OTR : పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఆ ఎమ్మెల్యే పరిస్థితి?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఎమ్మెల్యే పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టు మారిందా? అధికారులు పట్టించుకోవడం లేదు, అవతలోళ్ళు విలువ ఇవ్వడం లేదంటూ…పైకి చెప్పుకోలేక లోలోపల కుమిలిపోతున్న ఆయనకు ఇప్పుడు మరో కొత్త సమస్య వచ్చి పడిందా? కొత్త ప్రాబ్లమ్ ఏకంగా తన ఓట్ బ్యాంక్‌కే గండి కొట్టబోతోందా? నాకే… దిక్కు లేదు, ఇక సమస్యల్ని నేనేం తీరుస్తానన్నట్టు తల పట్టుకుంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? అధికారంలో ఉండి కూడా ఎందుకా పరిస్థితి వచ్చింది? తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులుకు కొత్త తలనొప్పి మొదలైంది. ఆ దెబ్బకు ఆయన పరిస్థితి కక్కలేక, మింగలేక అన్నట్టుగా మారిందట. తాను అధికార కూటమి ఎమ్మెల్యేని అయినా…. ప్రాధాన్యం దక్కడం లేదని, మిత్రపక్షం టీడీపీ విలువ ఇవ్వడం లేదని ఇప్పటికే అల్లాడిపోతున్నారాయన. ఇదే సమయంలో మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు లోకల్ ట్రావెల్స్ రంగం నుంచి పెద్ద సమస్యే ఎదురైంది. దాన్ని పరిష్కరించలేక, అలాగని వదిలేస్తే జరిగే నష్టాన్ని ఊహించుకోలేక సతమతం అవుతున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో కూటమి భాగస్వామిగా జనసేన తరపున గెలిచాకు ఆరణి. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కూడా తన నియోజకవర్గం పరిధిలోనే ఉన్నా.. స్థానిక ఎమ్మెల్యేగా బోర్డులో చోటు దక్కలేదన్న బాధ ఆయనకు ఉంది.
భారీ మెజార్టీతో గెలిచాక లోకల్ ఎమ్మెల్యేగా టీటీడీలో తిరుగులేని హవా నడుస్తుందని అంతా అనుకున్నారు. కానీ…. వాస్తవంలో సీన్ రివర్స్ కావడం స్థానిక జనసేన క్యాడర్‌కు కూడా మింగుడు పడ్డం లేదట. సరే… ఏం చేస్తాం….. అనుకున్నవన్నీ జరిగిపోవు కదా….! ఆ ఏడు కొండలవాడి దయ మన మీద లేదని ఎమ్మెల్యే సర్దిచెప్పుకుంటుండగానే… ఇప్పుడో కొత్త సమస్య ఉరుములేని పిడుగులా వచ్చి పడిందట. ఆదీ కూడా… టీటీడీతో లింక్ అయి ఉండటం, దేవస్థానంలో తన మాట చెల్లుబాటవకపోవడంతో ఏం చేయాలో అర్ధంగాక తల పట్టుకుంటున్నారట ఆరణి శ్రీనివాసులు. తిరుపతి నుంచి కొండ మీదికి వెళ్ళే వాహనాలపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పెడుతున్న ఆంక్షల సెగ ఎమ్మెల్యేకి గట్టిగానే తగులుతోందని అంటున్నారు. తిరుపతిలో స్థానికులకు హోటల్ తర్వాత అతిపెద్ద ఉపాధి రంగం ట్రావెల్స్. 12 నుంచి 15 వేల వరకు కార్లు, జీపులు, మినీ బస్సులు నిత్యం భక్తుల్ని తిరుమల, తిరుపతి మధ్య తిప్పుతుంటాయి. శ్రీవారి దర్శనానికి వెళ్ళే భక్తుల్లో దాదాపు సగం ఈ ప్రైవేట్ వాహనాలనే ఆశ్రయిస్తుంటారు. అయితే… ఇటీవలి కాలంలో టీటీడీ విజిలెన్స్ సిబ్బంది ‘నాట్ అలౌడ్’ పేరుతో వేలాది వాహనాలను అలిపిరి చెక్‌పోస్ట్ దగ్గరే అడ్డుకుంటున్నారు. కొండ మీద నో పార్కింగ్ అనో, వాహనానికి పొల్యూషన్ సర్టిఫికెట్ లేదనో… ఏదో ఒక కారణం చెప్పి మమ్మల్ని అడ్డుకుంటున్నారంటూ లోకల్ క్యాబ్ డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు. మా బతుకుదెరువు దెబ్బతింటోంది, టీటీడీ అధికారులతో మాట్లాడి ఏదో ఒకటి చేయమంటూ వారంతా లోకల్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దగ్గరికి క్యూ కట్టారట.
Also Read
ఒకటికి పది సార్లు తిరిగినా ఫలితం లేదంటూ… ఇప్పుడు వాళ్ళంతా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా బహిరంగ విమర్శలు మొదలుపెట్టారు. దాదాపు 40 వేలకు పైగా ఓటర్లు ఉన్న ఈ ట్రావెల్స్ రంగం నుంచి మొదలైన వ్యతిరేకత ఆరణిని కంగారు పెడుతున్నట్టు తెలుస్తోంది. అలాగని ఏదైనా చేద్దామంటే… టీటీడీలో ఎవ్వరూ నా మాట వినే పరిస్థితి లేదని ఆయన సన్నిహితులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. పైగా… కొందరు స్థానిక జనసేన నాయకులే… ఈ యూనియన్స్ లీడర్లుగా ఉన్నా… సమస్యను కనీసం అధికారుల దృష్టికి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయ్యారంటూ మండిపడుతున్నారు డ్రైవర్లు. అక్కడితో ఆగకుండా గతంలో… వైసీపీ హయాంలో ఇలాంటి పరిస్థితి లేదంటూ… పోలిక పెట్టి మాట్లాడ్డం ఎమ్మెల్యే వర్గానికి అస్సలు మింగుడు పడ్డం లేదట. తప్పు జరిగితే వదిలిపెట్టాల్సిన అవసరం లేదుగానీ…టీటీడీ విజిలెన్స్ అధికారులు అనవసరంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారన్నది క్యాబ్ డ్రైవర్ల ఆవేదన. ఈ ఆవేదననే జనసేన నేతల దగ్గర ప్రస్తావిస్తే… మాకే దిక్కు లేదు, ఇక మీ సంగతి ఏం చూస్తామని అంటున్నట్టు తెలిసింది. గెలిచి రెండేళ్ళయినా…. కనీసం తిరుమలలో ప్రోటోకాల్ విషయంలో గానీ, టీటీడీ ప్రోగ్రామ్స్‌లో గానీ స్థానిక ఎమ్మెల్యేగా తనకు ఏ మాత్రం గౌరవం దక్కడం లేదని ఫ్రస్ట్రేట్ అవుతున్నారు ఆరణి. ఆయన అనుచరులు ఇదే విషయాన్ని డ్రైవర్ల దగ్గర ప్రస్తావిస్తూ…. టీటీడీ మాకే… ‘నాట్ అలౌడ్’ బోర్డు పెట్టింది.
ఇప్పుడు మీ నాట్ అలౌడ్ బోర్డుల్ని మేం ఎలా తొలగించగలుగుతామని రివర్స్‌లో ప్రశ్నిస్తున్నారట. ఎమ్మెల్యేకే దిక్కులేనప్పుడు ఇక ఆయన మాట, మీ మాట ఎవరు వింటారని అనడంతో… క్యాబ్ డ్రైవర్లు అయోమయంలో పడ్డట్టు సమాచారం. సరిగ్గా ఇక్కడే వైసీపీ పావులు కదపడం మొదలుపెట్టింది. క్యాబ్ డ్రైవర్స్ తరపున రోడ్డెక్కుతానని భూమన అభినయ్ రెడ్డి భరోసా ఇవ్వంతో ఇది ఎటుపోయి ఎటు వస్తుందోనన్న ఆందోళన కూటమిలో పెరిగిపోతోందని అంటున్నారు. సమస్య ఇలాగే కొనసాగితే… రేపు మున్సిపల్ ఎన్నికల్లో అధికార పక్షానికి చుక్కలు కనబడటం ఖాయమన్న హెచ్చరికలు పెరుగుతున్నాయి. తిరుపతి సిటీ పరిధిలో ప్రత్యక్షంగా 40 వేల మంది దాకా, పరోక్షంగా చాలా మందే ఈ ట్రావెల్స్ బిజినెస్ మీద ఆధారపడి బతుకుతున్నారు. వారి జీవనోపాధికి సంబంధించిన ఇంత కీలకమైన సమస్యని వెంటనే పరిష్కరించకుంటే రేపు మున్సిపల్ ఎలక్షన్స్‌లో గట్టి దెబ్బ పడటం ఖాయమని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో అటు అధికారులు పట్టించుకోక, ఇటు సొంత క్యాడర్‌కు సమాధానం చెప్పలేక తిరుపతి జనసేన లీడర్లు తీవ్ర ఇబ్బంది పడుతున్నారట. ఈ కొత్త సమస్య నుంచి ఎమ్మెల్యే ఎలా గట్టెక్కుతారో.. టిటిడి అధికారులను ఎలా లైన్లో పెడతారో వేచి చూడాలంటున్నారు స్థానికులు.
తాజావార్తలు
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!