పాత సీసాలో కొత్త నీళ్ళు పోసేందుకు బీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోందా? నీళ్ళలో నిప్పులు రాజేసి పొలిటికల్‌గా గెయినయ్యే ప్రణాళికలు సిద్ధం చేస్తోందా? ప్రభుత్వానికి దీటుగా తమ ప్లాన్ ఉండేలా పార్టీ పెద్దలు జాగ్రత్త తీసుకుంటున్నారా? ఇంతకీ గులాబీ పార్టీ వ్యూహం ఎలా ఉండబోతోంది? గవర్నమెంట్‌ని ఏ రూపంలో కౌంటర్ చేయాలనుకుంటోంది? తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సెగలు పుట్టిస్తున్నాయి. నీళ్ళలో నిప్పులు రాజేయబోతున్నాయి. ఈ సెషన్ మొదలైన మొదటి రోజు జీరో అవర్‌లోనే హాట్ హాట్ చర్చ నడిచింది. ముఖ్యంగా పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల అంశం ఈసారి షేక్ చేయవచ్చంటున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే ప్రాజెక్ట్‌కు నీటి కేటాయింపులు తగ్గాయని అధికార కాంగ్రెస్ అంటుంటే…. ఇప్పుడు తక్కువ టీఎంసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకున్నట్టు ఆరోపిస్తోంది బీఆర్‌ఎస్.
ఈ విషయమై రెండు పార్టీల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళు జోరుగా నడుస్తున్నాయి. ఇదే అంశం మీద అసెంబ్లీలో కూడా హాట్ హాట్ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది. అయితే… చర్చలో మాజీ సీఎం కేసీఆర్ నేరుగా పాల్గొని గత ప్రభుత్వంలో పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు నీటి కేటాయింపుల వివరాలు చెబుతారని మొదట్లో ప్రచారం జరిగింది. కానీ… ఆయన మొదటి రోజు మాత్రమే సభకు హాజరయ్యారు. ఇక ఈ సెషన్‌లో కనిపించే అవకాశం లేదని కూడా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో కృష్ణా జలాల పంపకాలపై ప్రజల్లో విస్తృత చర్చ జరిగేలా… చర్యలు తీసుకోవాలని అనుకుంటోందట గులాబీ పార్టీ. అందుకోసం భిన్న వ్యూహాలను అనుసరించాలనుకుంటున్నట్టు సమాచారం. ముందుగా అసెంబ్లీలో తమ వాదనను వినిపిస్తూ…పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చినట్టుగానే తమకు కూడా సభలో పీపీ ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో కూడా ఇదే విషయంపై గట్టిగా పట్టుపట్టారు. అయితే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం ప్రభుత్వమే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా అదే జరగవచ్చని, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్‌కు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వకపోవచ్చని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అప్పట్లో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాకౌట్ చేసి వెళ్లారు. ఇప్పుడు తమ వంతు వచ్చింది కాబట్టి… ప్రభుత్వం ఇచ్చే పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను చూడకుండా వాకౌట్ చేసి వెళ్లాలా లేకుంటే… సస్పెండ్ అయ్యేదాకా గొడవ చేయాలా అన్న చర్చ జరుగుతోందట గులాబీ వర్గాల్లో.
ఏదో ఒక రూపంలో అలా సభ నుంచి బయటికి వచ్చి… తెలంగాణ భవన్ వేదికగా పెద్ద ఎత్తున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్‌కు కౌంటర్‌గా పార్టీ ఆఫీస్‌లో బీఆర్ఎస్ పీపీ భారీ ఎత్తున ఉండబోతున్నట్టు తెలుస్తోంది. దీని ద్వారా గత బీఆర్ఎస్ హయాంలో జరిగిన కేటాయింపులు, ప్రస్తుత కేటాయింపులకు సంబంధించిన వివరాలను ప్రజలకు చెప్తామంటోంది గులాబీ అధిష్టానం. ఇక ఈ వేదిక ద్వారానే ప్రజల్లోకి వెళ్లి తేల్చుకుందామంటూ… పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే ఏరియాలో బహిరంగ సభలకు తేదీలు ప్రకటించే అవకాశం ఉంది. అయితే… అసెంబ్లీలో మాట్లాడిన ప్రతి మాట ఆన్ రికార్డ్‌గా ఉంటుంది. బయట ఏ కార్యక్రమం చేసినా…అది పార్టీ వ్యవహారంగానే మిగిలిపోతుందన్న చర్చ సైతం ఉంది. ఆ సంగతి ఎలా ఉన్నా… ప్రభుత్వానికి కౌంటర్‌గా తాము ఇవ్వబోయే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ గురించి తెలంగాణ సమాజం మొత్తం మాట్లాడుకునేలా చేయాలన్నది బీఆర్‌ఎస్ వ్యూహంగా తెలుస్తోంది. ఇరిగేషన్ శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఈ ప్రజెంటేషన్ ఇస్తారు. మొత్తం మీద నీళ్ళలోనే నిప్పులు రగిల్చి… పాత వ్యూహానికి కొత్తగా పదును పెట్టాలన్నది బీఆర్‌ఎస్ వ్యూహంగా కనిపిస్తోందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.