Off The Record: అక్కడ కారు స్టీరింగ్ పట్టుకునే దిక్కు కరవైందా? పవర్‌లో ఉన్నప్పుడు అంతా మేమేనని హవా నడిపిన వాళ్ళు ఇప్పుడు తాళాలు పక్కనపడేసి వెళ్ళిపోయారా? తెలంగాణలోనే అతిపెద్దదైన, అత్యధిక ఓటర్లు ఉన్న ఆ సెగ్మెంట్‌లో…బీఆర్‌ఎస్‌కు ఎందుకా పరిస్థితి వచ్చింది? చివరికి పార్టీ జెండా దిమ్మె దగ్గరకు వచ్చే నాయకుడు లేనంతగా దిగజారిపోయిన ఆ సెగ్మెంట్ ఏది?
మేడ్చల్ జిల్లా శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం… తెలంగాణలోనే అత్యంత ఖరీదైన సెగ్మెంట్. ఐటీ సెక్టార్ విస్తరించిన ఏరియా. అత్యధిక జనసాంద్రత కలిగిన ప్రాంతం. అలాంటి శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకమైంది. 2023 ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరికెపూడి గాంధీ… తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసెంబ్లీ పీఏసీ ఛైర్మన్ పోస్ట్ దక్కించుకున్నారాయన. కానీ… తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని, ఆ పార్టీ కోటాలోనే తనకు పీఏసీ ఛైర్మన్ పోస్ట్ దక్కిందని చెబుతుంటారు గాంధీ. టెక్నికల్‌గా ఆయన అలా చెప్పినా….వాస్తవంలో మాత్రం పార్టీకి దూరమయ్యారన్నది లోకల్ కేడర్ మాట. గతంలో శేరిలింగంపల్లి బీఆర్‌ఎస్‌కు అంతా తానై వ్యవహరించేవారు గాంధీ. కానీ, ఇప్పుడాయన పార్టీకి దూరం కావడంతో పెద్ద దిక్కు కరవైంది. గతంలో బీఆర్‌ఎస్ కోసం పనిచేసిన నేతలంతా ఇప్పుడు అధికార పార్టీతో ఉన్న అరికెపూడి గాంధీ వెంటే తిరుగుతున్నారు. వరంగల్‌లో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు.. అన్ని నియోజకవర్గాల్లో సన్నాహాలు చేయగా… శేరిలింగంపల్లిలో మాత్రం ఆ ఊసే లేదు. ఇక చివరి నిమిషంలో పక్క నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావుకు బాధ్యతలు అప్పగించి జనసమీకరణ జరిపారట. నియోజకవర్గంలో పార్టీకి పూర్తి స్థాయి నాయకుడు లేకపోవడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం.
Read Also: Sindhu river: పాకిస్తాన్‌కి మరో షాక్.. “సింధు నదుల”పై 6 ప్రాజెక్టుల పనులు వేగవంతం..
అయితే, అధికారంలో ఉన్నప్పుడు ఐటీ సెక్టార్‌లో అంతా తానై… కేటీఆర్ ఇష్టంగా ఇక్కడ కార్యక్రమాలు చేశారని కార్యకర్తలు గుర్తు చేసుకుంటున్నారు. అలాంటి చోట ఇప్పుడు పార్టీ జెండా దిమ్మె దగ్గరికి వచ్చే దిక్కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలు. మరోవైపు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రస్తుతం శేరిలింగంపల్లి వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది.దీంతో రాబోయే రోజుల్లో ఆయనే శేరిలింగంపల్లి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో ఉంటారా అనే చర్చ మొదలైంది. అదే సమయంలో అదంత తేలికైన వ్యవహారం కాదన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం ఓటర్లు ప్రభావం ఎక్కువ. వాళ్ళు ఎటు మొగ్గితే ఆ పార్టీదే విజయం. అందుకు తగ్గట్టే… కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారే ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు.
Read Also: Robinhood: మే 10న ZEE5, జీ తెలుగులో రాబిన్‌హుడ్
కాగా, ఈ లెక్క ప్రకారం చూసుకుంటే… పార్టీ అధిష్టానం శంభీపూర్‌కు అవకాశం ఇవ్వకపోవచ్చన్న అభిప్రాయాలు సైతం ఉన్నాయి. అదే సామాజికవర్గానికి చెందిన బలమైన నాయకుడి కోసం చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే గాంధీతో పాటే జీహెచ్ఎంసి కార్పొరేటర్లు తొమ్మిది మంది కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పుడు ఒకే ఒక కార్పొరేటర్ గులాబీ పార్టీలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో…. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న శేరిలింగంపల్లి బాధ్యతలు గులాబీ బాస్ ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది.