సర్పంచ్ల సన్మాన సభ ఆ నియోజవర్గంలోని ఇద్దరు నేతల మధ్య చిచ్చుపెట్టిందా?సన్మాన సభను వాయిదా వేయడం వెనుక అసలు కారణం ఏంటి?ఈ వివాదం మరింత ముదురుతోందా?ఇంతకీ…ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? సిద్ధిపేట జిల్లా గజ్వేల్ బీఆర్ఎస్లో కీలక నేతల మధ్య లొల్లి ముదురుతోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచులను గెలిపించుకోవడంలో ఆ పార్టీ సక్సెస్ అయ్యింది. మాజీమంత్రి హరీశ్ రావు, గజ్వేల్ నియోజకవర్గ నేతలు ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి సర్పంచ్ ఎన్నికల గెలుపులో కీలక పాత్ర పోషించారు. అందరినీ సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చారు. అటు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా ఈసారి గజ్వేల్లో గట్టిపోటినే ఇచ్చింది. బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు ఎన్నికల్లో సర్పంచులుగా గెలుపొందడంతో వారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని పార్టీ ప్లాన్ చేసిందట. ఆ కార్యక్రమానికి హరీష్ రావును ముఖ్య అతిథిగా పిలిచారు. అందుకు ఆయన కూడా ఓ డేట్ ఫిక్స్ చేయడంతో నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సన్మాన సభ టైం దగ్గరికొచ్చింది. హరీష్ రావుకు మరోసారి కార్యక్రమం గురించి వంటేరు గుర్తుచేశారు. కానీ నియోజకవర్గంలో మరోనేత, ఎమ్మెల్సీ యాదవరెడ్డికి సన్మాన సభ విషయం చెప్పకపోవడం వివాదానికి దారి తీసినట్లు తెలుస్తోంది. తీరా సమయానికి ఆయనకు విషయం తెలియడంతో యాదవరెడ్డి అలిగారట.
తనకు తెలియకుండా, కనీసం సమచారం ఇవ్వకుండానే సర్పంచుల సన్మాన సభ నిర్వహించడంపై యాదవరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారం నడుస్తోంది. విషయం హరీశ్ రావుకు తెలియడంతో ఆయన కార్యక్రమాన్ని వాయిదా వేయాలని వంటేరును ఆదేశించారట. దీంతో అప్పటికప్పుడు సన్మాన కార్యక్రమం వాయిదా పడిందని సమాచారం. ఈ ఘటనతో సర్పంచ్లు నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. గజ్వేల్ బీఆర్ఎస్లోని వర్గ విబేధాలు బయటపడ్డాయన్న చర్చా జరుగుతోంది. అలాగే ఎమ్మెల్సీ యాదవరెడ్డి కూడా వంటేరు తీరును అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారనే ప్రచారం నడుస్తోంది. ఒకానొక సమయంలో యాదవరెడ్డి పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని రాజీనామా చేస్తారన్న విషయం కూడా బయటకు వచ్చిందట. వెంటనే రంగంలోకి దిగిన హరీశ్ రావు వంటేరు ప్రతాప్ రెడ్డి, యాదవరెడ్డిని పిలిచి సర్దిచెప్పడంతో ఈ వివాదం సద్దుమణిగిందనే టాక్ వినిపిస్తోంది.
ఇక…ఈ అంశంతో పాటు సర్పంచ్ అభ్యర్థులకు ఫండ్ పంపిణీ చేయడంలోనూ ఇద్దరి మధ్య గొడవ అయినట్టు సమాచారం. పార్టీ ఫండ్ ఇస్తే వంటేరు తన అనుచరులకే ఇచ్చారని…యాదవరెడ్డి తన అనుచరులకు ఇవ్వలేదని వాపోయారట. ఐతే ఈ విషయాన్ని వంటేరు వర్గం ఖండిస్తున్నట్లు తెలిసింది. ఓవరాల్ గా గజ్వేల్లో పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిపోటీనే ఇచ్చింది. అటు…రాబోయే పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు ఇప్పటి నుంచే బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోందట. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలవకూడదనే పట్టుదలతో ఉన్నారట బీఆర్ఎస్ నేతలు. అలా జరిగితే జనంలోకి వేరే సంకేతాలు వెళ్తాయని బీఆర్ఎస్ క్యాడర్ టెన్సన్లో ఉందట. ఇలాంటి సమయంలోనే ఇద్దరు నేతలు మాత్రం ఇలా విడిపోయి వాదులాటకు దిగడమేంటని బీఆర్ఎస్ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని సమాచారం. ప్రస్తుతానికైతే ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడినట్లు కనిపిస్తోంది. ముందుముందు ఏం జరుగుతుందోనన్న ఆందోళన పార్టీ నాయకుల్లో ఉందనే ప్రచారం జరుగుతోంది. మరి ఇక్కడితో ఇద్దరి నేతల మధ్య వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందో లేదా చూడాలి.