సీనియర్.. జూనియర్ వివాదం టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతోందా? ఓటు బ్యాంకు చీలిపోతుందనేది దేశం వర్గాల ఆందోళనా? ఇన్నాళ్లూ తమకే సొంతమనుకున్న బ్రాండ్‌ను.. ఇప్పుడు ప్రత్యర్థులు వాడేస్తున్నారా? ఆ అంశంలో టీడీపీ నేతలు ఏం చేయాలో తెలియక దిక్కులు చూస్తున్నారా?
ఎన్టీఆర్ బ్రాండ్‌ను ఓన్ చేసుకుంటున్న కొడాలి నాని
నందమూరి తారక రామారావు. సినిమాల వరకు ఈ పేరు తెలుగువారి బ్రాండ్. పొలిటికల్ యాంగిల్‌లో చూస్తే టీడీపీకి NTR బ్రాండ్. ఇప్పుడా పరిస్థితి లేదు. కొడాలి నాని టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్లాక ఎన్టీఆర్ టు YSR అనే పేరుతో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ జయంతి.. వర్ధంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నందమూరి కుటుంబంతో కొడాలి నానికి అనుబంధం ఉంది. రాజకీయంగా కలిసి వస్తుందనే ఉద్దేశంతో కొడాలి నాని NTR బ్రాండ్‌ను ఓన్ చేసుకుంటున్నారని అనుకున్నారు. వైసీపీకి చేరవైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఎన్టీఆర్ బ్రాండ్ విషయంలో కొడాలి నాని స్టయిల్‌నే ఫాలో అవుతున్నారు. ఇక లక్ష్మీపార్వతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ఎన్టీఆర్ బ్రాండ్‌ను వైసీపీ నేతలు కూడా తమదిగా చెప్పుకోవడం విస్తరిస్తోంది.
ఎన్టీఆర్ గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించలేని టీడీపీ
తాజాగా నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు ఓ వీధికి ఎన్టీఆర్ పేరు పెట్టారు. విగ్రహాం ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. వైసీపీ కూడా సమయానుకూలంగా ఎన్టీఆర్ పేరును ప్రస్తావిస్తూ టీడీపీని టార్గెట్ చేస్తోంది. ఈ బ్రాండ్ పాలిటిక్సే టీడీపీని ఇబ్బంది పెడుతున్నాయట. ఎలా కంట్రోల్ చేయాలో తెలియక నానా ఇబ్బందులు పడుతున్నారట టీడీపీ నేతలు. NTR గురించి మీరెందుకు మాట్లాడుతున్నారని గట్టిగా మాట్లాడలేని పరిస్థితి. అలాగని ప్రత్యర్ధి పార్టీలను ఎన్టీఆర్ బ్రాండ్ విషయంలో కంట్రోల్ చేయలేని దుస్థితి.
జూనియర్ ఎన్టీఆర్ బ్రాండ్‌నూ వాడేస్తున్న వైసీపీ నేతలు
ఇప్పుడు మరో సమస్య టీడీపీని ఇబ్బందుల్లోకి నెడుతోంది. జూనియర్ ఎన్టీఆర్ పేరును కూడా వైసీపీ నేతలు వాడేస్తున్నారు. పెద్ద ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా గుడివాడలో కొందరు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో బైక్ ర్యాలీ చేపట్టారు. ఆ ఫ్యాన్స్ వెనుక కొడాలి నాని ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామం స్థానిక టీడీపీ నేతలనే కాదు.. టీడీపీ అధిష్ఠానాన్ని షాక్ అయ్యేలా చేసిందట. ఇప్పటి వరకు సీనియర్ ఎన్టీఆర్ బ్రాండ్ విషయంలో ఎలాంటి గేమ్ ఆడారో.. జూనియర్ ఎన్టీఆర్ విషయంలోనూ వైసీపీ నేతలు అదే చేస్తున్నట్టు సందేహిస్తున్నారు టీడీపీ నాయకులు.
ఎన్టీఆర్ ఫాన్స్‌లో ఓట్ల పరంగా చీలిక వస్తుందా?
ఈ పరిణామాలు గుడివాడకే పరిమితం కాకుండా మిగతా ప్రాంతాలకు విస్తరించే ప్రమాదం ఉందని టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే నియోజకవర్గాల్లో ఇబ్బందులేనని భయపడుతున్నారట. టీడీపీ సానుభూతి పరుల్లోనూ.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లోనూ ఓట్ల పరంగా చీలిక తెచ్చేందుకే వైసీపీ ఈ గేమ్ ఆడుతోందనే వాదన దేశం వర్గాల్లో ఉంది. దాంతో ఎన్నికల్లో కలిగే నష్టంపై అంచనాలు వేస్తున్నారట. మరో చర్చ కూడా జరుగుతోంది. టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. పవన్ కల్యాణ్‌తోపాటు మెగా కాంపౌండ్‌కు కౌంటర్‌గా జూనియర్ NTRను వైసీపీ తెరమీదకు తెవొచ్చనేది దేశం వర్గాల డౌట్. ఫ్యాన్స్ వార్‌ను పొలిటికల్ వార్‌గా మార్చి రాజకీయ లబ్ధికి వైసీపీ ప్రయత్నించొచ్చని సందేహిస్తున్నారట. తమకున్న ఓటు బ్యాంకును చీల్చే కుట్రగా వారు అభిప్రాయ పడుతున్నారు.
ఎన్టీఆర్ ఫ్లెక్సీలు పెట్టొద్దని వైసీపీని డిమాండ్ చేసే పరిస్థితి టీడీపీకి లేదా?
సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను పెట్టొద్దని.. వారి బొమ్మలు వాడొద్దని వైసీపీని డిమాండ్ చేస్తే సమస్య మరింత సున్నితంగా మారే ప్రమాదం ఉందని టీడీపీ నాయకులు వెనక్కి తగ్గుతున్నారట. ఈ అంశాన్ని వైసీపీ పొలిటికల్ కోణంలో చూస్తున్నా.. టీడీపీకి ఫ్యామిలీ యాంగిల్ ఉంటుంది. దీంతో ఎన్టీఆర్ బ్రాండ్ పాలిటిక్స్‌కు చెక్ చెప్పాలంటే జాగ్రత్తగా అడుగులు వేయాలి. అదెలాగో అంతు చిక్కక కలవర పడుతున్నారట టీడీపీ నేతలు.
.