గతంలో రెండుసార్లు గెలిచిన నరసాపురం పార్లమెంట్ సీటుపై ప్రత్యేకంగా గురిపెట్టింది బీజేపీ. లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో బలం పుంజుకోవడానికి చూస్తోంది. ఈ క్రమంలో ఇమేజ్ ఉన్న నాయకుల ఫ్యామిలీకి పోటీ చేసే అవకాశం కల్పిస్తుందనే చర్చ సాగుతోంది. అయితే బీజేపీ ఫోకస్‌లో ఉన్నదెవరు? మరోసారి రెబల్‌స్టార్ స్టార్‌డమ్‌ను కమలనాథులు నమ్ముకుంటారా?
కృష్ణంరాజు ఫ్యామిలీ బరిలో ఉంటుందా?
భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు నిర్వహించిన తర్వాత నరసాపురం లోక్‌సభ సీటుపై చర్చ జోరందుకుంది. పార్టీ సమావేశాల్లోనే పార్లమెంట్ సీటుపై కేడర్‌కు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. సొంతంగా బలం పెంచుకోవాలనుకున్నా.. గెలవాలని భావించినా.. బీజేపీ ముందు కనిపిస్తున్న బెస్ట్ ఆప్షన్ రెబల్‌స్టార్ కృష్ణంరాజు కుటుంబమనే చర్చ జరుగుతోంది. గతంలో కాకినాడ, నరసాపురం నుంచి ఎంపీగా గెలిచారు కృష్ణంరాజు. సినిమాల్లో రెబల్‌స్టార్ ఇమేజ్‌ను ప్రభాస్ అందిపుచ్చుకుంటే.. ఇప్పుడు కృష్ణంరాజు రాజకీయ వారసత్వాన్ని ఆ కుటుంబంలో ఒకరు తీసుకుంటారని అనుకుంటున్నారు.
కృష్ణంరాజు మేనల్లుడు నరేంద్ర పోటీకి ఆసక్తిగా ఉన్నారా?
కృష్ణంరాజు మృతి తర్వాత రెబల్‌స్టార్ ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లో ఎవరో ఒకరు కొనసాగాలని బీజేపీ సూచించినట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఆ ఫ్యామిలీ నుంచి చాలా మంది ఉన్నారు. వారిలో ఎవరు రాజకీయాల్లో ఉన్నారు? ఎవరికి అవకాశం ఉంది అనే చర్చ జరుగుతోంది. కృష్ణంరాజు మేనల్లుడు దంతులూరి నరసింహరాజు అలియాస్ నరేంద్ర బీజేపీలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ తరఫున నరసాపురం ఎంపీగా పోటీ చేసేందుకు నరేంద్ర ఆసక్తిగా ఉన్నారట. రెబల్‌స్టార్ కృష్ణంరాజు రాజకీయాల్లో ఉన్నంతకాలం పార్లమెంట్ కన్వీనరుగా.. స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న నరేంద్ర.. 2014 ఎన్నికల్లోనూ బీజేపీకి పనిచేశారు. ఎంపీగా కృష్ణంరాజు ఉన్న సమయంలో ఆయన తరఫున హెల్త్ క్యాంపులు ఇతరత్రా కార్యక్రమాలులో నరేంద్ర చేసేవారట.
కృష్ణంరాజు కుటుంబానికి సీటు ఇస్తారా?
గత ఏడాది సెప్టెంబరులో చివరల్లో మొగల్తూరులో జరిగిన కృష్ణంరాజు సంస్మరణ సభకు వేల సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. దాంతో ఆ కుటుంబానికి ఈ ప్రాంతంలో పట్టు ఉందని.. మంచి పేరు కొనసాగుతోందని చర్చ నడుస్తోందట. నరసాపురం పార్లమెంట్ పరిధిలో కృష్ణంరాజు కేంద్రమంత్రిగా చేసిన పనులను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారట ఇక్కడి జనం. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని నరసాపురం ఎంపీ సీటును కృష్ణంరాజు కుటుంబానికి బీజేపీ ఇస్తుందనే చర్చ నడుస్తోంది. ఇప్పటికే జనసేనతో పొత్తు ఉండటంతో.. కాపు, క్షత్రియ ఓట్లు కలిసి వస్తాయని లెక్కలేస్తున్నారట. ఇటు బీజేపీ కార్యక్రమాలు ఈ ప్రాంతంలో పెరుగుతున్నాయి.
రెబల్‌స్టార్ ఫ్యామిలీ బరిలో ఉంటే తిరుగే ఉండబోదని లెక్కలు
అల్లూరి సీతారామరాజు విగ్రహా ఆవిష్కరణకు ప్రధాని మోదీ వచ్చారు. తాజాగా భీమవరంలో రాష్ట్రకార్యవర్గ సమావేశాలు నిర్వహించారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, మురళీధరన్ వంటివారు తరచూ పర్యటిస్తున్నారు. క్షత్రియ, కాపు సామాజిక వర్గాలు ఆధిపత్యం చెలాయించే నరసాపురం పార్లమెంటు పరిధిలో కృష్టంరాజు కుటుంబానికి చెందిన వ్యక్తులు పోటిలో ఉంటే తిరుగే ఉండదనేది స్థానిక నాయకుల మాటగా ఉందట. మరి సొంతంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ రెబల్‌స్టార్ ఫ్యామిలీని పోటీకి ఒప్పిస్తుందా లేక పొత్తులో భాగంగా మిత్రపక్షానికి ఈ సీటును వదిలేస్తుందో చూడాలి.