక్కడ పురపోరు మాత్రం హై ఓల్టేజ్ తో సాగుతోంది. గెలుపు కోసం వైసీపీ, టీడీపీ గట్టి వ్యూహాలే రచిస్తున్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని వరస పెట్టి రాష్ట్ర ఎన్నికల సంఘానికి, డీజీపీకి లేఖలు రాస్తున్నారు చంద్రబాబు. అధికారపార్టీ అదేస్థాయిలో కౌంటర్ అటాక్ చేస్తోంది. చంద్రబాబు స్వయంగా కుప్పం మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. ఆయన తనయుడు నారా లోకేష్ కూడా అదే పనిలో ఉన్నారు. టీడీపీ సీనియర్ నాయకులంతా కుప్పంలోనే మోహరించారు.
వైసీపీ తరఫున మంత్రి పెద్దిరెడ్డి వ్యూహ రచన..!
కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ గెలుపు బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన భుజాలకెత్తుకున్నారు. ప్రచారంలో చురుకుగా పాల్గొనటమే కాదు… తెర వెనక వ్యూహ రచన కూడా ఆయనదే. 2019 ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు మెజారిటీని తగ్గించడంలో పెద్దిరెడ్డి కీలక పాత్ర పోషించారు. మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బాబుకు చెమటలు పట్టించటమే లక్ష్యంగా ఎలక్షనీరింగ్ చేశారు.
కుప్పం వైసీపీ ఇంఛార్జ్ భరత్‌కు ఎమ్మెల్సీ ఆఫర్?
తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డికి వైసీపీ కుప్పం ఎన్నికల ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు, ఎంపీ మిథున్‌రెడ్డి సైతం అక్కడే మకాం వేశారు. ఎప్పటికప్పుడు చురుకుగా కదిలే టీమ్‌లు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయి. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప కుప్పంలో కలియ తిరుగుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధిష్ఠానం వేసిన ఎత్తుగడ రాజకీయ చర్చగా మారింది. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కుప్పం వైసీపీ ఇంఛార్జ్ భరత్‌కు అవకాశం ఇవ్వాలని ఇంటర్నల్‌గా నిర్ణయించారు. దీనిపై అధికారిక ప్రకటనే మిగిలింది. ఈ నిర్ణయం కుప్పంలో వైసీపీ గెలుపును ఇంకా పక్కా చేస్తుందని అధికారపార్టీ వర్గాలు లెక్కలేస్తున్నాయి.
కుప్పం కుంభస్థలాన్ని కొట్టాలన్న కసితో వైసీపీ శ్రేణులు..!
ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం పరిధిలో 89 గ్రామ పంచాయతీల్లో వైసీపీ 74 చోట్ల విజయం సాధించింది. టీడీపీ 14 పంచాయతీలతో సరిపెట్టుకుంది. కుప్పం మండలంలోనే 26 పంచాయతీలుంటే.. 21 చోట్ల వైసీపీ మద్దతుదార్లు గెలిచారు. మండలంలోని 17 ఎంపీటీసీలలో 15 అధికారపార్టీ ఖాతాలో పడ్డాయి. చంద్రబాబు సొంతూరు నారావారిపల్లెలో సైతం ఫ్యాన్ గాలి ఓ రేంజ్‌లో వీచింది. ఇటీవల బద్వేల్ అసెంబ్లీ ఉపఎన్నికలను పర్యవేక్షించి 90 వేల మెజారిటీ సాధించిన హుషారులో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి అదే ఊపుతో కుప్పం కుంభస్థలాన్ని కొట్టాలన్న కసితో ఎన్నికల గోదాలోకి దిగారు. 20 వార్డులలో వైసీపీ క్లీన్ స్వీప్ సాధిస్తుందో లేక మెజారిటీ స్థానాలు కైవశం చేసుకుని జెండా ఎగరేస్తుందో చూడాలి.