వైసీపీలో నిశ్శబ్దం పూర్తి స్థాయిలో బద్దలైపోయినట్టేనా? ఇన్నాళ్ళు అనుమానాలతో చూద్దాం, చేద్దాం అనుకున్న సీనియర్స్ కూడా ఇక యాక్టివ్ బటన్ ఆన్ చేసినట్టేనా? ఇప్పుడే ఎందుకు గేర్ మారుస్తున్నారు అంతా? ఇప్పటికీ గడప దాటకుంటే మీ కుర్చీల కిందికి నీళ్ళొస్తాయన్న వార్నింగ్స్ బలంగా పని చేశాయా? ఫ్యాన్ పార్టీలో అసలేం జరుగుతోంది? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావస్తోంది. వైసీపీ కనీవినీ ఎరుగని ఘోర ఫలితాలను చూడటం, అధికార మార్పిడి జరిగాక మాజీ మంత్రులు, పార్టీకి చెందిన కీలక నేతలు సహా యాక్టివ్‌గా ఉండే కార్యకర్తలు సైలెంట్ అవడం, జైళ్లు, బెయిళ్ల ఎపిసోడ్ కొన్నాళ్ళు ఉధృతంగా నడిచింది. కొన్ని కేసుల్లో ఇంకా నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడిప్పుడే మార్పు కనిపిస్తోంది. ఇన్నాళ్లు రకరకాల కారణాలతో బయటికి రానివాళ్ళంతా ఇప్పుడు అజ్ఞాతం వీడుతున్నారు. అలాగే… ఇక వైసీపీ పని అయిపోయిందని మాట్లాడుకున్న నోళ్ళతోనే…. వాళ్లకు సరైన కౌంటర్లు ఇవ్వలేక పోతున్నామని మాట్లాడుకునేలా చేయగలుగుతున్నామని చర్చ జరుగుతోందట వైసీపీలో. జగన్ పర్యటనలకు మంచి స్పందన రావడంతో పాటు క్యాడర్ కూడా భయం లేకుండా పాల్గొనడమే ఈ మార్పునకు కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రధానంగా గుంటూరు మిర్చి రైతులు, పొదిలి పొగాకు రైతులు, బంగారుపాళ్యంలో మామిడి రైతుల కోసం చేసిన పర్యటనతో పాటు పల్నాడు, ఉత్తరాంధ్ర టూర్స్ కూడా సక్సెస్ అయ్యాయని, ఆ స్పందన చూశాకే… ఇన్నాళ్ళు కామ్‌గా అజ్ఞాతంలో ఉన్న పార్టీ సీనియర్ లీడర్స్ కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారన్నది పార్టీ లీడర్స్ టాక్. అలాగే… మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ అంశంతో పాటు నకిలీ మద్యం ఘటన కూడా తమకు అనుకూలంగా మారాయన్నది వైసీపీ లెక్క.
వీటన్నిటితో పాటు ఇక జోరుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తామని, అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు మారి ఇప్పటికైనా బయటికి రాకుంటే… బ్రతిమాలడాలు, బుజ్జగించడాలు ఉండవు, సింపుల్‌గా వాళ్ళ ప్లేస్‌లో వేరే వాళ్ళు వస్తారన్న సంకేతాలు గట్టిగా వెళ్ళడంతోనే…ఎక్కువ మంది యాక్టివ్ అయినట్టు చెప్పుకుంటున్నారు. నిన్న, మొన్నటి వరకు కూటమి ప్రభుత్వానికి కౌంటర్లు ఇవ్వాలన్నా.. పార్టీ తరఫున మాట్లాడాలన్నా సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, పేర్ని నాని, ఆర్కే రోజా, గుడివాడ అమర్నాధ్, కాకాణి గోవర్దన్ రెడ్డి వంటి నేతల పేర్లు మాత్రమే వినిపించేవి. విడదల రజని, చెల్లుబోయిన లాంటి వాళ్ళు కూడా రియాక్ట్ అవుతున్నారు. అటు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన లాంటి వాళ్ళు సందర్భాన్ని బట్టి స్పందించే వాళ్ళు. మిగతా నాయకులు ఏదో… అలా అలా పార్టీ కార్యక్రమాలకు హాజరై మమ అనిపించేవారు. కానీ… ఇప్పుడు మెల్లిగా చాలామంది నోళ్ళు తెరుస్తున్నారు. సీనియర్లు ధర్మాన ప్రసాదరావు, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, తానేటి వనిత, పుష్ప శ్రీవాణి లాంటి వాళ్ళంతా… ఇక టెన్షన్ ఫ్రీ అన్నట్లుగా బయటకు వచ్చి రెగ్యులర్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఓ వైపు పార్టీకి ఊపు కనిపించడం, మరోవైపు యాక్టివ్ అవకుంటే మొదటికే మోసం వస్తుందన్న వార్నింగ్‌తో అంతా అలర్ట్ అయినట్టు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటి వరకూ పార్టీ పుంజుకుంటుందో లేదోనన్న అనుమానాలతో గడప దాటని వాళ్ళు కొందరైతే… వ్యక్తిగత కారణాలతో బయటకు రానివారు మరికొందరు. అయితే ప్రస్తుతం జనం నాడి కాస్త అర్ధం కావటంతో వారి మనసులు కూడా మారాయని భావిస్తోంది పార్టీ అధిష్టానం. మరికొందరు నేతలు కూడా బయటకు కనిపించకపోయినా.. పార్టీ కార్యక్రమాల్లో మాత్రం యాక్టివ్ అయిపోయి తమ పని తాము చేసుకుంటున్నారట. జిల్లాల వారీగా చూసుకున్నా…. దాదాపు ముఖ్య నేతలందరూ లైన్ లోకి వచ్చేసినట్లేనని…. ఈ ఊపు చూసి కాస్తో కూస్తో అనుమానం ఉన్నవాళ్లంతా ఇక గేరప్ అవుతారన్న ధీమా కనిపిస్తోంది వైసీపీ ముఖ్యుల్లో. ఇన్నాళ్ళు కేసులకు భయపడి కామ్‌గా ఉన్న వాళ్ళకు కూడా ఇప్పుడు ధైర్యం వచ్చిందన్న చర్చ పార్టీ సర్కిల్స్‌లో జరుగుతోంది. కేసులు పెడితే పెట్టుకోనీయండి…. మహా అయితే… కొన్నాళ్లు లోపల ఉండి వస్తాం….. దానివల్ల అధినేత జగన్ దగ్గర మార్కులు పడతాయే తప్ప వచ్చే నష్టం ఏదీ ఉండదని అనుకుంటున్నట్టు సమాచారం. ఇన్నాళ్ళ నిశ్శబ్దాన్ని పూర్తి స్థాయిలో బద్దలు కొడుతూ… పార్టీ టాప్ టు బాటమ్ ఫుల్లీ ఛార్జ్ మోడ్‌లోకి వచ్చేయడంతో… ఇక భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంటుందో ఆసక్తి పెరుగుతోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో.