సిట్టింగ్ ఎమ్మెల్యేకి, మాజీ మంత్రికి మధ్య పంచాయితీని కాంగ్రెస్ అధిష్టానం తేల్చలేకపోతోందా? ఎంత నానిస్తే అంత బాగా తెగుతుందనుకుంటూ… మొదటికే మోసం తెచ్చుకుంటోందా? వాళ్ళిద్దరి మధ్య లొల్లిలో మంత్రులు సైతం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారా? ఎవరా ఇద్దరు? వాళ్ళిద్దరి వివాదం ఎందుకు కొలిక్కి రావడం లేదు? కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కాస్త స్వేచ్ఛ ఎక్కువే….. కాస్త అనేకంటే….. మరి కాస్త అనుకోవడమే కరెక్ట్. అదే పార్టీకి బలహీనతగా మారుతున్నా… సరిదిద్దలేని పరిస్థితి. రాజకీయ పార్టీలన్నాక ఎక్కడైనా నాయకుల మధ్య విభేదాలు సహజమే. కానీ.. పెద్దలు జోక్యం చేసుకుని వాటిని సరిదిద్దుతుంటారు. కొన్ని సందర్భాల్లో భయంతోనో, భక్తితోనో నాయకులు కాంప్రమైజ్ అవుతుంటారు. కానీ… కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఈ రెండూ లేకపోవడం వల్లే సమస్యలు పెరుగుతుంటాయన్నది విస్తృతాభిప్రాయం. జగిత్యాల గొడవలే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ అంటున్నాయి పార్టీ వర్గాలు.
ఇక్కడ సీనియర్ లీడర్, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి, బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ మారిన ఎమ్మెల్యే సంజయ్‌కి మధ్య ఆధిపత్య పోరు ఓ రేంజ్‌లో నడుస్తోంది. సందర్భం వచ్చిన ప్రతిసారి తగ్గేదేలే అంటున్నారు ఇద్దరూ. ఆ రచ్చ అలా కొనసాగుతూనే ఉంది. ఇలాంటి వాతావరణంలో తాజాగా రాష్ట్ర మంత్రి ఒకరు కూడా ఇద్దరి మధ్య ఇరుక్కుని విలవిల్లాడారట. పెద్దాయనేమో మంత్రికి రాజకీయ గురువు లాంటి వాడు. ఇటు చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే. దీంతో ఎవరికీ ఏం చెప్పలేక మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మౌనంగా ఉండాల్సి వచ్చిందట. ఎమ్మెల్యేకి, మాజీ మంత్రికి మధ్య రెండేళ్లుగా ఇదే తతంగం నడుస్తోంది. కానీ… పట్టించుకోవాల్సిన పిసిసి చీఫ్ మహేష్ గౌడ్.. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాత్రం మాకు సంబంధం లేదన్నట్టు ఉన్నారు. జరిగేదేదో జరగనివ్వండని వాళ్ళు వదిలేసిలినట్టు కనిపిస్తోందంటున్నాయి పార్టీ వర్గాలు. తాజాగా.. సీఎం రేవంత్‌ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేశారు జీవన్‌రెడ్డి. సామెతల్ని జోడించి పార్టీ మీద సెటైర్స్ వేశారాయన. తన సమక్షంలోనే ఆయన అలా మాట్లాడ్డంతో….ఏం చేయాలో పాలుపోక అడకత్తెరలో పోక చెక్కలా మారిందట మంత్రి అడ్లూరి పరిస్థితి. జీవన్‌రెడ్డిని రాజకీయ గురువుగా భావిస్తారు అడ్లూరి.
దాంతో ఆయన ఆవేదనను కాదనలేక, ఇటు సీఎం మీద సెటైర్స్ వేస్తుంటే కామ్‌గా ఉండలేక… సతమతం ఇయ్యారట మినిస్టర్. అలాగని త్వరగా ఏదో ఒకటి తేల్చేయమని పార్టీ అధిష్టానానికి గట్టిగా చెప్పలేని స్థితి. దాంతో మంత్రి తీవ్ర వత్తిడిలో ఉన్నట్టు సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కి సమస్య అంతా తెలుసు. ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సమస్యను పరిష్కరించడంకంటే…. నాన్చడమే బెటరని భావిస్తున్నారన్న డౌట్స్ ఉన్నాయి. జగిత్యాల ఎపిసోడ్‌లో పార్టీ పెద్దలు కాస్త చొరవ తీసుకుని ఎవరో ఒకరికి క్లారిటీగా చెప్పి ఉంటే సమస్య ఇంత పెద్దది అయ్యేది కాదు. కానీ.. ఎవరికీ ఏమీ చెప్పకుండా ఇలా నానుస్తూ పోతే.. పార్టీకి నష్టం తప్ప పైసా ప్రయోజనం ఉండబోదన్న సంగతిని రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఎందుకు గమనించలేకపోతున్నారో అర్ధం కావడం లేదన్నది లోకల్ కేడర్ మనసులో మాట. అధికారంలో ఉన్నాం కదా….. ఇప్పటికిప్పుడు వచ్చిన నష్టం లేదు. తర్వాత ఎప్పుడో చూద్దాంలే అని అనుకుంటే మాత్రం తలకు మించిన భారం అవుతుందన్నది కేడర్ వాయిస్.