తెలంగాణ కేబినెట్ కట్టు తప్పుతోందా? మంత్రుల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందా? ఏమవుతుందిలే అనుకుంటూ.. నోటికి పనిచెప్పే బ్యాచ్ పెరుగుతోందా? అసలు అజెండా కంటే… సొంత అజెండానే కొందరికి ఎక్కువైపోయిందా? కొంచెం తగ్గించుకుంటే మేలేమో….. అని సొంత పార్టీ నేతలే ఎందుకు అనాల్సి వస్తోంది? మంత్రులు ఔటాఫ్ కంట్రోల్ అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? తెలంగాణ కేబినెట్ మంత్రుల్లో కొందరు అసలు పని గాలికొదిలేసి…. అనవసర విషయాల్లో అతిగా స్పందిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. మేం ఏం మాట్లాడినా నడిచిపోతుంది, ఏం చేసినా చెల్లుబాటవుతుందన్న ధోరణి బాగా పెరిగిపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. నోరు అదుపులో పెట్టుకోలేక కంట్రోల్ తప్పడం వల్లే సమస్యలు పెరుగుతున్నట్టు కేబినెట్ సహచరులే మాట్లాడుకుంటున్నారట. ఏదన్నా ఒక సమస్య వచ్చిందంటే… అది రిపీట్ అవకుండా చూసుకోవడమన్నది కామన్. కానీ.. ఇక్కడ మాత్రం ముందు కొందరు మంత్రులు సమస్యలు ఎదుర్కొంటున్నా… మిగతా వాళ్ళు వాటిని చూసి కూడా అలర్ట్ అవడం లేదట. అసలే చీమ చిటుక్కుమన్నా….ప్రతిపక్షాలు తగులుకుంటున్నాయి. అయినా.. మంత్రుల తీరు మాత్రం మారడంలేదని కాంగ్రెస్ వర్గాలే మాట్లాడుకుంటున్నాయి.
ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం.. తాజాగా పొన్నం, అడ్లూరి ఎపిసోడ్. కొండా సురేఖ నుండి మొదలైన ఈ వివాదం తాజాగా పొన్నం వరకు వచ్చింది. కొండా అప్పట్లో చేసిన కామెంట్స్ పరువు నష్టం కేసు వరకు వెళ్ళాయి. ప్రత్యర్థి మీద చేసిన ఆరోపణలతో కేసులు ఎదుర్కోవచ్చు కానీ… సొంత పార్టీ నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం నాలుక కరుచుకోవడంతోపాటు పీకలు తెంచుకునే వరకు వస్తోందంటున్నారు. తాజాగా ప్రెస్‌మీట్ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆ సమావేశానికంటే ముందు… కొన్ని కామెంట్స్ చేశారు. అవి సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ని ఉద్దేశించేనంటూ క్షణాల్లో ఆ మాటలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో వివాదం మొదలైంది. ఆ తర్వాత పొన్నం కార్యాలయం నుంచి నేను అట్లూరి లక్ష్మణ్‌ని ఉద్దేశించి ఎలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదంటూ ప్రకటన వచ్చింది. ఇక ఆ ఎపిసోడ్ ముగిసిందని అనుకుంటున్న టైంలో… సోమవారం మంత్రి శ్రీధర్ బాబు చిట్ చాట్‌లో పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టారు.
సహచర మంత్రులపై అలాంటి మాటలు సరికాదంటూ శ్రీధర్ బాబు కామెంట్ చేశారు. ఈ క్రమంలోనే… ఇవాళ ఉదయం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఓ వీడియో విడుదల చేశారు. దళిత నేతలంటే గౌరవం లేదంటూ రియాక్ట్ అయ్యారు. క్షమాపణ చెప్తారనుకున్నాగానీ… ఇప్పటివరకు స్పందించలేదంటూ వీడియోలో పేర్కొన్నారు అడ్లూరి. ఆ ప్రెస్‌మీట్‌లో పొన్నం పక్కనే మంత్రి వివేక్ ఉన్నా… తన సామాజిక వర్గానికి చెందిన మంత్రిని అభ్యంతరకరంగా మాట్లాడుతున్నా… కనీసం స్పందించక పోవడం ఏంటంటూ వివేక్‌ని కూడా తప్పుపట్టారు. దాంతో పరిస్థితి చేయి దాటిపోతోందని గమనించిన పీసీసీ అధ్యక్షుడు మహేష్‌గౌడ్ రంగంలోకి దిగారు. ఇద్దరితో మాట్లాడి విషయాన్ని సెటిల్ చేసే పనిలో ఉన్నారట ఆయన. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు… బీసీ రిజర్వేషన్ లాంటి సమస్యలన్నీ ఉండగా… మంత్రులు ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ పోతే పార్టీకి నష్టం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది కేడర్‌లో. మాట్లాడేటప్పుడు వెనకా ముందూ చూసుకోకపోతే ఇలాంటి తలనొప్పులు తప్పవంటున్నారు పరిశీలకులు. కానీ…. కొద్ది మంది మంత్రులు నోటిని అదుపులో పెట్టుకోవడం లేదని.. దాంతో వాళ్ళతో పాటు పార్టీ కూడా చిక్కుల్లో పడాల్సి వస్తోందని అంటున్నారు కొందరు సీనియర్ నేతలు. ప్రభుత్వం మీద వచ్చే ఆరోపణలు… ప్రతిపక్షాల నుంచి వచ్చే విమర్శలకు కౌంటర్లు ఇవ్వడానికి ముందుకు రాని మంత్రులు ఇలాంటి రచ్చ విషయంలో మాత్రం దూకుడుగా ఉంటున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్‌ని నిశితంగా పరిశీలిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఇలా వివాదాల్లోకి వెళ్లడం పట్ల ఆయన కూడా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ అనే పేరుతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వ్యవహరించి తలనొప్పులు తెచ్చుకుంటున్నారన్న అభిప్రాయం మాత్రం బలపడుతోంది కాంగ్రెస్ వర్గాల్లో.