పల్లెపోరు హస్తం పార్టీలో అగ్గి రాజేసిందా…? మరో మారు వర్గ పోరును బట్టబయలు చేసిందా? పాత, కొత్తగా విడిపోతున్న నేతలు పార్టీకి కొత్త తలనొప్పులు తెస్తున్నారా? లోపం ఎక్కడుందో… సమస్య ఎవరి వల్ల వస్తోందో తెలిసినా… నోరెత్తలేని పరిస్థితులు పార్టీలో ఉన్నాయా? ఏయే నియోజకవర్గాల్లో అలా ఉంది? సమస్య ఎక్కడుంది? తెలంగాణ పల్లెల్లో పంచాయతీ పోరు రసవత్తరంగా మారుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో దాఖలైన, అవుతున్న నామినేషన్లను పరిశీలిస్తే… దాదాపు అన్నిచోట్ల పోటీ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగానే ఉంటోంది తప్ప… అధికార పార్టీ వర్సెస్ ప్రతిపక్షంలా కనిపించడం లేదని స్వయంగా హస్తం నేతలే అంటున్నారు. ఇప్పటిదాకా… రెండు దశల నామినేషన్స్ పూర్తవగా… మూడో విడతలోనూ ఇంతకు భిన్నంగా ఏం ఉండబోదని చెప్పుకుంటున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఒరిజినల్ కాంగ్రెస్, వలస కాంగ్రెస్ లీడర్ల మధ్య గట్టి పోటీ ఉందట. ముఖ్యంగా సీనియర్ లీడర్ల అనుచరులు కూడా రంగంలోకి దిగడంతో బుజ్జగింపులు కత్తిమీద సాములా మారాయన్న మాటలు వినిపిస్తున్నాయి. రేపు మొదటి దశ నామినేషన్స్ ఉపసంహరణకు చివరి తేదీ కావడంతో ఎమ్మెల్యేలు చేస్తున్న బుజ్జగింపు ప్రయత్నాలు ఏ మేరకు ఫలితం ఇస్తాయోనన్న భయాలు పెరుగుతున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో. నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేముల వీరేశం తాను బలపరిచిన అభ్యర్దులను బరిలో దింపి గెలిపించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.
కానీ… ఆ ట్రయల్స్‌కు సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రూపంలో బ్రేక్ పడిందనే టాక్ నడుస్తోంది. నియోజకవర్గంలో మొదటి దశ పోలింగ్ జరిగే మెజారీటీ పంచాయితీలన్నిటిలో దాదాపుగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వర్గీయులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. చిట్యాల, నార్కట్ పల్లి, కట్టంగూరు మండలాల్లో అయితే ఆ సంఖ్య మరీ ఎక్కువగా ఉందట. కీలకమైన, పొలిటికల్‌గా ఉపయోగపడే పంచాయితీలలో మంత్రి అనుచరులు కూడా నామినేషన్ వేయడంతో నకిరేకల్ హస్తం రాజకీయం వేడెక్కుతోంది. ఎవరిని బరిలో ఉంచాలి, ఎవరిని బుజ్జగించాలి, ఇంకెవరిని తప్పించాలి.. తప్పించిన వారికి ఏ పదవి హామీ ఇవ్వాలి అన్న కన్ఫ్యూజన్ పెరిగిపోతోందట ఎమ్మెల్యే వీరేశానికి. కీలక నేతల అండ చూసుకొని కొందరు గ్రామ, మండల స్దాయి నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే అసహనంగా ఉన్నట్టు సమాచారం. మంత్రి సైతం తన మనుషులు బరిలో ఉండాల్సిందేనని పట్టుబడుతుండటం… అందుకు కావాల్సిన వ్యూహాలకు పదును పెడుతుండటంతో నకిరేకల్ కాంగ్రెస్ రాజకీయం రెండు పడవల మీద ప్రయాణంగా మారిందంటున్నారు. ఇక తుంగతుర్తి నియోజవకవర్గంలో కూడా ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గీయులు.. మాజీ మంత్రి, దివంగత నేత దామోదర్ రెడ్డి వర్గీయులు… పోటాపోటీగా నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలో మొత్తం 138 పంచాయతీలు ఉండగా 851 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారంటేనే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.
బరిలో ఉన్నవాళ్ళలో ఎక్కువ మంది మా వాళ్ళే… దీన్ని బట్టి పార్టీలో పంచాయతీ పోరు ఏ స్థాయిలో జరుగుతోందో మీరే అర్ధం చేసుకోండని కాంగ్రెస్ నేతలే అంటున్నారు. కొత్త కాంగ్రెస్, పాత కాంగ్రెస్‌గా విడిపోయిన క్యాడర్.. నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గంలోని 90శాతం గ్రామ పంచాయితీల్లో కాంగ్రెస్ పార్టీ వారే ముగ్గురికి తగ్గకుండా నామినేషన్లు దాఖలు చేయడంతో ఎవరిని ఎవరు బుజ్జగించాలో అర్ధంకాని పరిస్దితి నెలకొందట. ఎమ్మెల్యే వర్గీయులు, దివంగత నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి వర్గీయులుగా విడిపోయారు కిందిస్థాయి నాయకులు. అలాగే…ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వర్గాలుగా కూడా విభజన జరిగిందట. అలా ఎవరికి వారు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎవరిని తప్పించాలి.. ఇంకెవరిని బుజ్జగించాలి.. అసలు ఆ పనిచేయాల్సింది ఎవరో కూడా తేల్చుకోలేక తలపట్టుకుంటున్నారట తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్. వర్గపోరుకు, కుంపట్లకు, కేరాఫ్ గా మారిన పార్టీలోని వాతావరణాన్ని రేపటిలోగా కంట్రోల్‌లోకి తెస్తారా? లేక ముందు మీరు మీరు కొట్టుకోండి. గెలిచి వచ్చిన వారి మెడలో మేం వీరతాడు వేస్తామని పార్టీ పెద్దలు చూస్తూ కూర్చుంటారా అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్. ఇక్కడున్న ఇంకో మహా గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే… ఎవరు గెలిచినా కాంగ్రెస్ అభ్యర్థే కాబట్టి పార్టీకి వచ్చే నష్టం ఏదీ లేదు. కాకుంటే… లోకల్ గ్రిప్ ఎమ్మెల్యేకు ఎక్కువ ఉందా లేక మంత్రికి ఉందా అన్నది మాత్రమే తేలాల్సి ఉంది.