వివాదాలకు కేరాఫ్ అని పేరుబడ్డ ఆ తెలంగాణ మంత్రిలో రియలైజేషన్ మొదలైందా? లేక తన పరిధులేంటో తెలిసి వచ్చిందా? గతంలో కయ్యానికి కాలు దువ్విన మినిస్టర్… తాజాగా నేను నా మంత్రిత్వ శాఖ అని మాత్రమే మాట్లాడటానికి కారణం ఏంటి? జ్ఞానోదయం అయిందా? లేక కొత్త ఏడాదిలో వివాదాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారా? ఎవరా మంత్రి? ఏంటా కథ? ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించే మంత్రి కొండా సురేఖ తీరు ఎక్కువగా వివాదాస్పదం అవుతూ ఉంటుంది. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గం నాయకులతోపాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు చాలా మందితో కొండా దంపతులకు పొసగడం లేదు. ఈ క్రమంలో గతంలో మేడారం జాతర అభివృద్ధి పనులు మొదలైనప్పుడు జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో విభేదాలు తలెత్తాయి. జిల్లాలో ఆయన పెత్తనం ఎక్కువైందని తప్పుపట్టారు. అలాగే…తన దేవాదాయ శాఖ పరిధిలో ఉండే మేడారం జాతర అభివృద్ధి పనుల కేటాయింపు విషయంలో పొంగులేటి ఏకపక్షంగా వ్యవహరించారంటూ అప్పట్లో సీఎం దృష్టికి కూడా తీసుకువెళ్ళారు సురేఖ.
ఇక అదే సమయంలో సినీ నటుడు నాగార్జునతో తలెత్తిన కోర్ట్ వివాదం, తన ఓఎస్‌డీ సుమంత్ వివాదాస్పద ఎపిసోడ్ లాంటి వ్యవహారాలతో ఆమె ఇరుకున పడ్డారన్న చర్చలు నడిచాయి. ఇక మేడారం పనులన్నీ పొంగులేటి ఆధ్వర్యంలోనే చేసేందుకు ముఖ్యమంత్రి నిర్ణయించడం, ఆ పనులకు మరో మంత్రి సీతక్క సహకరించడంతో కొంత కాలంగా సైలెంట్ మోడ్‌లోకి వెళ్ళారు కొండా. తనని వివాదాల్లోకి లాగొద్దని చెబుతుండటంతో… ఎట్టకేలకు మేడమ్‌కు జ్ఞానోదయం అయినట్టుందని మాట్లాడుకుంటున్నాయి ఓరుగల్లు రాజకీయవర్గాలు. తాజాగా మీడియా చిట్ చాట్‌లో కూడా నేను నా శాఖలకే పరిమితమవుతున్నాను. వేరే వ్యవహారాల జోలికి వెళ్ళడం లేదని చెప్పిన తీరు ఆమెలో మార్పును సూచిస్తోందని అంటున్నారు.
ఈసారి మేడారం జాత పనులన్నిటినీ మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చూస్తున్నారని, తాను తన శాఖల పనుల వరకే పరిమితం అవుతున్నానంటూ క్లియర్‌గా చెప్పారామె. బాసర, భద్రాచలం, వేములవాడ ఫైళ్లతోపాటు వైటీడీ బోర్డు ఫైల్ సైతం సీఎం దగ్గరే పెండింగ్‌లో ఉందని, త్వరలోనే ఆయన నిర్ణయం తీసుకోబోతున్నట్టు చెప్పారు సురేఖ. ఇటీవల హనుమకొండ కలెక్టరేట్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కార్యక్రమాలపై నిర్వహించిన సమీక్షా సమావేశానికి కూడా కొండా సురేఖ హాజరు కాలేదు. ఆ అజెండాలోని భద్రకాళి ఆలయానికి సంబంధించిన అంశం మాత్రమే తన శాఖ పరిధిలో ఉందని, అది కూడా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఆ మీటింగ్‌కు దూరంగా ఉన్నట్టు చెప్పుకున్నారు. నిజానికి మేడారం మహా జాతర పనులన్నీ దేవాదాయ శాఖ పరిధిలో జరగాల్సినవి. దాంతో పాటు పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, అన్నిటి సమన్వయం అవసరం. కానీ… ఈసారి దేవాదాయ శాఖకు సంబంధించిన పనులు కొద్ది మాత్రమే జరుగుతున్నాయి. గుడి విస్తరణ పనుల్ని కూడా ఆర్ అండ్ బి పరిధిలోకి తీసుకురావడంతో ఎండోమెంట్ జోక్యం లేకుండా పోయింది. ఇక మహా జాతర టైం దగ్గర పడుతున్న క్రమంలో.. రోడ్ల విస్తరణ, త్రాగునీరు, గుడి అభివృద్ధి పనులకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చారు. ఈ పనులన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. దీంతో ఈ పనుల్ని ఎక్కడా వ్యతిరేకించకుండా.. తన ప్రమేయం ఉన్న వ్యవహారాలకు సంబంధించిన సమీక్షా సమావేశానికి హాజరవుతున్నారామె. ఈ నెల 18న గుడి ప్రారంభోత్సవ కార్యక్రమానికి కావలసిన ఏర్పాట్లుజరుగుతున్న క్రమంలో కొండ సురేఖ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.