ఆ నియోజకవర్గంలో ఆ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందట. నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరే ఎడమొఖం పెడమొఖంగా ఉండే వాళ్ళు. ఇద్దరు కలిసి ఒక కార్యక్రమానికి హాజరైరా మాటలు ఉండేవి కావు. ఇప్పుడా ఇద్దరి మధ్యా మూడో వ్యక్తి ఎంట్రీతో మరింత గ్యాప్ పెరిగిందట. చివరికి మా ఎమ్మెల్యేని తక్కువ చేస్తే ఊరుకోం అని సంకేతాలిస్తున్నారట..
పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గo. ఒకప్పుడు టీడీపీ కంచుకోట. ఈ నియోజకవర్గంలో లో 2019 మినహా గతంలో టిడిపి గెలుస్తూ వచ్చింది. అప్పట్లో టీడీపీ ఎమ్మెల్యేగా తానేటి వనిత తండ్రి జొన్నకూటి బాబాజీరావు రెండుసార్లు, ఒకసారి తానేటి వనిత ఈ నియోజకవర్గo నుండి గెలిచారు. నీ సామాజిక సమీకరణాలు గెలుపు ఓటములు బేరీజు వేసుకుని వైసీపీ అధిష్టానం 2019 ఎన్నికల్లో తానేటి వనిత కి కొవ్వూరు సీటు, తలారి వెంకట్రావుకి గోపాలపురం సీటు ఇచ్చింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు చేసుకుంటున్నారని అనుకున్నారు అంతా..
మాజీ ఎమ్మెల్యేగా వనిత తండ్రి బాబాజీరావుకు మంచి పట్టుంది. అలాగే టిడిపిని వెనుక నుంచి నడిపించే కమ్మ సామాజిక వర్గంలోని ముఖ్య నేతలు, తండ్రీ కూతుళ్లకు టచ్ లో ఉన్నారు. దీంతో గోపాలపురం నియోజకవర్గానికి సంబంధించిన పనుల కోసం ఎమ్మెల్యే వెంకట్రావ్ కంటే బాబాజీరావు దగ్గరకే అందరూ వెళ్తున్నారట. అలా కలుస్తున్నవారిని వని, ఆమె తండ్రి ప్రోత్సహిస్తున్నారని ఎమ్మెల్యే వర్గం మండిపడుతోంది.
మంత్రి కనీసం ప్రోటోకాల్ కూడా పాటించటం లేదని ఎమ్మెల్యే వర్గం వాపోతోంది. గోపాలపురం నుంచి ఎవరైనా మంత్రి వగ్గరకు వెళ్తే స్థానిక ఎమ్మెల్యే ని కలవమని చెప్పాల్సింది పోయి, ఇలా చేయటం ఏంటనేది వారి వాదన
ఇదే కాదు… నియోజకవర్గంలోని కంకర క్వారీ అంశం కూడా వనిత- వెంకట్రావ్ మధ్య వివాదాలకు కారణమవుతోంది. తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని తలారి పార్టీ పెద్దల దగ్గర నెత్తీ నోరు బాదుకుంటున్నారట. అంతేకాదు.. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండగానే వనిత తండ్రి బాబాజీరావు ఒకడుగు ముందుకు వేసి, వచ్చే ఎన్నికల్లో గోపాలపురం నుండే వనిత పోటీ చేస్తుందని ప్రచారం చేసుకుంటున్నారని..ఎపుడో జరిగే ఎన్నికలకు ఇప్పటి నుండే ప్రచారం అవసరమా అని తలారి అనుచరులు గరం గరంగా ఉన్నారట… మరి నియోజకవర్గం మార్పు కేవలం ప్రచారమేనా, లేదా మార్పు ఉంటుందో తెలియదు కాని మా ఎమ్మెల్యే ని తక్కువ చేస్తే చూస్తూ ఊరుకోమనే సంకేతాలు ఇస్తున్నారట తలారి వెంకట్రావు వర్గం…