Off The Record: తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల విషయమై బీఆర్‌ఎస్ డైలమాలో పడిందా? లోకల్ బాడీస్‌లో తాడో పేడో తేల్చుకోవడానికి పార్టీ సిద్ధం చేసి పెట్టుకున్న అస్త్రాలు ప్రస్తుతం పని చేయకుండా పోయాయా? ఏం చేయాలో అర్ధంగాక… గులాబీ దళం ఇప్పుడు కొత్త ఆయుధాల కోసం వెదుకుతోందా? అసలు కారు పార్టీ ప్లాన్ ఏంటి? అదెలా తేడా కొట్టింది? ఇప్పుడేమని ఆలోచిస్తోంది?
Read Also: Urine: రాత్రుల్లో తరచూ మూత్రం వస్తుందా..? ఈ టిప్స్ పాటించండి..
తెలంగాణలో మరో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పార్టీలన్నీ లోకల్ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ… గత ప్రభుత్వ వైఫల్యాలను చెప్పడంతో పాటు ఈ ఏడాదిన్నరలో తామేం చేశామో కూడా ప్రజల ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది. గ్రామ పంచాయతీల సాక్షిగా ఎలాంటి పంచాయితీకైనా సిద్ధమంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికల్లో మా సత్తా ఏంటో చూపుతామని అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా ఇప్పటికే ప్రకటించింది. జరగబోయేది స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాబట్టి.. ఇందులో ముఖ్య పాత్ర పోషించే రైతులకు దగ్గరవ్వాలన్నది కారు పార్టీ ప్లాన్. ప్రస్తుతం రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్ని ప్రస్తావించి.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎలా చేశామో.. చెప్పాలని అనుకున్నారట. ఈ క్రమంలోనే.. పంచాయతీ ఎన్నికల్లో రైతు భరోసా అంశాన్ని ఎత్తుకోవాలని ప్లాన్ చేసుకున్నారట బీఆర్‌ఎస్ పెద్దలు. మేం అధికారంలో ఉన్నప్పుడు అందరికీ రైతు భరోసా స్కీమ్ అమలు చేశాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయలేకపోయిందని చెబుతూ.. అదే అంశాన్ని హైలైట్ చేసి రాజకీయ లబ్ది పొందాలనుకున్నట్టు సమాచారం.
Read Also: Off The Record: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీజేపీ సీబీఐ దర్యాప్తు కోరడం వెనుక మతలబేంటి?
కానీ, ఇప్పుడు ఆ ప్లానింగ్ మొత్తం తల్లకిందులైనట్టు తెలిసింది. ఏ రైతు భరోసానైతే.. ప్రచార అస్త్రంగా చేసుకుందామని బీఆర్‌ఎస్ అనుకుందో.. దాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అడ్వాన్స్ అయిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో.. గులాబీ పార్టీ చేతిలో ఉన్న ప్రధాన ఆయుధం పనిచేయకుండా పోయినట్టు అయింది అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈసారి రెండు మూడు రోజుల వ్యవధిలోనే రైతులందరి ఖాతాల్లో నిధులు జమ అయ్యాయి. దీంతో బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు రైతుల దగ్గర ఈ అంశాన్ని చర్చించే అవకాశం లేకుండా పోయిందన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కేసీఆర్ హయాంలో ప్రతిసారి సాగుకు ముందే.. రైతు బంధు ఇచ్చే వాళ్ళమని, కాంగ్రెస్ హయాంలో రైతు భరోసా పేరు చెప్పారుగానీ.. ఆ నిధులు ఇవ్వలేదన్న ప్రచారం చేయాలనుకున్నారట బీఆర్ఎస్ నాయకులు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుండడంతో ఇక ఆ విషయాన్ని మాట్లాడొద్దని అనుకుంటున్నట్టు తెలిసింది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల ముందు కాళేశ్వరం, బనకచర్ల అంశాలను కూడా గ్రామాల్లోకి తీసుకుపోవాలని అనుకున్నారని, ఇప్పుడు అవి కూడా రివర్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నట్టు అంచనా వేస్తున్నారు.
Read Also: Off The Record: వైసీపీ అధిష్టానం చెప్పినా ఆ ఇద్దరి నేతల మధ్య వైరం ఆగట్లేదా..?
అయితే, బనకచర్ల అంశాన్ని ప్రస్తావిస్తే… ఫైనల్‌గా తామే టార్గెట్ అయ్యే ప్రమాదం ఉందన్న చర్చ నడుస్తోందట గులాబీ వర్గాల్లో. ఇక స్థానిక ఎన్నికల్లో కాళేశ్వరం అంతగా ప్రభావం చూపబోదని లెక్కలేసుకుంటున్నారట. ఇక అటు చూస్తే.. గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదంటూ బీఆర్‌ఎస్ మీద మాజీ సర్పంచ్‌లు కోపంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. వాళ్ళందరూ ఈ ఎన్నికల్లో వ్యతిరేకంగా ప్రచారం చేసే ప్రమాదం ఉందన్న భయాలు పెరుగుతున్నట్టు సమాచారం. దీంతో స్థానిక ఎన్నికల్లో ఏం చేయాలి? ఏయే అంశాల్ని ప్రచారాస్త్రాలుగా మార్చాలన్న విషయంలో గులాబీ పెద్దలు మల్లగుల్లాలు పడుతున్నట్టు సమాచారం. అందుకే ప్లాన్ బీని అమలు చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం జమ అవుతున్న రైతు భరోసాలోనే తమకు కావాల్సిన పాయింట్‌ని వెదుక్కుంటున్నారట కారు పార్టీ నేతలు. గతంలో కేసీఆర్ నాట్లకు నాట్లకు మధ్య రైతు బంధు నిధులు జమ చేస్తే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి సర్కార్ ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా నిధులు వేస్తోందని ప్రచారం చేయాలనుకుంటున్నట్టు సమాచారం. ఈసారి ఎన్నికలు వచ్చాయి కాబట్టి రైతు భరోసా నిధులు వేశారని.. ఆ తర్వాత అసలు రైతులను పట్టించుకోబోరని చెప్పాలనుకుంటున్నారట బీఆర్ఎస్ నాయకులు. ఇంకా నోటిఫికేషన్ కూడా రాని స్థానిక సంస్థల ఎన్నికలపై ఇప్పటినుంచే ప్లాన్ చేస్తున్న గులాబీ దళం.. ఇక ఎన్నికల టైంకి ఏదైనా కొత్త అంశం దొరుకుతుందా అని ఎదురుచూస్తున్నట్టు తెలుస్తోంది. ఆ టైంకి రాజకీయాలు ఎలా మారతాయో చూడాలి మరి.