ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చినట్టుగా.. ఇద్దరు ఉన్నతాధికారుల మధ్య వచ్చిన ఇగో క్లాష్.. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కంగారెత్తించింది. అధికారులు.. ప్రభుత్వ వర్గాల్లోనూ పెద్దచర్చగా మారింది. సమస్యకు విరుగుడు మంత్రం వేసినా.. తెర వెనక జరిగిన కథ మాత్రం ఏపీ సచివాలయంలో ఆసక్తి రేకెత్తించింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.
కీలక విభాగాలను తప్పించడంతో డిప్యూటీ సీఎంలు కలవరం!
రెవెన్యూ శాఖలో అంతర్భాగంగా ఉండే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు.. వాణిజ్య పన్నుల విభాగాలను ఆర్థికశాఖకు బదలాయిస్తూ ఇటీవల ఏపీలో జీవో ఇచ్చారు. ఈ రెండు విభాగాలు.. ఇద్దరు డిప్యూటీ సీఎంల పరిధిలో ఉన్నాయి. వాణిజ్య పన్నుల విభాగం బాధ్యతలను ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ విభాగం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చూస్తున్నారు. దీంతో ఎస్సీ, బీసీవర్గాలకు చెందిన ఉప ముఖ్యమంత్రుల పదవుల్లో కోత పడిందనే చర్చ జరిగింది. వీరి శాఖలను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డికి బదలాయిస్తున్నారని అనుకున్నారు. పైగా .. తమ వద్దనున్న విభాగాలను ఆర్థిక శాఖకు బదలాయిస్తున్న విషయం జీవో వచ్చే వరకు డిప్యూటీ సీఎంలకు తెలియదట. దీంతో తాము తప్పు చేశామనే భావనలో సీఎం ఉన్నారా? అందుకే ఆ విభాగాలను తప్పించారా? అని వారు ఆందోళన చెందారట.
Read Also : వెంకీ కుడుముల కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!
తమవైపు ఏమైనా పొరపాట్లు జరిగాయా అని ఆరా తీశారట
ఇద్దరు డిప్యూటీ సీఎంలు ప్రభుత్వ పెద్దలను కలిసి ఆరా తీశారట. తాము ఏమైనా తప్పులు చేశామా? తమవైపు నుంచి ఏమైనా పొరపాట్లు జరిగాయా? అని అడిగారట. దీంతో శాఖల బదలాయింపు ప్రతిపాదన ఇంకా పరిశీలనలో ఉండగానే.. జీవో జారీ అయిందని.. ఎక్కడో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని వారికి ప్రభుత్వ పెద్దలు చెప్పారట. ఒకవేళ ఆ విభాగాలను ఆర్థికశాఖకు బదలాయించినా.. బాధ్యతలను మాత్రం డిప్యూటీ సీఎంల నుంచి తప్పించే ప్రసక్తే ఉండదని భరోసా ఇచ్చారట. దీంతో ఊపిరి పీల్చుకుని బయటపడ్డారట ధర్మాన కృష్ణదాస్, నారాయణ స్వామిలు.
జీవోను నిలుపుల చేస్తూ ఉత్తర్వులు
సమస్య తీవ్రత తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రెవెన్యూ శాఖ నుంచి వాణిజ్య పన్నులు, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ విభాగాలను ఆర్థిక శాఖకు బదలాయిస్తూ ఇచ్చిన జీవోను అబయెన్స్‌లో పెట్టారు. కాకపోతే ఈ స్థాయిలో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కలవర పెట్టిన జీవో వెనక ఇద్దరు ఉన్నతాధికారుల ఇగో క్లాష్ ఉన్నట్టు తెలుసుకుని అంతా ఆశ్చర్య పోయారట. ఎలాంటి చర్చలు.. సంప్రదింపులు లేకుండా.. ప్రభుత్వంలో కీలక వ్యక్తుల అభిప్రాయం తెలుసుకోకుండా రెండు విభాగాలను ఆర్థిక శాఖకు బదలాయించినట్టు గుర్తించారట. స్వయంగా సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌కు కూడా జీవో జారీ గురించి తెలియదని చెబుతున్నారు.
సీఎంవో ఆఫీసర్‌కు.. రెవెన్యూశాఖలోని అధికారికి మధ్య ఇగో క్లాష్!
సీఎంవోలో కీలక విభాగంలో ఉన్న అధికారికి.. రెవెన్యూ శాఖలో కీలక స్థానంలో ఉన్న మరో అధికారికి మధ్య ఇగో క్లాష్ వచ్చిందట. రెవెన్యూ శాఖలోని ఉన్నతాధికారి దగ్గర చాలా శాఖలు ఉన్నాయని భావించిన.. సీఎంవోలోని ఆ ఆఫీసర్.. వాటిల్లో కొన్నింటికి కోత వేయాలని అనుకున్నారట. అయితే అది వీలు కాలేదట. తన శాఖల్లో కోత పడకుండా ఆ రెవెన్యూ అధికారి లాబీయింగ్ చేసుకున్నట్టు సీఎంవో అధికారి అనుమానించారట. ఇక లాభం లేదని అనుకున్న ఆ సీఎంవో ఆఫీసర్.. ఆ శాఖలను కత్తిరించే క్రమంలో ఈ జీవో తెచ్చినట్టు సమాచారం. ఆ విధంగా ఇద్దరు డిప్యూటీ సీఎంలనూ కంగారెత్తించారు.
జీవో జారీ వెనక పరిస్థితులపై ప్రభుత్వ పెద్దల ఆరా?
సూత్రధారికి మరింత కత్తెర వేస్తారా?
పూర్తిస్థాయిలో అధ్యయనం చేయకుండా.. ప్రతిపాదనల దశలో ఉండగానే జీవోను ఎందుకు జారీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వ పెద్దలు ఆరా తీసినట్టు సమాచారం. ఆయా శాఖల్లోని ఉద్యోగులు ఏమనుకుంటున్నారు? జరిగే పరిణామాలేంటి? అనే దానిపై సమాచారం తెప్పించుకున్నారట. ప్రభుత్వానికి ఉపయోగం లేకపోగా.. నష్టమే ఎక్కువని.. ఆర్థికశాఖలో ప్రమోషన్లలోనూ గందరగోళానికి తావిచ్చే అవకాశం ఉందనే ఫీడ్ బ్యాక్ వచ్చిందట. దీంతో జీవోను అబయెన్స్‌లో పెట్టారని తెలిసింది. ఈ క్రమంలో జీవో జారీ వెనక ప్రధాన సూత్రధారైన ఆఫీసర్‌కు మరింత కత్తెర వేసే దిశగా కూడా ఆలోచన చేస్తున్నారట. మరి ఏం జరుగుతుందో చూడాలి.