Off The Record: అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుగా ఉందట అక్కడ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. రాష్ట్రంలో ఉన్న అధికారాన్ని ఉపయోగించుకుని బలపడాల్సిన చోట తన్నుకుని తలకలు పోసుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే… అసలే బలహీనంగా ఉన్నచోట ఇంకా బలహీనపడుతున్నారు. పార్టీ పరువు బజారుకీడుస్తున్న ఆ నాయకులు ఎవరు? ఏయే నియోజకవర్గాల్లో ఉందా పరిస్థితి?
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయి ఎమ్మెల్యే సీట్లు దక్కాయి కాంగ్రెస్ పార్టీకి. మొత్తం పదమూడుకు గాను గతంలో ఎన్నడూ లేని విధంగా 2023 ఎన్నికల్లో 8 సీట్లు హస్తగతం అయ్యాయి. మిగతా ఐదు చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది… ఆ సీట్లలో పార్టీని బలోపేతం చేయాల్సిన నేతలు… వీధి పోరాటాలకు దిగడం చర్చనీయాంశం అయింది. ముఖ్యంగా… కరీంనగర్, సిరిసిల్ల నియోజకవర్గాల్లో సమావేశాలు రసాభాసగా ముగిశాయి. కాంగ్రెస్ నేతలు వర్గాలుగా చీలిపోయి దాడులు చేసుకునే స్థాయికి వెళ్లడం హాట్ టాపిక్‌గా మారింది. అధికారంలో ఉండి కూడా ఈ ఖర్మేంటని తలలు పట్టుకుంటున్నారట పార్టీ పెద్దలు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఏఐసీసీ పరిశీలకుల సమక్షంలో ఓ మీటింగ్ జరిగింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన పురుమల్ల శ్రీనివాస్ ఆ మీటింగ్‌లో మాట్లాడుతూ సీనియర్ నేతలను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు… దీంతో అవతలి పక్షం నేతలు ఒక్కసారిగా ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Pregnancy Tips: పిల్లలు పుట్టడంలో సమస్యలా..? కారణాలు ఇవే కావచ్చు!
అయితే, ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారంటూ పురుమల్లను నిలదీశారు. దీంతో మాటా మాటా పెరిగి చొక్కాలు పట్టుకుని తోసుకునే వరకు వెళ్లింది వ్యవహారం. అసలు ఆయన్ని నియోజకవర్గం ఇంచార్జీగా తొలగించాలని… పార్టీ అధికారంలో లేకపోయినా కష్టపడి పనిచేసిన పాత కాంగ్రెస్ కార్యకర్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు మిన్నంటాయి. పార్టీ క్రమశిక్షణను పదేపదే ఉల్లంఘిస్తున్న పురుమల్ల తీరును ఎఐసీసీ పరిశీలకుడు విశ్వనాథన్‌కు వివరించారు స్థానిక పాత నేతలు. దీంతో సమావేశంలో గందరగోళం ఏర్పడింది.. ఇంతకాలం లోలోపల దాగి ఉన్న విభేదాలు ఈ గొడవతో ఒక్కసారిగా బయట పడ్డట్టయిందంటున్నారు పరిశీలకులు. ఉన్న నలుగురు నాయకులు.. ఎవరికి వారే సొంతంగా ఆఫీసులు ఓపెన్ చేసుకోవడం ఏంటని సీనియర్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో జరిగిన గొడవకు కారణాలు వేరే ఉన్నాయనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. పురుమల్ల శ్రీనివాస్ ఓ మంత్రిని టార్గెట్ చేస్తూ పదే పదే కామెంట్లు చేయడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా ఓ గ్రూపు తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారట. దీంతో నిన్నగాక మొన్న పార్టీలోకి వచ్చిన వ్యక్తి గ్రూపులు కట్టడం ఏంటంటూ.. పార్టీలోని సీనియర్స్ మండిపడుతున్నట్టు సమాచారం.
ఇక, అలా లోలోపల రాజుకున్న అసమ్మతి ఆ మీటింగ్‌లో బయట పడిందనే చర్చ జరుగుతోంది హస్తం పార్టీ సర్కిల్స్‌లో. ఇక మరుసటి రోజు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన సమావేశంలోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది…. పీసీసీ అధికార ప్రతినిధి చీటి ఉమేష్ రావు వేదికపై ప్రసంగిస్తుండగా కొందరు కార్యకర్తలు అడ్డుపడ్డారు. దీంతో ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడింది.. పార్టీలో సీనియర్ నేతలు చాలా మంది ఉన్నప్పటికీ వరుసగా ఓడిపోతున్న వారికే టికెట్లు ఇస్తున్నారని నియోజకవర్గ ఇంచార్జీ కేకే మహేందర్‌రెడ్డిని ఉద్దేశించి ఉమేష్ రావు చేసిన వ్యాఖ్యలతో హీట్ పెరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వారించే ప్రయత్నం చేసినా కార్యకర్తలు గొడవను కంటిన్యూ చేసారు… ఇంతకాలం పార్టీని పట్టించుకోకుండా ఉన్న వ్యక్తి ఇప్పుడు వచ్చి వేదికలెక్కి ఫోజు కొడుతున్నారని ఉమేష్ రావుపై విరుచుకు పడ్డారు. వేదిక మీదకు వెళ్లి గొడవ చేసి ఒకర్ని ఒకరు నెట్టుకున్నారు. ఈ పరిణామాలను గమనించిన కార్యకర్తలు కొందరు అసలే అంతంత మాత్రంగా బలం ఉన్న పార్టీలో ఇదేం లొల్లి అని గుస్సా అవుతున్నారట. కరీంనగర్ సిరిసిల్ల రెండు సీట్లలో కాంగ్రెస్ పార్టీ గత రెండు దశాబ్దాలుగా అత్యంత బలహీనంగా ఉంది.
Read Also: DGP Jitender Reddy: హైదారాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన డీజీపీ
కాగా, 2004 తర్వాత కరీంనగర్ సీట్లో కాంగ్రెస్‌కు రెండవ స్థానం కూడా దక్కలేదు. స్టేట్‌లో ఉన్న పవర్‌ను ఉపయోగించి అలాంటి చోట పార్టీని బలపరుచుకోవాల్సింది పోయి.. ఇలా గ్రూప్ వార్‌తో మరింత అథోగతి పాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ సీనియర్లు.. ఇక సిరిసిల్లలో అయితే 1999 తర్వాత పార్టీకి ప్రాతినిధ్యమే దక్కలేదు. అవతల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంటి స్ట్రాంగ్ లీడర్ ఉన్నప్పుడు అందరూ కలిసి కట్టుగా ఉంటేనే ఎదుర్కోవడం కష్టం. అలాంటిది ఇలా తన్నుకుంటే గత అనుభవాలే పునరావృతం అవుతాయి అంటున్నారు సీనియర్లు.. చూడాలి.. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి స్ట్రాంగ్ చేస్తామని తీర్మానాలు చేసుకుంటున్న హస్తం పార్టీ పెద్దలు ఈ గొడవలపై ఎలా రెస్పాండ్ అవుతారో..