ఆ జిల్లాలో వారి బాధను టీడీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. వరస ఓటములతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నా వినేవాళ్లే లేరట. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో.. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని నేతలకు వార్నింగ్ ఇస్తున్నారట. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం.
చంద్రబాబును మించిన ఆవేదనలో టీడీపీ తమ్ముళ్లు..!
2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఒక్క చంద్రబాబే గెలిచారు. మిగిలినచోట్ల వైసీపీదే విజయం. అది మొదలు.. పంచాయతీ, మున్సిపల్, తాజాగా పరిషత్ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా చతికిలపడింది. బలంగా ఉన్నామని భావిస్తున్న టీడీపీ శ్రేణులకు ఈ పరిణామాలు అర్థం కావడం లేదట. అధికారపార్టీలో వరస గెలుపులు ఉత్సాహం నింపితే.. టీడీపీలో నిశ్శబ్దం ఆవహించింది. 40 ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకొనే చంద్రబాబుకు సైతం చిత్తూరు జిల్లా ఎన్నికల ఫలితాలు మింగుడుకపడటం లేదు. కానీ.. చంద్రబాబుకు మించిన ఆవేదనలో తెలుగు తమ్ముళ్లు ఉన్నారట.
పార్టీ నేతల తీరును సోషల్ మీడియాలో ఏకిపడేస్తున్న కేడర్..!
జిల్లాలో తిరుపతి, కుప్పం, పలమనేరు, మదనపల్లె, నగరి, శ్రీకాళహస్తి, సత్యవేడు, పీలేరు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటగా ఉండేవి. అక్కడ కూడా సైకిల్ చతికిల పడింది. చంద్రగిరి, పుంగనూరు, తంబళ్లపల్లె, పూతలపట్టులో పార్టీ కేడర్ బలంగా ఉన్నా.. నేతల నుంచే స్పందన లేదట. ఇన్నాళ్లూ అధికారపార్టీపై గురిపెట్టిన పార్టీ శ్రేణులు.. ఇప్పుడు రూటు మార్చేశాయి. ముందుగా పార్టీని చక్కదిద్దుకోవాలనే ఆలోచనలోకి వెళ్లి.. సోషల్ మీడియాను ఎడాపెడా వాడేస్తున్నాయి. టీడీపీ చేస్తున్న తప్పులను… జిల్లా నాయకులు వేస్తున్న తప్పటడుగులను ప్రస్తావిస్తూ సామాజిక మాధ్యమాల్లో ఏకిపడేస్తున్నారట.
చిత్తూరు జిల్లాను లోకేష్ మర్చిపోయారని కేడర్ సెటైర్లు..!
అసెంబ్లీ ఎన్నికల తర్వాత పలుమార్లు.. పంచాయతీ ఎన్నికల తర్వాత మరోసారి చంద్రబాబు జిల్లాకు వచ్చారు. ఎక్కడ లోపం ఉందో.. ప్లానింగ్ ఎక్కడ దెబ్బతిస్తుందో కేడర్ చెప్పింది. వాటిని చంద్రబాబు ఆలకించారు.. నోట్ చేసుకున్నారు. కానీ.. క్షేత్రస్థాయిలో మార్పులు లేవనే ఆగ్రహంతో ఉన్నారు తమ్ముళ్లు. ఇక చిత్తూరు జిల్లా అన్నది ఒకటి ఉందని నారా లోకేష్ మర్చిపోయారని టీడీపీ శ్రేణులే సెటైర్లు వేస్తున్నాయి.
వైసీపీ విమర్శలకు టీడీపీ నుంచి కౌంటర్లు లేవు..!
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నిక సమయంలో కనిపించిన నారా లోకేష్ తర్వాత జిల్లాను పట్టించుకోలేదని గుర్రుగా ఉందట కేడర్. సొంత జిల్లాపై ఫోకస్ పెట్టాలని కోరినా అటునుంచి సమాధానం లేదట. ఆ మధ్య చంద్రబాబు మరోసారి కుప్పంలో తప్పకుండా పోటీ చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెటకారంగా మాట్లాడినా.. టీడీపీ నుంచి కౌంటర్లు లేవట. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పార్టీ నేతలు నల్లారి కిషోర్ కుమార్‌రెడ్డి తదితరులు మౌనంగా ఉండటాన్ని కేడర్ జీర్ణించుకోలేకపోతోందట.
నేతలు మారకపోతే..ఇదే లాస్ట్ ఛాన్స్ అని వార్నింగ్..!
కీలక అంశాలపై జిల్లాలోని టీడీపీ నేతలతోపాటు చంద్రబాబు, లోకేష్‌లు సైతం మౌనంగా ఉండటంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారట తమ్ముళ్లు. తమను పట్టించుకోవాలని.. పార్టీకి అండగా ఉండాలని కోరుతున్నారట. మీరు మారతారా లేదా.. ఇదే మీకు లాస్ట్ ఛాన్స్ అని కొందరు కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నట్టు టాక్. పరిషత్ ఎన్నికల ఫలితాల తర్వాత శ్రేణులు ఇంకా రగిలిపోతున్నాయట. మరి.. వారి మొరను పార్టీ పెద్దలు ఆలకిస్తారో లేదో చూడాలి.