మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రను హజురాబాద్‌లో ఘనంగా ముగించాలన్నది బీజేపీ ఆలోచన. వారికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. ఇప్పుడేం చేస్తారు? కమలనాథుల ప్లానింగ్ ఏంటి?
ఎన్నికల కోడ్‌తో సంజయ్ యాత్ర ముగింపుపై బీజేపీలో చర్చ..!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్టు 28న ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. ఉపఎన్నిక జరగుతున్న హుజురాబాద్‌లో అక్టోబర్ రెండున భారీ రోడ్ షోతో మొదటి విడత యాత్రను ముగించాలని అప్పట్లో అనుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఆ సన్నాహాల్లోనే ఉన్నారు పార్టీ నాయకులు. ఇంతలో హజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. కోడ్ అమలులోకి రావడం ఒకటైతే.. కోవిడ్ ఆంక్షలను ఈసీ కఠినంగా అమలు చేస్తుండటం బీజేపీ నేతలకు మరో సమస్యగా మారింది.
యాత్ర మొదలైనప్పటి నుంచి ఎన్నికల షెడ్యూల్‌పై చర్చే..!
వాస్తవానికి సంజయ్ పాదయాత్ర మొదలైనప్పుడే హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వస్తే ఎలా అనే చర్చ ప్రారంభమైంది. యాత్ర మొదలైన మూడో రోజే పశ్చిమ బెంగాల్‌లో ఉపఎన్నికలకు షెడ్యూల్ వచ్చింది. ఆ జాబితాలో హుజురాబాద్ ఉంటుందని అనుకున్నారు. కానీ లేదు. ఒకవేళ షెడ్యూల్‌లో హుజురాబాద్ ఉండి ఉంటే.. పాదయాత్రను అక్కడికి షిఫ్ట్ చేయాలని లెక్కలేసుకున్నారు. అప్పటి నుంచి హజురాబాద్ షెడ్యూల్‌పై ఇదిగో అదిగో అని ప్రచారం జరిగింది తప్ప కొలిక్కి వచ్చింది లేదు.
మొదటి విడత పాదయాత్ర ముగింపు ఎలా?
జోగిపేటలో జరిగిన బీజేపీ ముఖ్య నేతల సమావేశంలో షెడ్యూల్ వస్తే పాదయాత్రకు బ్రేక్ వేయాలని .. యాత్రలోని టీమ్ అంతా హుజురాబాద్‌కు షిఫ్ట్ కావాలని నిర్ణయించారు. ఆ సమావేశంలో షెడ్యూల్ వచ్చేస్తుందని అనుకున్నారు. కానీ ఈసీ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో.. యాత్ర ముందుకు సాగింది. మరో నాలుగు రోజుల్లో మొదటి విడత యాత్ర ముగుస్తుంది అని అనుకున్న తరుణంలో హుజురాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చింది. అంతే పాదయాత్రను ముగించాలా లేదా అనేదానిపై బీజేపీ నేతల్లో తర్జన భర్జన మొదలైంది.
కోడ్ వల్ల కరీంనగర్‌లోకి కూడా ఎంటర్ కాలేని పరిస్థితి..!
మొదటి విడత యాత్ర ముగింపునకు అక్టోబర్ 2గా నిర్ణయించడం.. ఆ తేదీ కూడా దగ్గర పడటంతో అప్పటి వరకు కొనసాగించి.. హుజురాబాద్‌లో గ్రాండ్‌గా సభ నిర్వహించాలని ప్లాన్ వేసుకున్నారు. కానీ.. ఎన్నికల సంఘం పెట్టిన ఆంక్షలు బీజేపీ నేతలకు షాక్ ఇచ్చాయి. భారీ సమావేశాలు, సభలు, ర్యాలీలు, రోడ్ షోలు నిర్వహించకూడదని ఈసీ స్పష్టం చేసింది. పైగా జిల్లా మొత్తం కోడ్ అమలులోకి వచ్చింది. ఇప్పుడు కరీంనగర్‌లోకి కూడా ఎంటర్ కాలేని పరిస్థితి.
హుస్నాబాద్‌లో అక్టోబర్ 2న భారీ సభ?
ఇక లాభం లేదని అనుకున్న కమలనాథులు.. ఏదో విధంగా ప్రజా సంగ్రామ యాత్ర తొలివిడత కార్యక్రమానికి గ్రాండ్ ముగింపు ఇవ్వాలని అనుకుంటున్నారట. కరీంనగర్‌లోకి ప్రవేశించకుండానే.. హుస్నాబాద్‌లో అక్టోబర్ 2న భారీ సభ పెట్టాలని నిర్ణయించారట. హుస్నాబాద్ ప్రాంతం ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదు. పైగా హుజురాబాద్‌కు చేరవలోనే ఉంటుంది. భారీగా సభ పెడితే ఆ ప్రభావం తప్పకుండా హుజురాబాద్‌పై ఉంటుందని లెక్కలేస్తున్నారట. మరి.. వారి ప్లాన్ ఎంత వరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.