పేరెంట్ డిపార్ట్‌మెంట్ వద్దు… పక్క శాఖ ముద్దు అంటున్నారా మహిళా అధికారి. తన సొంత శాఖకు ప్రమోషన్ ఇచ్చి పొమ్మన్నా పట్టించుకోకుండా ఆలయ ఈవోగానే కొనసాగేందుకు ఇష్టపడుతున్నారు. ప్రత్యేకించి ఓ ప్రముఖ ఆలయ అధికారిగా ఉండేందుకు చివరిదాకా విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమైన ఆ అధికారి ఎవరు? పూజారులతో గొడవలు, పొలిటికల్ పరిచయాల సంగతేంటి? భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఈవో పోస్ట్‌కు యమ గిరాకీ ఉంటుంది. ఇక్కడ పోస్టింగ్‌ను అదృష్టంగా కూడా భావిస్తుంటారు చాలా మంది అధికారులు. సాధారణంగా ఈవోలంటే దేవాదాయ శాఖ అధికారులే ఉంటుంటారు. కానీ… ఇక్కడికి రావడానికి వాళ్ళకంటే ముందుగా రెవెన్యూ ఆఫీసర్స్ తహతహలాడుతుంటారు. డిప్యుటేషన్ వేయించుకుని మరీ ఆ ట్రయల్స్‌లో ఉంటారు. అలా ఎందుకంటే… అదంతే.. ఆ లెక్కే వేరు. భద్రాచలం ఈవోగా ఉంటే పలుకుబడి వేరే లెవల్ అన్నది ఎక్కువ మంది సమాధానం. రావడం వరకు సరేగాని… వచ్చిన వాళ్ళు టైం అయిపోయాక కూడా తిరిగి వెళ్ళడానికి ససేమిరా అంటున్నారట. అక్కడే అసలు సమస్య వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. భద్రాచలం ఆలయ ఈవోగా రెండేళ్ల క్రితం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు రమాదేవి. మధ్యలో కీసర ఆర్డీవోగా పోస్టింగ్ వస్తే దానిని రద్దు చేయించుకుని మరీ…తిరిగి ఈవోగా కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారామె. తర్వాత ఈనెలలో మరోసారి ట్రాన్స్‌ఫర్ అయింది మేడమ్‌కు.
అయినా సరే… వదల బొమ్మాళీ వదల… అంటూ… అంటి పెట్టుకుని ఉండటానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేసేశారట రమాదేవి. అంతే కాదు… పై స్థాయిలో తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని భద్రాచలంలోనే పోస్టింగ్ ఉండేలా జీవో కూడా ఇప్పించుకున్నారట. అయితే విషయం తెలిసి ఆ జీవో బయటకు రాకుండానే మళ్లీ ఇక్కడి వాళ్ళు ఓ మంత్రికి చెప్పి సదరు జీవోను క్యాన్సిల్ చేయించినట్టు చెప్పుకుంటున్నారు. ఆగస్ట్ రెండున మేడమ్‌కు ప్రమోషన్ ఇచ్చి మరీ రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. అయినా సరే… వెళ్ళకుండా ఆ పోస్టింగ్‌ను పెండింగ్‌లో పెట్టించుకుని మరీ భద్రాచలం ఈవోగా కొనసాగారట. ఆ తరువాత మళ్లీ ఈనెల పదకొండున గృహ నిర్మాణ శాఖ లో పోస్టింగ్ ఇచ్చారు. దాన్ని కూడా పెండింగ్‌లో పెట్టించుకుని మరీ… నిన్న మొన్నటిదాకా భద్రాచలం ఈవోగానే కొనసాగారంటే మేడమ్ ఎంత పవర్‌ఫుల్లో అర్ధం చేసుకోవచ్చంటున్నారు పరిశీలకులు. అయితే… ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. రమాదేవికి, ఆలయ అర్చకులకు మధ్య చాలా కాలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. దాదాపు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా ఉందట వాతావరణం. మేడమ్ వైఖరి మీద వాళ్ళంతా కలిసి ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఫిర్యాదు చేశారు.
ఈ పరిస్థితుల్లో తాజాగా ఆమెకు వేములవాడకు బదిలీ చేశారు. అంటే… తన పేరెంట్ డిపార్ట్‌మెంట్ అయిన రెవెన్యూలో ప్రమోషన్ ఇచ్చిమరీ రెండు సార్లు ట్రాన్స్‌ఫర్ చేసినా వెళ్ళకుండా… ఏదోరకంగా ఆపించుకుని భద్రాచలాన్ని వదలని రమాదేవి దేవాదాయ శాఖలో బదిలీకి మాత్రం ఓకే చెప్పడాన్ని బట్టి చూస్తుంటేనే… ఈ డిపార్ట్‌మెంట్ అంటే మేడమ్ ఎంత మక్కువో అర్ధం అవుతోందంటున్నారు ఇతర అధికారులు. అయితే… ఇక్కడ కూడా అమ్మగారి ట్విస్ట్‌లు ఆగలేదట. భద్రాచలం ఆలయ కొత్త ఈవోగా… రెవెన్యూ శాఖకే చెందిన దామోదర్ కు పోస్టింగ్ ఇచ్చారు. ఈ నెల 2నే ఆయన్ని భద్రాచలం ఆర్డీవో పోస్టు నుంచి రిలీవ్ చేసి దేవాదాయ శాఖకు పంపింది ప్రభుత్వం. కానీ… దామోదర్‌కు వెంటనే పోస్టింగ్ దక్కలేదు. ఎందుకంటే… మేడమ్‌గారు ఆ పోస్ట్‌ను వదలకపోవడమే కారణం అన్నది సమాధానం. ఇక దామోదర్‌కు కూడా ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండటంతో… గట్టిగా పట్టుబట్టి రాగలిగినట్టు చెప్పుకుంటున్నారు. భద్రాచలం కాకుంటే వేములవాడ కావాలని అడిగిమరీ అక్కడికి వెళ్ళారట రమాదేవి. మొత్తం మీద పేరెంట్ డిపార్ట్‌మెంట్‌ని వదిలేసి పక్క శాఖలో పెత్తనం కోసం ఈ ఆఫీసర్ పాకులాడటం చర్చనీయాంశం అయ్యింది.