కాంగ్రెస్ పార్టీలో పోట్ల గిత్తల్ని ఆపేవాళ్ళు లేరా? ఎవరికి వారు కట్లు తెంచుకున్నట్టు నోటికి పని చెబుతూ చెలరేగిపోవడమేనా? చివరికి మంత్రులు సైతం కట్టు తప్పుతున్నా… కంట్రోల్ చేసే దిక్కు లేకుండా పోయిందా? చివరికి మంత్రులతో సహా… మొత్తం ప్రభుత్వమే పలుచన అవుతున్నా… పెద్దలు ఎవ్వరూ ఎందుకు రియాక్ట్ అవడంలేదు? అధికార పార్టీలో అసలేం జరుగుతోంది?
తెలంగాణలో మంత్రుల వ్యవహారం రోజురోజుకు శృతిమించుతున్నట్టు కనబడుతోంది. ఎవరికి వారు అసలు పని వదిలేసి.. ఇష్టా రాజ్యాంగా మాట్లాడేస్తున్నారన్న చర్చ జరుగుతోంది కాంగ్రెస్ వర్గాల్లో. ఒకరి తర్వాత ఒకరు ఏదో ఒక వివాదాన్ని నెత్తికెత్తుకుని ఇరుకున పెడుతున్నారని, తమను ఎవరు ఏం చేస్తారన్న ధీమానా? లేక ఇది కాంగ్రెస్ కల్చర్ అనుకుంటున్నారా అంటూ హాటు ఘాటు చర్చలు నడుస్తున్నాయి. వాళ్ళ ఉద్దేశ్యం ఏదైనా… ఈ కీచులాటల కారణంగా… ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తల్లో కూడా మంత్రులంటే చులకన భావం ఏర్పడుతోందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజ్ వచ్చిన మొదటి రోజే క్రమశిక్షణ గురించి మాట్లాడారు. నాకు అదే ముఖ్యం.. గీత దాటితే వేటు తప్పదంటూ భారీ డైలాగ్సే కొట్టారు. కానీ…. ఎవరు ఎంతలా చెలరేగినా… ఇప్పటివరకు ఎవర్నీ… కనీసం మందలించిన పాపానా కూడా పోలేదు.
కఠినంగా ఉండాల్సిన పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా… ఇది మా కుటుంబ సమస్య అనేస్తున్నారు తప్ప… తప్పు చేస్తున్న కుటుంబ సభ్యుల్ని సరిదిద్దే ప్రయత్నం మాత్రం చేయడం లేదన్న అభిప్రాయం బలపడుతోంది. నిజంగానే అది కాంగ్రెస్ కుటుంబ పంచాయతీ ఐతే… గాంధీభవన్ నాలుగు గోడల మధ్య మాట్లాడుకుంటే సరిపోతుంది. కానీ… ఇలా రోడ్డెక్కి మాట్లాడుకోవడం ఎందుకు? అందునా… డైరెక్ట్‌గా మంత్రులే అలా వ్యవహరించడం ఏ రకంగా కుటుంబ సమస్య అని కార్యకర్తలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. పార్టీని ముంచేలా, ప్రభుత్వాన్ని ఇరకాటంలోకి నెట్టేలా… వ్యవహరిస్తున్న మంత్రుల విషయంలో ఎందుకు జాలి చూపిస్తున్నారన్నది ఎక్కువ మంది ప్రశ్న. అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా…. అందరి లొల్లి చూస్తున్నారేగానీ… బ్రేకులు వేయడం లేదు. అంటే.. ఆయన బ్రేక్స్ వేయలేక పోతున్నారా..? లేక అదను కోసం ఎదురు చూస్తున్నారా..? అన్న చర్చలు కూడా నడుస్తున్నాయి పార్టీ సర్కిల్స్‌లో. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ల పంచాయతీ ముదిరి చివరికి… బీసీ వర్సెస్ మాదిగగా మారిపోయింది. రెండు రోజుల్లో దీనికి తెర పడింది అనుకుంటుండగానే.. మరో మంత్రి వివేక్.. మళ్ళీ ఆ తుట్టెను కదిపి… మాల, మాదిగ కులాల పంచాయతీకి ఆజ్యం పోశారు. నేను మాలను కాబట్టే అలా వివాదాల్లోకి లాగారంటూ అడ్లూరిని ఉద్దేశించి కామెంట్స్ చేశారు వివేక్. ఆ విషయాన్ని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అడ్లూరి అనడం కొంత బెటర్ అయ్యింది కానీ… ఆయన కూడా నోటికి పని చెప్పి ఉంటే… అది అంకెంత దూరం వెళ్ళిఉండేదోనని కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ విషాదం ఏంటంటే… ఈ వివాదంలో ఉన్న మంత్రులు ముగ్గురూ సీనియర్సే.
అయినా వీధికెక్కి రచ్చ చేసుకున్నారు.
ఇక వరంగల్ లొల్లి అయితే… వేరే లెవల్. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటిని టార్గెట్ చేస్తూ.. ఎఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకి ఫిర్యాదు చేశారు కొండా దంపతులు. మా శాఖలో పొంగులేటి పెత్తనం ఏంటన్నది వాళ్ళ క్వశ్చన్. ఇక… మా నియోజక వర్గాల్లో… మంత్రికి పనేంటి? అనవసరంగా వేలు పెట్టడం ఏంటని రచ్చ చేశారు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు. ఇది క్రమశిక్షణ కమిటీదాకా వెళ్ళింది. ఆ లొల్లి కంటిన్యూ అవుతూనే ఉంది. ఇక మేడారం జాకత పనుల రివ్యూ విషయంలో కూడా మంత్రుల మధ్య సఖ్యత లేదు. ఇక్కడ కూడా వివాదంలో ఉన్న మంత్రులంతా సీనియర్సే. పదేళ్ళ తర్వాత కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే….దాన్ని పది కాలాల పాటు నిలబెట్టుకోవాల్సిందిపోయి ఇలా.. పార్టీని వివాదాల్లో కి లాగి.. అంతర్గత పంచాయితీలతో ప్రభుత్వాన్ని పలచన చేస్తున్నారన్న ఫీలింగ్ పెరుగుతోంది కేడర్‌లో. ఇలా… వరుస ఎపిసోడ్స్ విషయంలో…ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఏం చేస్తున్నట్టు..? ఆమె గాంధీ కుటుంబానికి దగ్గర, అంతా సెట్ చేస్తారని తెలంగాణాకు పంపితే ఏ మాత్రం ప్రభావం ఎందుకు చూపలేకపోతున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి కేడర్‌లో. మీనాక్షి కూడా అందరు నాయకుల్లాగే… స్టేట్‌మెంట్స్ ఇవ్వడం తప్ప.. కంట్రోల్ చేయలేకపోతున్నారా..? అనే చర్చ కూడా నడుస్తోంది. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇటీవల మంత్రులకు కాస్త గట్టిగానే క్లాస్ ఇచ్చారట. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని చెప్పినట్టు తెలిసింది. కానీ..ఆయన చెప్పిన నాలుగు రోజులు కూడా తిరక్కముందే సీన్ రిపీట్ అవడంతో… కాంగ్రెస్‌లో అంతేగా… అంతేగా అంటూ సెటైర్స్ పడుతున్నాయి.