కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి. కాంగ్రెస్ ఎమ్మెల్యే. పార్టీలో ఉన్నారో లేదో తెలియని సమయంలో.. బయటకు వెళ్లిపోతారని చర్చ జరుగుతున్న వేళ పార్టీలో చర్చగా మారారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఆయన అంటీముట్టనట్టు వ్యవహారం నడుపుతున్నారనే టాక్ ఉంది. సడెన్‌గా హస్తినకు వెళ్లి.. కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశం అయ్యారు. ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఫిర్యాదు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీ అధినేత్రితో భేటీ ఒక రహస్యమైతే.. ఇద్దరిపై ఫిర్యాదు చేశారన్న సమాచారం కాంగ్రెస్ వర్గాల్లో వేడి పుట్టిస్తోంది.
ఠాగూర్, రేవంత్‌ల తీరును ప్రస్తావించిన రాజగోపాల్? మునుగోడు ఎమ్మెల్యే అయిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. ఇటీవల ఢిల్లీకి వెళ్లి మూడు నాలుగు రోజులు అక్కడే ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంతా అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ కోసం హస్తిన వెళ్తే.. సోనియాగాంధీతో రాజగోపాల్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలపై చర్చ చేసినట్టు సమాచారం. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో AICC ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ప్రస్తావన వచ్చిందట. ఇంఛార్జ్ ఠాగూర్ అసలు ఎవరినీ పట్టించుకోవడం లేదని..! రేవంత్ ఏం చేస్తే దాన్ని సమర్దించడమే సరిపోతుందని సోనియాగాంధీతో చెప్పినట్టు తెలుస్తోంది. రాజగోపాల్ చెప్పే అంశాలను ఠాగూర్‌ను నోట్ చేసుకోవాలన్న సోనియా?
పీసీసీ చీఫ్ అధ్యక్ష పదవిని రేవంత్‌కు ఇచ్చేటప్పుడు కాస్త సమాచారం తెచ్చుకుని ప్రకటన చేస్తే బాగుండేదని మేడమ్‌తో చెప్పారట రాజగోపాల్. తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయడంతోపాటు.. త్యాగాలు చేసిన వాళ్లకు పీసీసీ చీఫ్ పదవి ఇస్తే బాగుండేదని సూచించారట. అప్పటికే అక్కడకు కాస్త దూరంగా ఉన్న ఇంఛార్జ్ ఠాగూర్‌ను పిలిచిన సోనియాగాంధీ.. ఎమ్మెల్యే రాజగోపాల్ చెప్పే అంశాలను నోట్ చేసుకోవాలని చెప్పారట. పార్టీ వ్యవహారాలపై తాను రాజగోపాల్‌రెడ్డితో ప్రత్యేకంగా మాట్లాడతానని ఠాగూర్ మేడమ్‌కు బదులిచ్చారట.
ఠాగూర్, రాజగోపాల్ మధ్య సయోధ్యకు ఒక సీనియర్ నేత యత్నం?ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది. గతంలో ఇదే ఠాగూర్.. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పార్టీ అధిష్ఠానానికి రిపోర్ట్ ఇచ్చారట. ఆ అంశంపై రాజగోపాల్‌రెడ్డితో ఠాగూర్ మాట్లాడినట్టు తెలుస్తోంది. అలాగే పార్టీ వ్యవహారాలు చూస్తున్న సీనియర్ నాయకుడు ఒకరు.. ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే పనిలో ఉన్నట్టు సమాచారం. మూడు రోజుల పర్యటనకు హైదరాబాద్ వస్తున్న తరుణంలో ఒకరోజు రాజగోపాల్‌రెడ్డి ఇంటికి ఠాగూర్‌ను తీసుకెళ్లే పనిలో ఉన్నారట.గందరగోళానికి తెరదించేస్తారా?
ఇదే సమయంలో ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిపై మరో ప్రచారం కూడా జరుగుతోంది. ఆయన పార్టీ మారతారని కొన్నాళ్లుగా నడుస్తున్న టాక్. అయితే కాంగ్రెస్‌లోనే ఉంటారని మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఈ గందరగోళానికి రాజగోపాల్ కూడా వీలైనంత త్వరగా ముగింపు పలకాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. మరి.. ఢిల్లీలో సోనియాగాంధీతో జరిగిన రహస్య భేటీ రాజగోపాల్ రాజకీయ భవిష్యత్‌ను ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.
Watch Here : https://youtu.be/fdb0uM3xn-w