ఎవరు? ఆ లీకు వీరులెవరు..? ప్రధాని మోడీతో తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎంపీల మీటింగ్ వివరాలను బయటికి చెప్పిందెవరు?.. దీని గురించి బయట ఎక్కడా చర్చ జరక్కూడదని స్వయంగా మోడీ చెప్పినా సరే.. లీక్ చేసింది ఎవరు? అనుమానపు చూపులు ఎటువైపు ఉన్నాయి? పార్టీ వర్గాలు ఏమంటున్నాయి?.
కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాల బీజేపీ ఎంపీలతో ఇటీవల ప్రత్యేకంగా సమావేశమయ్యారు ప్రధాని మోడీ. ఆయా రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీ పని తీరుపై ఆరా తీశారు. ఇప్పటిదాకా వాళ్లేం చేశారో చెప్పి… ఇక మీదట ఏం చేయాలో కూడా సూచించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పెర్ఫార్మెన్స్, ఎంపీల పనితీరుకు సంబంధించి తన మనసులో ఉన్న అభిప్రాయాలను ఎంపీలతో పంచుకున్నారు ప్రధాని. ఆ క్రమంలోనే తెలంగాణ బీజేపీ లోక్‌సభ సభ్యులకు క్లాస్ పీకారని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నా పట్టించుకోకుండా మీరేం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారని బయట ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం లేదు, మీకన్నా అసదుద్దీన్ ఒవైసీ సోషల్ మీడియా బెటర్ అని అన్నట్టు వార్తలు వచ్చాయి. ఇక్కడే సరికొత్త డిస్కషన్ మొదలైంది. మీటింగ్ వివరాలు బయటికి పొక్కకూడదని సూచించినా… ఎవరు చెప్పారన్నది ఒక ప్రశ్న అయితే… అసలు లోపల జరిగింది ఒకటి, బయట ప్రచారం జరుగుతోంది మరొకటన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి తాజాగా పార్టీ వర్గాల నుంచి. పార్టీ ఎంపీలతో ప్రధానమంత్రి మీటింగ్‌పై తప్పుడు ప్రచారం చేశారన్నది కొందరు బీజేపీ నాయకుల అభిప్రాయం.
Also Read: Off The Record: సీఎం రేవంత్ ఇన్ని రోజులు ఢిల్లీలో ఎందుకున్నారు.. ఏదో జరిగిపోతోందన్న గుసగుసలు!
తెలంగాణలో పార్టీ బలపడేందుకు ప్రధానమంత్రి సలహాలు ఇచ్చారు, సోషల్ మీడియాలో యాక్టివిటీ పెంచాలని సూచించారే తప్ప క్లాస్‌లు, కోపతాపాల్లాంటివేం లేవన్నది లేటెస్ట్ వెర్షన్. ఈ సమావేశం వివరాలు బయటకు చెప్పొద్దని స్వయంగా మోడీనే చెప్పారట. అయినా బయట చెప్పడం కరెక్ట్ కాదని, ఆ లీక్ వీరులు ఎవరో తెలుసుకుని పార్టీ పరంగా చర్యలుంటాయని అంటున్నారు తెలంగాణ బీజేపీ నాయకులు. ప్రధాన మంత్రి అసద్‌ని పొగిడారని లీకులిచ్చారంటే… అసలు వాళ్ళ ఉద్దేశ్యం ఏంటన్నది తెలంగాణ బీజేపీ ఎంపీల ప్రశ్న. బయటకు వచ్చిన కంటెంట్‌ను బట్టి చూస్తే… కచ్చితంగా తెలంగాణ ఎంపీలైతే లీక్ చేసి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. కావాలనే సెలక్టివ్‌గా వివరాలు బయటికి చెప్పి ఉండవచ్చన్నది కొందరి విశ్లేషణ. తెలంగాణ ఎంపీల వల్లే వివరాలు లీకై ఉంటేగనక ఏపీలో చంద్రబాబు పాలనను మెచ్చుకున్నారని, మా వాళ్లకు క్లాస్ పీకారని చెప్పుకునే అవకాశం లేదు.
ప్రత్యేకంగా అసదుద్దీన్ ఓవైసీ ప్రస్తావన తీసుకురాబోరని అనుకుంటున్నారు. దీన్నిబట్టి చూస్తుంటే… ఏపీకి చెందిన బీజేపీ ఎంపీలు ఎవరైనా లీక్ చేసి ఉంటారా అన్న అుమానాలు ఉన్నాయట తెలంగాణ లీడర్స్‌లో. పైగా… మీటింగ్ వివరాలు బయటకు చెప్పొద్దని స్వయంగా ప్రధాని మోడీనే ఆదేశించినా…. అదేమీ పట్టించుకోకుండా… బయటకు వచ్చి లీక్ ఇచ్చారంటే.. ఆ నేతకు పార్టీ మీద, ప్రధాని మీద ఎంత మాత్రం గౌరవం, ప్రేమ ఉన్నాయో అర్ధమవుతోందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. మొత్తం మీద తెలంగాణ బీజేపీ ఎంపీలకు ప్రధాని క్లాస్ అన్న లీకు మాత్రం రెండు రాష్ట్రాల్లోని పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఆ లీకు వీరుడి సంగతేందో తేల్చాలని తెలంగాణ ఎంపీలు గట్టిగా అనుకుంటున్నట్టు సమాచారం. చూద్దాం… ఎవరు బయటికి వస్తారో.