టీడీపీ ఇంఛార్జ్ పదవికి గుడ్‌బై చెప్పారు ఆ మాజీ ఎమ్మెల్యే. పార్టీకి దిక్కూ దివానా లేకుండా పోయింది. అక్కడ పార్టీని పట్టించుకోకపోయినా.. అక్కడ నుంచి పోటీ చేయడానికి మాత్రం చాలామంది సిద్ధంగా ఉన్నారట. అధిష్ఠానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో కానీ.. ఈలోగా కేడర్ చెదిరిపోకుండా ఉంటే అదే పదివేలు అన్నట్టు ఉంది పరిస్థితి.
మాజీ ఎమ్మెల్యే పెందుర్తికి అధిష్ఠానమే పొగ పెట్టిందా?
తూర్పుగోదావరి జిల్లాలోని రాజానగరం నియోజకవర్గంపై టీడీపీ ఆశావహుల దృష్టి పడింది. ఇప్పటి వరకూ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తన పదవికి గుడ్‌బై చెప్పేశారు. పెందూర్తి రాజీనామా అని అనేకన్నా.. తెలుగుదేశం అధిష్ఠానమే ఆయనకు పొమ్మనకుండా పొగ పెట్టిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 2009, 2014 వరుసగా రెండుసార్లు గెలిచిన పెందుర్తి 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ ఓటమితో రాజానగరం టిడిపిని పెందుర్తి విస్మరించారనేది కేడర్ అభియోగం. ఆ విషయం అధిష్ఠానానికి చేరడంతో పెందూర్తిపై అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారట. అప్పటి నుంచి నియోజకవర్గంలో టీడీపీ సీన్ మారిపోయిందని టాక్.
ఇంఛార్జ్‌గా ఉన్నప్పుడు పెందుర్తి తీరుపై అధిష్ఠానం ఆగ్రహం
రాష్ట్రంలోని నియోజకవర్గాల్లో టీడీపీ పరిస్థితులపై సర్వే చేయించిన పార్టీ అధిష్ఠానం గత ఆరు నెలలుగా ఇంఛార్జులతో వన్ టూ వన్ సమావేశాలు నిర్వహిస్తోంది. ఆ క్రమంలోనే గత ఏడాది అక్టోబర్ 8న రాజానగరం ఇంఛార్జిగా ఉన్న పెందుర్తి వెంకటేష్‌ను కూడా పిలిపి పలు సూచనలు చేశారట. ఆపై అక్టోబర్ 14న మంగళగిరిలోని పార్టీ ఆఫీసుకు నియోజకవర్గ ముఖ్య నాయకులు దాదాపు 50 మందిని వెంటబెట్టుకుని వెళ్లిన పెందూర్తి వెంకటేష్ అధినేతతో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో అధినేత ఆగ్రహం వ్యక్తం చేశారని ప్రచారం సాగింది. ఇంఛార్జి పెందూర్తి వెంకటేష్‌తో సహా నియోజకవర్గ నాయకుల వ్యవహారశైలిని తప్పుపట్టారట. 3నెలల సమయం ఇస్తున్నానని, పనితీరు మార్చుకోకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటామని అధినేత చెప్పేశారట.
టికెట్ రాదనే ప్రచారంతో పెందుర్తి తప్పుకొన్నారా?
3 నెలల గడువు ముగిసినా రాజానగరం టిడిపిలో మార్పు రాలేదని అధినేత గ్రహించారట. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల నియామకం, బూత్, క్లస్టర్ కమిటీల ఏర్పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాలను మొక్కుబడిగా నిర్వహించారనే ప్రచారం జరిగింది. ఆ పరిణామాలతో వచ్చే ఎన్నికల్లో పెందుర్తి వెంకటేష్‌కు టిడిపి టికెట్ ఇవ్వదనే టాక్ మొదలైంది. దాంతో అధిష్ఠానం పీకేయకుండానే ఆయనే నియోజకవర్గ ఇంఛార్జ్ పదవి నుంచి తప్పుకున్నారు. వచ్చే ఎన్నికల్లో అధిష్ఠానమే తనను మళ్లీ పిలిచి టికెట్ ఇస్తుందనే ఆశాభావంతో ఉన్నారు పెందుర్తి. తన ఆశీసులు లేకుండా టిడిపి రాజానగరంలో గెలవడం అసాధ్యమనే లెక్కలలో ఉన్నారు మాజీ ఎమ్మెల్యే.
బుచ్చయ్యను రాజానగరం పంపుతారా?
సీటు విషయంలో మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ లెక్కలు ఎలా ఉన్నప్పటికీ.. రాజానగరంలో టికెట్ కోసం కర్చీఫ్‌లు వేసే నేతలు ఎక్కువయ్యారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్ని కృష్ణ రాజానగరం టికెట్ ఆశిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. జనసేనతో పొత్తు కుదిరితే రాజమండ్రి రూరల్ సీటును ఆ పార్టికి వదిలేస్తారని.. అప్పుడు బుచ్చయ్య చౌదరిని రాజానగరం పంపుతారనే వాదన కూడా వినిపిస్తోంది. అయితే ముందుగా ఇంఛార్జ్ ఎవరో చెబితే.. ఆ మేరకు కేడర్‌ను కాపాడుకోవచ్చునని తెలుగు తమ్ముళ్లు సూచిస్తున్నారట. మరి.. పార్టీ పెద్దలు కొత్త అభ్యర్థిని తెరపైకి తెస్తారో.. మాజీ ఎమ్మెల్యే పిలిచి పోటీ చేయిస్తారో చూడాలి.