కొత్త పీసీసీని ప్రకటించగానే ఆయన తన పదవులన్నిటికీ రాజీనామా చేశారు. అయినప్పటికీ పార్టీ ఆయనతో మాట్లాడుతూనే ఉంది. ఆ నాయకుడు మాత్రం గడప దాటడం లేదు. పాతచోటే ఉంటారా.. లేక కొత్త గూటిని వెతుక్కునే పనిలో పడ్డారా అన్నది అంతుచిక్కడం లేదట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఏమా కథ?
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత మౌనంగానే ఉండిపోయారు!
తెలంగాణలో ఆయారాం గయారాంల సందడి పీక్‌కు చేరుకుంటోంది. గోడ దూకేవాళ్లు దూకేస్తున్నారు. మెడలో కొత్త కండువాలు కప్పేసుకుంటున్నారు. కొందరు మాత్రం పార్టీకి గుడ్‌బై చెప్పినా.. మనసులోమాట మాత్రం బయటపెట్టడం లేదు. భవిష్యత్ రాజకీయ ప్రయాణం ఎటో.. ఏంటో కూడా క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ కోవలోకే వస్తారు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి. పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డి పేరు ప్రకటించగానే కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు KLR. తెలంగాణ పీసీసీని ప్రకటించిన తర్వాత తొలుత స్పందించింది ఆయనే. రాజీనామా లేఖను సోనియాగాంధీకి పంపిన తర్వాత.. అప్పటి నుండి ఇప్పటి వరకు మౌనం వీడలేదు. బయట కనిపించింది కూడా తక్కువే.
కేఎల్‌ఆర్‌తో బుజ్జగింపులు వర్కవుట్ కాలేదా?
సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సన్నిహితంగా ఉండేవారు KLR. ఈ మధ్య భట్టి పాల్గొన్న కార్యక్రమాలకు డుమ్మా కొట్టేశారు. పార్టీకి రాజీనామా చేశాక.. కాంగ్రెస్ హైకమాండ్‌లోని పెద్దలు KLRతో సంప్రదింపులు జరిపే బాధ్యత ఓ సీనియర్ నేతకు అప్పగించారు. ఆ నాయకుడు వెళ్లి KLRను బుజ్జగించారా? చర్చలు ఫలించాయా లేదా అన్నది తెలియదు. లక్ష్మారెడ్డి మనసు మార్చుకుంటారో లేదో కూడా ఎవరూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ కాంగ్రెస్‌లో కొనసాగడం ఇష్టం లేకపోతే.. కొత్త వేదిక ఏంటో కూడా స్పష్టం చేయడం లేదు. అందుకే కేఎల్‌ఆర్ దారెటు అన్న చర్చ కాంగ్రెస్‌లోనూ.. ఆయన అనుచరుల్లోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది.
బుజ్జగించడానికి వెళ్లిన నేతకూ పీసీసీపై అసంతృప్తి?
దూకుడగా ఉండే KLR.. ఇంత వరకు రాజీనామాను వెనక్కి తీసుకోలేదు. రిజైన్ చేసినప్పుడే కొత్త పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగింది. అయితే గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ మారిన కొందరు నేతలు.. తిరిగి వెనక్కి వచ్చే ఆలోచనలో ఉండటంతో.. లక్ష్మారెడ్డిపై కూడా చర్చ మొదలైంది. KLRని బుజ్జగించడానికి వెళ్లిన పార్టీ కీలక నాయకుడు సైతం కొత్త పీసీసీపై అసంతృప్తితోనే ఉన్నారట. ఒకవేళ కాంగ్రెస్‌లోనే కొనసాగాల్సి వస్తే.. కేఎల్‌ఆర్ ఏదైనా పెద్ద పదవే కోరొచ్చని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఆయన డిమాండ్స్‌కు పార్టీ తలొగ్గకపోతే.. మేడ్చల్‌లో కాంగ్రెస్‌కు తలపోట్లు తప్పవనే టాక్ నడుస్తోంది.
హైకమాండ్ నచ్చ చెబుతుందా?
ఒక్క కేఎల్‌ఆరే కాదు.. తెలంగాణకు కొత్త పీసీసీని ప్రకటించిన తర్వాత అసంతృప్తుల జాబితా పెరిగింది. వారికి అధిష్ఠానం నచ్చ చెబుతుందా? లేక కొత్త టీమ్‌కు ఆ బాధ్యత అప్పగించి ఉందో కానీ.. పెద్దగా చలనం లేదు. అందుకే KLR కాంగ్రెస్ గట్టునే ఉంటారో లేక ఇంకో గట్టు వెతుక్కుంటారో చూడాలి.