పక్కనే ఉన్న నియోజకవర్గంలో ఓ మహిళా నేతను ఆ మంత్రి ప్రోత్సహిస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఆమె అక్కడ పోటీ చేసే విధంగా గ్రౌండ్ వర్క్ మొదలు పెట్టారా? ఆ మహిళా నేత కూడా భర్తతో కలిసి ఫీల్డ్ ఎంట్రీ ఇచ్చారా? మరి.. ఆ సెగ్మెంట్‌లోని సిట్టింగ్ MLA పరిస్థితి ఏంటి?
కేడర్‌తో పొసగని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు
దాడిశెట్టి రాజా. ఏపీ మంత్రి.. తుని ఎమ్మెల్యే. తుని పక్కనే విశాఖ జిల్లాకు చెందిన నియోజకవర్గం పాయకరావుపేట ఉంది. అది SC రిజర్వ్డ్ నియోజకవర్గం. పాయకరావుపేటలో YCP MLAగా గొల్ల బాబూరావు ఉన్నారు. కొన్నాళ్లుగా గొల్లబాబూరావుకు.. పాయకరావుపేటలోని వైసీపీ కేడర్‌కు పడటం లేదు. రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నియోజకవర్గంలో ఆయన పర్యటనకు వెళ్తే అడ్డుకున్న ఉదంతాలు ఉన్నాయి. దాంతో వచ్చే ఎన్నికల్లో బాబూరావు అక్కడ నుంచి పోటీ చేసే అవకాశం లేదనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలను అనుకూలంగా మలుచుకోవాలని అనుకున్నారో ఏమో.. మంత్రి రాజా.. పేటలో అడ్వాన్స్ అవుతున్నారనే ప్రచారం మొదలైంది.
అమ్మాజీని పాయకరావుపేటలో పోటీ చేయించే ఎత్తుగడ?
ఏపీ SC కార్పొరేషన్ ఛైర్మన్ పెదపాటి అమ్మాజీని వచ్చే ఎన్నికల్లో పాయకరావుపేటలో పోటీ చేయించేలా సాయం పడుతున్నారట మంత్రి రాజా. అమ్మాజీ గతంలో పాయకరావుపేటలో మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. జడ్పీటీసీగా కూడా అవకాశం వచ్చింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత SC కార్పొరేషన్ ఛైర్మన్‌గా అమ్మాజీకి పదోన్నతి కల్పించింది అధిష్ఠానం. అంతేకాదు.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం వైసీపీ ఇంఛార్జ్‌గానూ బాధ్యతలు అప్పగించారు. గత ఎన్నికల్లో రాజోలులో జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాద్ అధికారపార్టీ పంచన చేరడంతో.. అమ్మాజీకి అక్కడ సీన్ తగ్గింది. అప్పట్లో అమ్మాజీని రాజోలు పంపించడంలో మంత్రి రాజానే ఓ మాట వేశారని చెబుతారు.
మంత్రి రాజా ఎత్తుగడలతో క్లారిటీ వచ్చిందా?
ఇప్పుడు అమ్మాజీ చూపు పాయకరావుపేటపై పడటంతో లోకల్ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అంటే తమకు వ్యతిరేకత లేదని అమ్మాజీ దంపతులు చెబుతున్నారు. రెండు నెలల క్రితం SI, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు మంత్రి రాజా. తునితోపాటు పాయకరావుపేట అభ్యర్థులు కూడా కోచింగ్ తీసుకోవచ్చని ఆయన చెప్పారు. మంత్రికి పాయకరావుపేటపై ఎందుకింత ప్రేమ అని ఆనాడు సందేహించిన వాళ్లకు.. ఇప్పుడు సమాధానం దొరికిందట. అమ్మాజీ సైతం పేటలో పరిస్థితులకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు.
పోటీ చేయడమే తరువాయి అన్నట్టు అమ్మాజీ హడావిడి..!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పాయకరావుపేటలో వంగలపూడి అనిత పోటీ చేస్తారని.. వైసీపీ తరఫున కూడా మహిళా అభ్యర్థి ఉంటే బాగుంటుందని రాజా వర్గం శ్రుతి కలుపుతోంది. అనిత విమర్శలకు అంతే వేగంగా బదులిస్తున్నారు అమ్మాజీ. పార్టీ ఆదేశిస్తే తనకు అభ్యంతరం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. రెండు వర్గాలుగా విడిపోయిన పాయకరావుపేట వైసీపీని ఏకతాటిపైకి తీసుకొస్తానని.. సన్నిహితుల సమావేశంలో ఆమె హామీ ఇస్తున్నారట. మంత్రి దాడిశెట్టి రాజా ఆశీసులు కూడా ఉండటంతో పేటలో ఇక పోటీయే తరువాయి అన్నట్టు హైప్ క్రియేట్ చేస్తున్నారు అమ్మాజీ.
పేటను తన వర్గానికి రిజర్వ్ చేసే పనిలో మంత్రి..!
మొత్తానికి పాయకరావుపేట రాజకీయాల్లో పొరుగు జిల్లా మంత్రి దాడిశెట్టి రాజా పెత్తనం వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది. రిజర్వ్డ్ నియోజకవర్గాన్ని తన వర్గానికి రిజర్వ్ చేసే పనిలో పడ్డారు. అమ్మాజీ కూడా అవకాశం బాగానే వచ్చిందని స్పీడ్ పెంచడం ఆసక్తి కలిగిస్తోంది. ఈ పరిణామాలను ఎమ్మెల్యే గొల్ల బాబూరావు మౌనంగా వీక్షిస్తున్నారు. మరి.. అధిష్ఠానం ఎవరికి ఛాన్స్ ఇస్తుందో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.