తిరుమల వేంకటేశ్వరుని క్షణకాల దర్శనమే అమోఘం.. అద్భుతం. అలాంటిది స్వామి వారికి సేవ చేసుకోవడానికి ఎంపిక అయితే మహాద్భుతమే…! కానీ, TTDలో ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులైన 52 మందిని దురదృష్టం వెంటాడుతూనే ఉందా? వారి ఆశలు అడియాశలేనా? హైకోర్టు కామెంట్స్‌తో ఆర్డినెన్స్‌కు బ్రేక్ పడిందా లేక పూర్తిగా ఆగిపోయిందా? అసలేం జరిగింది? లెట్స్ వాచ్..!
టీటీడీ బోర్డుపై ధర్మాసనం కీలక కామెంట్స్..!
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం తర్వాత ఎదురైన సమస్యలు ఇప్పట్లో కొలిక్కివచ్చేలా లేవు. 29 మందిని బోర్డు సభ్యులుగా.. మరో 52 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ జారీ చేసిన జీవోలు కోర్టు విచారణలో ఉన్నాయి. ప్రత్యేక ఆహ్వానితులకు సంబంధించిన రెండు జీవోలను హైకోర్టు తాత్కాలిక సస్పెండ్ చేసింది. దేవాదాయశాఖ చట్టం ప్రకారం క్రిమినల్ కేసుల్లో ఉన్నవారిని పాలకమండలి సభ్యులుగా నియమించకూడదని బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి దాఖలు చేసిన మరో పిటిషన్‌పై ధర్మాసనం చేసిన కామెంట్స్ ఇప్పుడు కీలకంగా మారాయి.
ఆర్డినెన్స్ తీసుకురావాలని అనుకున్న సమయంలో..!
ఇండియన్ మెడికల్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు కేతన్ దేశాయ్ వంటి వారిని బోర్డులోకి తీసుకోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని TTD ఈవో, దేవాదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీలకు ఆదేశించింది. వాస్తవానికి 52 మంది ప్రత్యేక ఆహ్వానితులకు లైన్ క్లియర్ చేసేందుకు ఆర్డినెన్స్ తీసుకొస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ ఆర్డినెన్స్ తీసుకురావాలని అనుకున్న సమయానికి హైకోర్టు చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రక్రియకు బ్రేక్ పడినట్టు సమాచారం.
వివాదాన్ని మరింత పెద్దదిగా చేసుకోవడం మంచిదికాదనే ఆలోచన..!
ప్రత్యేక ఆహ్వానితుల నియామక జీవోలను హైకోర్టు సస్పెండ్ చేయడంతో దేవాదాయశాఖ చట్టానికి సవరణ చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. గత నెల 28న జరిగిన కేబినెట్‌లోనే దీనిపై నిర్ణయం తీసుకుంటారని భావించారు. కానీ.. 27న హైకోర్టులో జరిగిన విచారణతో.. వివాదాన్ని మరింత పెద్దదిగా చేసుకోవడం మంచిది కాదని సర్కార్ అభిప్రాయపడినట్టు సమాచారం. అందుకే ఆర్డినెన్స్ నిర్ణయంపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. టీటీడీలో పాలకమండలి సభ్యులుగా ఉండాలంటే.. ధార్మిక కార్యక్రమాలు నిర్వహించాలి.. లేదా మంచి వ్యక్తిత్వం కలిగిన వారుగా.. ఎలాంటి క్రిమినల్ కేసుల్లోనూ శిక్ష పడని వారై ఉండాలి. ఈ అంశాలనే కోర్టుకెళ్లినవారు ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.
హైకోర్టు స్పష్టత ఇచ్చాకే ప్రభుత్వం తదుపరి చర్యలు..!
జీవోలపై హైకోర్టు తుది తీర్పు ఎలాంటి మలుపు తిరుగుతుందో తెలియదు. ధర్మాసనం స్పష్టత ఇచ్చాకే ప్రత్యేక ఆహ్వానితుల అంశంలో తదుపరి అడుగులు వేయాలని ప్రభుత్వం అనుకుంటోందట. అందుకే ఆ 52 మందిపై మళ్లీ చర్చ మొదలైంది. మరి.. ఈ సమస్యను సర్కార్ ఎలా అధిగమిస్తుందో.. ఎదురుచూపుల్లో ఉన్న ప్రత్యేక ఆహ్వానితులకు లైన్ క్లియర్ అవుతుందో లేదో చూడాలి.