ఆ టీడీపీ ఎమ్మెల్యే అన్నిటికీ తెగించేశారా? అల్రెడీ డమ్మీని చేసి కూర్చోబెట్టారు…. ఇప్పుడు మాట్లాడితే ఇంత మించి పోయేదేముందని భావించే నోటికి పని చెబుతున్నారా? డైరెక్ట్‌గా సొంత పార్టీ ఎంపీనే టార్గెట్ చేయడానికి కారణాలేంటి? ఎవరా ఇద్దరు నేతలు? వాళ్ళిద్దరి మధ్య గిల్లికజ్జాలు ఎంత దూరం వెళ్తున్నాయి? కొలికపూడి శ్రీనివాసరావు… ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టిడిపి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచారాయన. కానీ… గెలిచినప్పటి నుంచి అధిష్టానానికి కంట్లో నలుసులా మారారరన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే ఉంది. శ్రీనివాసరావు స్థానికుడు కాకున్నా… ఎన్నికలకు నెలన్నర ముందు ఆయనకు టికెట్ కన్ఫామ్ చేసి బి ఫామ్ ఇచ్చారు చంద్రబాబు. ఇక కూటమి గాలిలో కొలికపూడి…. ఈ నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేనంత భారీ మెజార్టీతో గెలిచేశారు. ఇక తొలి నుంచి సమస్యల పరిష్కారం మొదలు పార్టీ వ్యవహారాల వరకు అన్నిట్లో దుందుడుకుగా వ్యవహరిస్తూ తలనొప్పిగా మారారన్నది టీడీపీ వర్గాల విస్తృతాభిప్రాయం. ఈ క్రమంలో రెండు సార్లు పార్టీ క్రమశిక్షణ కమిటీ పిలిపించి అక్షింతలు వేసినా… ఎమ్మెల్యే కొలికపూడి తీరు మాత్రం మారలేదు. విజయవాడ ఎంపీ కేశినేని చిన్నికి, కొలికపూడికి మధ్య గ్యాప్ రావటమే దీనికి కారణమని తేల్చిన అధిష్టానం… ఎమ్మెల్యే మీద సీరియస్ అయింది కూడా. చివరికి సీఎం చంద్రబాబు కూడా పిలిచి క్లాస్ తీసుకోవడంతో… కొన్నాళ్ళ నుంచి సైలెంట్‌గానే ఉంటున్నారాయన. కానీ…తాజాగా మరోసారి ఎంపీని లక్ష్యంగా చేసుకుని మాట్లాడ్డంతో… కొలికపూడి ఇక తెగించేశారా అన్న చర్చలు జరుగుతున్నాయి రాజకీయవర్గాల్లో. కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ… వివాదాల తర్వాత అక్కడి బాధ్యతలన్నిటినీ ఎంపీ కేశినేని చిన్నికే అప్పగించిందట అధిష్టానం. మొదట్లో ఆయన పార్టీ అధిష్టానానికి సవాలు విసిరిన విషయాన్ని మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నారు పార్టీ పెద్దలు. నాయకుడు రమేష్ రెడ్డిపై ఒక్క రోజులో చర్యలు తీసుకోకపోతే తాను రాజీనామా చేస్తానంటూ డెడ్‌లైన్ పెట్టిమరీ….సవాల్ విసరడం అధిష్టానం ఆగ్రహానికి కారణమైంది. దీంతో పాటు పార్టీకి కులాల మురికి అంటించడంతో ఆ వ్యవహారం చంద్రబాబు వరకు వెళ్ళింది.
దీంతో అప్పటి నుంచి తిరువూరు నియోజకవర్గ బాధ్యతల్ని ఎంపీ కేశినేని చిన్ని చక్కబెడుతున్నారు. ఆ తర్వాతి నుంచి ఎమ్మెల్యే నామమాత్రంగా మిగిలిపోయారన్నది లోకల్ టాక్. ఎంపీ, ఎమ్మెల్యే కలిసి పని చేస్తారని ఒక దశలో ప్రచారం జరిగినా… అది మాత్రం సాధ్యపడలేదు. అయితే ఇటీవల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఎంపీ చిన్ని పాల్గొనగా ఎమ్మెల్యే మాత్రం దూరంగా ఉన్నారు. దీంతో మరోసారి ఇద్దరి మధ్య ఉన్న గ్యాప్ బయటపడింది. ఈ పరిస్థితుల్లో… కొలికపూడి శ్రీనివాసరావు తాజాగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధానంగా విజయవాడ ఎంపీ కేశినేని చిన్నిని టార్గెట్ చేసి మాట్లాడారు ఎమ్మెల్యే. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ పదవులను ఎంపీ కార్యాలయంలో కూర్చొని నిర్ణయిస్తున్నారని, వాటిని కొందరు అమ్ముకుంటున్నారని ఆరోపించారు కొలికపూడి. ఎంపీ ఆఫీస్‌లో ఉన్న కిషోర్ అనే వ్యక్తి తిరువూరు నియోజకవర్గంలో ఇసుక మాఫియా, రేషన్ మాఫియా నడుపుతున్నాడన్న ఆరోపణలు పరోక్షంగా ఎంపీ చిన్నిని ఉద్దేశించేనన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. ఇదే సమయంలో నామినేటెడ్ పదవుల్ని కూడా అమ్ముకుంటున్నారని ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. కొలికపూడి వ్యాఖ్యలకు ఇక సొంత పార్టీ నుంచే కౌంటర్స్ మొదలయ్యాయి. తిరువూరు నియోజకవర్గ టిడిపి నేతలు ప్రెస్ మీట్ పెట్టి మరీ…. ఎమ్మెల్యే ప్రతిపనికి డబ్బులు వసూలు చేశారంటూ ధ్వజమెత్తారు. దీంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరుగినట్టయింది. ఈ నెల 24న అధిష్టానాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నట్టు వీడియోలో చెప్పారు కొలికపూడి. దీంతో ఆయన ఇక తెగించేశారా అన్న డౌట్స్ వస్తున్నాయి రాజకీయవర్గాల్లో. అందుకే ఎంపీ చిన్నిని టార్గెట్ చేసి ఉండవచ్చంటున్నారు. ఈ నెల 24న కొలిక పూడి అధిష్టానానికి ఫిర్యాదు చేస్తారా లేక ఎమ్మెల్యే వ్యాఖ్యలపై అధిష్టానమే రెస్పాండ్ అవుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.