Sindhu river: పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మందిని చనిపోయారు. ఈ ఘటన తర్వాత భారత్, పాకిస్తాన్‌ని తన నిర్ణయాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ముఖ్యంగా, ‘‘సింధు నది జలాల’’ ఒప్పందం నిలిపేసింది. 1960లో వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం దాయాది దేశంలో భయాన్ని పుట్టిస్తోంది. సింధు దాని ఉపనదులు పాకిస్తాన్ 80 శాతం ప్రజలకు జీవనాధారం. ఇప్పుడు, ఇండస్ వాటర్ ట్రిటీని నిలిపేయడంతో పాకిస్తాన్‌ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
ఇదిలా ఉంటే, తాజాగా భారత్ మరో నిర్ణయాన్ని తీసుకుంది జమ్మూ కాశ్మీర్‌లో సింధు, దాని ఉపనదులపై చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న జల విద్యుత్ ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. దీంతో 6 హైడ్రోపవర్ ప్రాజెక్టుల పనుల్ని వేగవంతం చేయనుంది. ఈ వారం అమిత్ షా అధ్యక్షతన దీనిపై సమావేశం జరుగబోతోంది. జల్ శక్తి (జల వనరులు) మంత్రి CR పాటిల్, విద్యుత్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సంబంధిత మంత్రిత్వ శాఖల కీలక అధికారులు ఈ సమావేశంలో పాల్గొననున్నారు.
Read Also: Pakistan: భారత్‌తో ఉద్రిక్తత.. రక్షణ బడ్జెట్‌ని 18% పెంచిన పాకిస్తాన్..
ఇప్పటికే, అమిత్ షా, జలవనరుల మంత్రి సీఆర్ పాటిల్‌తో రెండు సార్లు సమావేశమయ్యారు. గతంలో సింధు జలాల ఒప్పందం ప్రకారం, భారత్ ఏదైనా కొత్త ప్రాజెక్టు ప్రారంభిస్తే దానికి సంబంధించి పాకిస్తాన్‌కి 6 నెలల ముందు నోటీసులు అందించాలి. అయితే, ఇప్పుడు ఒప్పందం నిలిపేయడంతో పాకిస్తాన్‌కి సమాచారం ఇవ్వాల్సిన పని కూడా లేదు. ఈ పరిణామం భారత్‌కి చీనాబ్, జీలం నదులపై కొత్త ప్రాజెక్టులు నిర్మించడానికి, ప్రారంభించడానికి అవకాశాన్ని కల్పించింది. గతంలో పాక్ అడ్డుకున్న వులార్ సరస్సు ప్రాజెక్టు కూడా పునరద్ధరించే అవకాశం ఉంది.
ఈ జల విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయితే జమ్మూ కాశ్మీర్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 10,000 మెగావాట్లకు పెరుగుతుందని అంచనా. అదనంగా నీటి పారుదల, సాగు, తాగు నీటి లభ్యత గణనీయంగా పెరుగుతుంది. కాశ్మీర్ హిమాలయ ప్రాంతంలోని రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులలో రిజర్వాయర్ హోల్డింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి భారత్ ఇప్పటికే పనులు ప్రారంభించింది. ఈ పరిణామాలు అన్నీ చూస్తే రాబోయే కాలంలో పాకిస్తాన్‌కి గడ్డు పరిస్థితులు ఏర్పడటం సుస్పష్టం.